7 పాటలూ మెలోడీలే కావాలని మెలోడి బ్రహ్మను అడిగాను: సాయి రాజేష్
కలర్ ఫొటో, బేబి వంటి కల్ట్ క్లాసిక్ చిత్రాలతో టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన మేకర్ సాయి రాజేశ్ రూపొందిస్తున్న సరికొత్త ప్రేమకావ్యం `చెన్నై లవ్ స్టోరీ`.
కలర్ ఫొటో, బేబి వంటి కల్ట్ క్లాసిక్ చిత్రాలతో టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన మేకర్ సాయి రాజేశ్ రూపొందిస్తున్న సరికొత్త ప్రేమకావ్యం `చెన్నై లవ్ స్టోరీ`. అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ రాజేశ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించగా, సాయి రాజేశ్ స్వయంగా కథను అందించారు. టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు `మెలోడీ బ్రహ్మ` మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రం నుండి సెకండ్ సింగిల్ `వదలనే..` అనే పాటను సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఒక అపూర్వమైన భారీ వేడుకలో ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి చేతుల మీదుగా లాంచ్ చేశారు. ఈ వేడుకకు టాలీవుడ్ టాప్ స్వరకర్తలైన మాధవపెద్ది సురేష్, కల్యాణి మాలిక్, అనూప్ రూబెన్స్, వివేక్ సాగర్, శ్రీచరణ్ పాకాల సహా దాదాపు డజను మంది సంగీత దర్శకులు విచ్చేసి చిత్ర యూనిట్‌ను ఆశీర్వదించారు.
ఈ వేడుకలో నిర్మాత సాయి రాజేష్ మాట్లాడుతూ.. మణిశర్మ నుండి ప్రేక్షకులు ఎంతో కాలంగా మిస్ అవుతున్న అద్భుతమైన మెలోడీలను మళ్లీ తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాకు ఏడు పాటలను మెలోడీలుగానే చేయించుకున్నామని వెల్లడించారు. ఇటీవల కాలంలో మణిశర్మ పూర్తి మెలోడీ ఆల్బమ్ చేయలేదని.. అందుకే ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి ఈ 7 మెలోడీలను స్వరపరిపించామని ఆయన పేర్కొన్నారు. `వదలనే..` సాంగ్ ఒక హార్ట్ బ్రేకింగ్ సిట్యువేషన్‌లో వస్తుందని డైరెక్టర్ రవి నంబూరి ఎంతో గట్స్‌తో ఈ భిన్నమైన అప్రోచ్ ఉన్న పాటను తెరకెక్కించారని ప్రశంసించారు. ఈ సాంగ్ మణిశర్మ కెరీర్ క్లాసిక్స్‌లో ఒక టాప్ సాంగ్ లా నిలిచిపోతుందని.. కిరణ్ అబ్బవరం అద్భుత నటనను బిగ్ స్క్రీన్ పైనే చూపించాలనే ఉద్దేశంతో లిరికల్ వీడియోలో జాగ్రత్తగా ఎడిట్ చేశామని సాయి రాజేష్ స్పష్టం చేశారు.
హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ ఈ వేడుకలో ఎంతో ఎమోషనల్ అవుతూ.. తాను ఒకప్పుడు సింగర్ కావాలని ప్రయత్నించిన రోజుల్లో ఏ కాంపిటేషన్‌కు వెళ్లినా మణిశర్మ గారి పాటలే పాడేదానినని గుర్తుచేసుకున్నారు. అలా తనను గాయనిగా ఇన్‌స్పైర్ చేసిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ సినిమాలో ఇప్పుడు హీరోయిన్‌గా నటించే అవకాశం రావడం ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. సంగీతానికి ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ చిత్రంలో తన క్యారెక్టర్ చుట్టూనే కథ రన్ అవుతుందని.. ఇంతమంది సంగీత దర్శకులతో వేదికను పంచుకోవడం ఒక మ్యూజిక్ లవర్‌గా మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ `వదలనే` పాట విన్న తర్వాత ప్రేక్షకులను అంత సులభంగా వదలదని శ్రీ గౌరి ప్రియ నమ్మకం వ్యక్తం చేశారు.
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. `చెన్నై లవ్ స్టోరీ` ఎలాంటి భారీ విజయాన్ని అందుకోబోతుందో చిత్ర యూనిట్‌కు ముందే పూర్తి నమ్మకం ఉందని.. సినిమాను త్వరగా రిలీజ్ చేయమని తానే ప్రొడ్యూసర్లను అడుగుతున్నానని నవ్వుతూ చెప్పారు. `వదలనే` పాట విజువల్స్ పాండిచ్చేరిలోని ఒక బ్యూటిఫుల్ టెంపుల్ బ్యాక్‌డ్రాప్‌లో పిక్చరైజేషన్ చేశామని.. డైరెక్టర్ రవి నంబూరి ఆ సీన్ వివరిస్తున్నప్పుడు తమ కళ్లు చెమర్చాయని ఆ ఎమోషనల్ క్షణాల గురించి వెల్లడించారు. ఈ పాటలోని సదరు సన్నివేశం తెలుగు సినిమాల్లోనే ఒక ఐకానిక్ సీన్‌గా మిగిలిపోతుందని అభివర్ణించారు. ఇప్పటికే విడుదలైన `గురుతుందా..` ఇప్పుడు వచ్చిన `వదలనే ..` పాటలతో పాటు మునుముందు రానున్న అన్ని సాంగ్స్ మణిశర్మ గారు అద్భుతంగా కంపోజ్ చేశారని.. థియేటర్ల నుండి బయటకు వచ్చాక కూడా ఈ పాట ప్రేక్షకులను హాంట్ చేస్తూనే ఉంటుందని చెప్పారు.
ఈ చిత్రానికి తెర వెనుక టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. దేవి పర్చూరి కాస్ట్యూమ్ డిజైనర్‌గా, భాస్కర్ ముదావత్ ఆర్ట్ డైరెక్టర్‌గా, సంతోష్ నాయుడు ఎడిటర్‌గా వ్యవహరిస్తుండగా, విశ్వాస్ డేనియల్ అద్భుతమైన విజువల్స్ అందిస్తూ డీవోపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం 7 మెలోడీల ఆల్బమ్‌తో ఆడియో పరంగానే కాకుండా విజువల్ ఎమోషన్స్‌తోనూ ప్రేక్షకుల మనసులను గెలుచుకోవడానికి సిద్ధమవుతోంది.