ఓపిక పట్టండి.. వివాదాల కోసం కన్నప్ప తీయలేదు
గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీలోనే కొనసాగుతున్న మంచు ఫ్యామిలీలకు కాంట్రవర్సీలు కొత్తవేమీ కాదు.;

టాలీవుడ్ లోని ప్రముఖ ఫ్యామిలీల్లో మంచు ఫ్యామిలీ కూడా ఒకటి. హీరోగా, విలన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా, నిర్మాతగా మంచు మోహన్ బాబు పెద్ద పెద్ద సక్సెస్‌లనే చూశారు. తన తర్వాత తన లెగసీని కంటిన్యూ చేయించాలనే ఆలోచనతో తన ముగ్గురు పిల్లలను కూడా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన పిల్లలు మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మి ముగ్గురూ ఇండస్ట్రీలోనే ఉన్నారు.
గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీలోనే కొనసాగుతున్న మంచు ఫ్యామిలీలకు కాంట్రవర్సీలు కొత్తవేమీ కాదు. రీసెంట్ గానే మంచు ఫ్యామిలీ వర్సెస్ మంచు మనోజ్ వివాదం ఎంత వరకు వెళ్లిందో అందరికీ తెలిసిందే. ఎప్పుడూ ఏదో కాంట్రవర్సీలో ఉండే మంచు ఫ్యామిలీకి గతంలో దేనికైనా రెడీ సినిమా టైమ్ లో కూడా పెద్ద ఎత్తున వివాదం జరిగింది. ఆ మూవీలో బ్రాహ్మణులను కించపరిచే సీన్స్ ఉన్నాయంటూ బ్రాహ్మణ వర్గం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయగా ఆ విషయంలో పెద్ద రచ్చే జరిగింది.
ఇప్పుడు మళ్లీ బ్రాహ్మణ వర్గం, మంచు ఫ్యామిలీ తీసిన కన్నప్ప సినిమాపై ఫైర్ అవుతున్నారు. కన్నప్ప సినిమాలో బ్రహ్మానందం, సప్తగిరి బ్రాహ్మణులుగా కనిపించబోతున్నారు. ఈ సినిమాలో వారికి పిలక, గిలక అనే పేర్లను పెట్టగా, బ్రాహ్మణ పాత్రలకు అలాంటి పేర్లు పెట్టడాన్ని వారు తప్పుబడుతున్నారు. కన్నప్ప సినిమా నుంచి ఆ రెండు పాత్రలను తొలగించాలని, లేదంటే సినిమాను ఆడనివ్వమని హెచ్చరిస్తున్నారు.
ఈ వివాదంపై తాజాగా మంచు విష్ణు రెస్పాండ్ అయి మాట్లాడాడు. కన్నప్ప సినిమాను ఎవరి మనోభావాలూ దెబ్బ తీయకుండా తీశామని, సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని, హిందూ సంప్రదాయాలను గౌరవిస్తూ, ఎంతో భక్తితో శివుడిని ఈ సినిమాలో చూపించామని విష్ణు చెప్పాడు. ప్రతీ రోజూ షూటింగ్ కు వెళ్లే ముందు భక్తితో పరమ శివుడిని పూజించి, వేద పండితుల ఆశీర్వచనం తీసుకునే వాళ్లమని విష్ణు తెలిపాడు.
వేద అధ్యాయనం చేసిన వారితో పాటూ పలు ఆధ్యాత్మిక వేత్తల నుంచి కన్నప్ప స్క్రిప్ట్ దశలోనే సలహాలు, సూచనలు తీసుకున్నామని, కన్నప్ప సినిమాను తీయడానికి గల ముఖ్య కారణం భక్తి తత్వాన్ని వ్యాపింప చేయడమే అని, వివాదాల కోసం కన్నప్ప సినిమాను తీయలేదని, సినిమా రిలీజయ్యే వరకు ప్రతీ ఒక్కరూ ఓపికతో ఉండాలని, ముందే ఓ డెసషన్ కు రావడం కరెక్ట్ కాదని విష్ణు తెలిపాడు. అయినా కన్నప్ప సినిమాను ఇప్పటికే శ్రీకాళహస్తి గుడికి చెందిన వేద పండితుకు చూపించామని, సినిమాలో ఒక్క సీన్ మీద కూడా వారు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని, ఏదైనా ఉంటే వాళ్లే చెప్పేవారు కదా అని విష్ణు తిరిగి ప్రశ్నించాడు. జూన్ 27న రిలీజ్ కాబోతున్న కన్నప్ప సినిమాపై విష్ణు మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు.