మన శంకర వరప్రసాద్ గారు మూవీ రివ్యూ

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు మూవీ రివ్యూ;

Update: 2026-01-11 20:23 GMT

మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ రివ్యూ

నటీనటులు: చిరంజీవి- నయనతార- వెంకటేష్ దగ్గుబాటి- సచిన్ ఖేద్కర్- కేథరిన్ థ్రెసా- జరీనా వాహబ్- శరత్ సక్సేనా- హర్షవర్దన్- అభినవ్ గోమఠం- మాస్టర్ రేవంత్- సుదేవ్ నాయర్ తదితరులు

సంగీతం: భీమ్స్ సిసిరోలియో

ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి

నిర్మాతలు: సాహు గారపాటి- సుష్మిత కొణిదెల

రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి

తన చివరి చిత్రం ‘భోళా శంకర్’తో అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశాడు మెగాస్టార్ చిరంజీవి. మళ్లీ ఓ మంచి సక్సెస్ కోసం చూస్తున్న ఆయన.. హిట్ మెషీన్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడితో జట్టు కట్టారు. వీరి కలయికలో తెరకెక్కిన చిత్రమే.. మన శంకర వరప్రసాద్ గారు. గత ఏడాది సంక్రాంతి పండక్కి వెంకీ హీరోగా తీసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’తో సంచలనం రేపిన అనిల్.. ఈసారి చిరు సినిమాతోనూ ఆకట్టుకున్నాడా? తెలుసుకుందాం పదండి.

కథ:

వరప్రసాద్ (చిరంజీవి) ఇంటలిజెన్స్ విభాగంలో అధికారి. హోం మంత్రి (శరత్ సక్సేనా)ని ఒక పెద్ద ప్రమాదం నుంచి వరప్రసాద్ కాపాడడంతో.. బదులుగా తనకేమైనా చేయాలనుకుంటాడు మినిస్టర్. అప్పుడే తన నుంచి విడిపోయిన భార్య శశిరేఖ (నయనతార) గురించి చెబుతాడు. మళ్లీ భార్యా పిల్లల్ని కలవాలని ఉన్నప్పటికీ వాళ్లను వరప్రసాద్.. మంత్రి సాయంతో మళ్లీ వారికి చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లేంటి.. ఇంతకీ భార్య నుంచి అతనెందుకు విడిపోయాడు.. శశిరేఖను అతను మళ్లీ మెప్పించి ఆమెకు చేరువ కాగలిగాడా.. పిల్లలు తనకు దగ్గరయ్యారా.. ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ:

ఒకప్పుడు వైభవం చూసిన స్టార్ హీరోలు.. ఇప్పుడు వారి స్థాయికి తగ్గ సినిమాలు అందించలేకపోతుంటే అభిమానుల బాధ వర్ణనాతీతం. ఆ స్థితిలో ఆ హీరోల స్టైల్.. వారి బలాన్ని అర్థం చేసుకుని.. అభిమానుల ఆకాంక్షలకు తగ్గట్లుగా చూపించి మెప్పించే దర్శకులు కొందరుంటారు. ‘గబ్బర్ సింగ్’తో హరీష్ శంకర్.. ‘ఓజీ’తో సుజీత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను అలాగే చూపించి అభిమానులను ఆనందంలో ముంచెత్తారు. మెగాస్టార్ చిరంజీవిని కొన్నేళ్ల ముందు బాబీ ‘వాల్తేరు వీరయ్య’లో వింటేజ్ స్టయిల్లో ప్రెజెంట్ చేసి అభిమానులను అలరిస్తే.. ఇప్పుడు అనిల్ రావిపూడి కూడా అదే బాట పట్టాడు. అనిల్ చాలా సినిమాల్లాగే ఇందులోనూ చెప్పుకోదగ్గ కథేమీ లేదు. ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేసే మలుపులు లేవు. పేలిపోయే ఎపిసోడ్లు లేవు. కామెడీ కూడా కడుపు చెక్కలయ్యేలా ఏమీ లేదు. కానీ రెండున్నర గంటల పాటు పెద్దగా బోర్ కొట్టించకుండా టైంపాస్ చేయించే వినోదానికి మాత్రం ఇందులో ఢోకా లేదు. అన్నింటికీ మించి చిరు ఫిల్మోగ్రఫీలోని టాప్ ఎంటర్టైనర్లను గుర్తుకు చేస్తూ సాగిన వింటేజ్ స్టైల్ వినోదం.. మెగా అభిమానుల కడుపు నింపేస్తుంది.

మెగాస్టార్ చిరంజీవి పెద్ద మాస్ హీరో. హీరోయిజాన్ని పండించడంలో ఆయన స్టైలే వేరు. డ్యాన్సులు.. ఫైట్ల గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. ఐతే చిరు గొప్పదనం గురించి మాట్లాడేటపుడు ఈ ప్రత్యేకతల గురించి మాట్లాడుకున్నంతగా.. ఆయన కామెడీ టైమింగ్ గురించి చర్చించుకోరు. స్టార్లు కామెడీ చేయడాన్ని హీరోయిజంలో భాగంగా పరిగణించకపోవడం అందుకు కారణం కావచ్చు. కానీ చిరు కామెడీ టైమింగ్ ను సరిగ్గా వాడుకుంటే ఏ స్థాయిలో వినోదం పండుతుందో.. ‘అన్నయ్య’ లాంటి సినిమాలు ఉదాహరణ. ఆ సినిమాలో కామెడీ క్లిప్స్ ఇప్పటికీ సామాజిక మాధ్యమాల్లో తిరుగుతుంటాయి. అందుకే అనిల్ రావిపూడి.. చిరులోని ఆ బలాన్ని ఫుల్లుగా వాడుకోవడానికి ప్రయత్నించాడు. కామెడీ రాయడంలో తీయడంలో అనిల్ పట్టు కూడా తోడవడంతో ‘మన శంకర వరప్రసాద్ గారు’లో నవ్వులకు ఢోకా లేకపోయింది. అలా అని ఇందులో పగలబడి నవ్వుకునే స్థాయిలో మాత్రం కామెడీ ఎపిసోడ్లు లేవు. ‘సంక్రాంతికి వస్తున్నాం’లో బుల్లిరాజు ఎపిసోడ్ లాంటిది ఇందులో లేకపోవడం మైనస్. ఇక ‘భగవంత్ కేసరి’ని మినహాయిస్తే.. అనిల్ సినిమాల్లో కథ ఎప్పుడూ వీకే. ఇది కూడా అందుకు మినహాయింపు కాదు. ఈ విషయంలో ఎంత తక్కువ అంచనాలతో ఉన్నా నిరాశ తప్పదు. చిరు రేంజికి ఇలాంటి కథా.. ఇలాంటి విలనా అనిపించేలా చిన్న పరిధిలో.. మరీ మామూలుగా సాగిపోయే స్టోరీ లైన్, విలన్ క్యారెక్టర్ నిరాశకు గురి చేస్తాయి.

తన నుంచి విడిపోయిన మాజీ భార్యను తిరిగి కలుసుకోవడానికి ఒక వ్యక్తి చేసే ప్రయత్నమే ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా. ఏదో ఒక కథంటూ ఉండాలి కాబట్టి మొక్కుబడిగా ఒక లైన్ అనుకున్నట్లుగా ఉంటుందే తప్ప ఎక్కడా స్టోరీని సీరియస్ గా తీసుకునే పరిస్థితి ఉండదు. మాజీ భార్యతో హీరో కలవడానికి కష్టపడే కథలు చాలా చూశాం కాబట్టి కొత్తగా ఏమీ అనిపించదు. ఐతే అనిల్ ఫోకస్ అంతా.. చిరును ఈ వయసులో ది బెస్ట్ గా ఎలా ప్రెజెంట్ చేయాలి.. ఆయన కామెడీ టైమింగ్ ను ఎలా వాడుకోవాలన్న దాని మీదే నిలిచింది. చిరు సినిమాలు ఎన్నింటినో స్టడీ చేసి సన్నివేశాలు రాసుకున్నట్లుగా అనిపిస్తుంది. ‘‘మిస్ జ్వాలా.. ఆ రోజు రాత్రి ఏం జరిగింది’’ అన్న డైలాగులు పలికినపుడు ‘చంటబ్బాయి’.. తన మామను ఏడిపిస్తున్నపుడు.. డ్యాన్స్ చేస్తున్నట్లుగా నడిచి వస్తున్నపుడు ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’.. ‘‘నా వాట్సాప్ నంబర్ అన్ బ్లాక్ చేయవా’’ లాంటి డైలాగులు చెప్పినపుడు ‘జై చిరంజీవ’, ‘అన్నయ్య’.. ఇలా చాలా సినిమాలను గుర్తు చేస్తూ చిరు అభిమానులకు నోస్టాల్జిక్ ఫీలింగ్ ఇస్తూ సన్నివేశాలను నడిపించాడు అనిల్. చిరు అభిమానులే కాక సామాన్య ప్రేక్షకులూ ఎంజాయ్ చేసేలాగే సాగుతాయి ఈ సీన్లు. ఆరంభ సన్నివేశాల నుంచి చిరు ఒక టెంపోలో కనిపిస్తాడు. ఒక టైమింగ్ సెట్ చేసుకుని.. అదే ఫ్లోలో చివరి వరకు సాగిపోయాడు. ఎక్కడా బ్రేక్ అన్నదే లేదు.

కామెడీ ప్రధానంగా సాగే సినిమాలో అక్కడక్కడా ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చాడు దర్శకుడు. తండ్రి-పిల్లల మధ్య వచ్చే సన్నివేశాలు టచింగ్ గా అనిపిస్తే.. అలాగే అత్తాకోడళ్ల మధ్య ఒక సీన్ ఆలోచింపజేసేలా ఉంటుంది. భర్తలను ఏడిపించే భార్యల మీద సెటైరిగ్గా నడిపిన ఒక ఎపిసోడ్ కూడా బాగానే పేలింది. ఐతే ప్రథమార్ధంలో ఉన్న వేగం.. ద్వితీయార్ధంలో కనిపించదు. కథ మీద ముందే ఒక ఐడియా వచ్చేయడం.. కొత్తగా ఏమీ లేకపోవడం.. సన్నివేశాలు రిపిటీటివ్ గా అనిపించడం ఫ్లోను కొంచెం దెబ్బ తీశాయి. వెంకటేష్ రంగప్రవేశంతో కొంచెం ఉత్సాహం వస్తుంది. చిరు-వెంకీ సీన్లు ఆహా ఓహో అనుకునే రేంజిలో లేకపోయినా.. సినిమా కొంచెం డల్లుగా నడుస్తున్న టైంలో ఉత్సాహాన్ని తీసుకొస్తాయి. క్లైమాక్స్ అయితే సాధారణంగా అనిపిస్తుంది. ఓవరాల్ గా ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిరును వింటేజ్ స్టైల్లో ప్రెజెంట్ చేస్తూ.. టైంపాస్ వినోదాన్ని అందించడంలో సక్సెస్ అయింది. సంక్రాంతి టైంలో ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా ఫ్యామిలీతో రెండున్నర గంటలు కాలక్షేపం చేయడానికి ఢోకా లేని సినిమా ఇది.

నటీనటులు:

‘మన శంకర వరప్రసాద్ గారు’ మేకింగ్ దశలో ఉండగా.. విడుదల ముంగిట చిరు అభిమానుల్లో ఎన్నో భయాలు-సందేహాలు కలిగి ఉండొచ్చు కానీ.. సినిమా మొదలైన కాసేపటికే అవన్నీ దూదిపింజల్లా ఎగిరిపోతాయి. చిరు ఎంతో ఓన్ చేసుకుని చేసిన క్యారెక్టర్ ఇదని అర్థమవుతుంది. చిరు లుక్.. స్టైలింగ్ లో కొన్ని చోట్ల అసహజత్వం ఇబ్బంది పెడుతుంది కానీ.. ఈ వయసులో ఆయన్ని ఉన్నంతలో ది బెస్ట్ గానే చూపించాడు అనిల్. నయనతార శశిరేఖ పాత్రకు పర్ఫెక్ట్ గా కుదిరింది. ఆ పాత్రకు ఆమె పూర్తి న్యాయం చేసింది. ఇదేమీ అరుదైన పాత్ర కాదు కానీ.. క్యారెక్టర్ తీరును బట్టి చూస్తే ఆమె మాత్రమే చేయగలదిగా అనిపిస్తుంది. సొంతంగా తనే డబ్బింగ్ కూడా చెప్పుకోవడం, అది బాగుండడం విశేషం. సచిన్ ఖేద్కర్ హీరోయిన్ తండ్రి పాత్రలో బాగా చేశాడు. వెంకటేష్ ఉన్న 20 నిమిషాలు ఆకట్టుకున్నాడు. కేథరిన్ థ్రెసా.. హర్షవర్ధన్.. అభినవ్ గోమఠం.. తమ పాత్రల పరిధి మేరకు నటించారు. విలన్ సుదేవ్ నాయర్ జస్ట్ ఓకే అనిపిస్తాడు. తన పాత్రలో పెద్దగా విషయం లేదు. చిరు తల్లి పాత్రలో జరీనా వాహబ్ తక్కువ సన్నివేశాల్లోనే తన ప్రత్యేకతను చాటుకున్నారు. ‘సంక్రాంతి వస్తున్నాం’ బుల్లి రాజు పాత్రధారి రేవంత్.. ఇందులో మామూలే. చాన్నాళ్ల తర్వాత తెలుగు స్క్రీన్ మీద కనిపించిన శరత్ సక్సేనా జస్ట్ ఓకే అనిపించాడు.

సాంకేతిక వర్గం:

భీమ్స్ సిసిరోలియో పాటలు ఆకట్టుకుంటాయి. అన్నింట్లోకి శశిరేఖ పాట హైలైట్ గా నిలిచింది. ఈ పాట టైమింగ్- చిత్రీకరణ బాగా కుదిరాయి. హుక్ స్టెప్ సాంగ్.. మీసాల పిల్ల కూడా ఆకట్టుకుంటాయి. భీమ్స్ నేపథ్య సంగీతం మాత్రం సోసోగా సాగింది. సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ కలర్ ఫుల్ గా సాగాయి. సినిమాలో క్వాలిటీకి ఢోెకా లేదు. అవసరమైన మేర ఖర్చు పెట్టారు. రిచ్ గా తీశారు. అనిల్ రావిపూడి తన నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తారో అదే ఇచ్చాడు. హీరోల శైలికి తగ్గట్లు ఎపిసోడ్లను క్రియేట్ చేయడంలో తన ప్రత్యేకతను మరోసారి ఇందులో చూడొచ్చు. ‘వాల్తేరు వీరయ్య’లో బాబీ వింటేజ్ చిరు తాాలూకు టీజర్ అందిస్తే.. ఇందులో ట్రైలర్ చూపించాడు అనిల్. ఆయన కామెడీ టైమింగ్ ను అతను భలేగా వాడుకున్నాడు. ఐతే ఇది బాగున్నప్పటికీ.. చిరు స్థాయికి తగ్గ కథ అయితే అతను రాయలేదు. అతను నవ్వించాడు కానీ.. మరీ పేలిపోయే కామెడీ ఎపిసోడ్లు క్రియేట్ చేయలేకపోయాడు. కథ.. కామెడీ విషయంలో అతను మరింత కసరత్తు చేసి ఉంటే ‘మన శంకర వరప్రసాద్ గారు’ స్పెషల్ మూవీగా నిలిచేది.

చివరగా: మన శంకర వరప్రసాద్ గారు.. వింటేజ్ చిరు విన్యాసం

రేటింగ్ - 3/5


Tags:    

Similar News