ఎవరూ నాకు 'సైకో' రోల్ ఇవ్వరు.. అందుకే అలా చేశా: మెగాస్టార్
మాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విభిన్న పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన మమ్ముట్టి.. ఎప్పటికప్పుడు తన యాక్టింగ్ తో అలరిస్తూనే ఉంటారు.;
మాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విభిన్న పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన మమ్ముట్టి.. ఎప్పటికప్పుడు తన యాక్టింగ్ తో అలరిస్తూనే ఉంటారు. ఆయన నటించిన చిత్రం కలాం కావల్ గురించి తాజాగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆ సినిమాను ఆయన స్వయంగా తన నిర్మాణ సంస్థ మమ్ముట్టి కంపెనీ బ్యానర్ పై నిర్మించడం వెనుక ఉన్న కారణాలు ఒక ఇంటర్వ్యూలో వివరించారు.
మమ్ముట్టి మాట్లాడుతూ.. ఆ చిత్రంలో తాను పోషించిన పాత్ర సాధారణం కాదని, నెగటివ్ షేడ్స్ తో కూడిన సైకోపాత్ పాత్ర అని చెప్పారు. అలాంటి రోల్ లో తనను చూపించడానికి చాలా మంది నిర్మాతలు ముందుకు రారని, అందుకే తానే నిర్మాణ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఒకే రకమైన పాత్రలు వరుసగా చేస్తూ పోతే నటనలో వైవిధ్యం ఉండదని, కొత్త కోణాల్లో కనిపించడం అవసరమని చెప్పుకొచ్చారు.
అయితే కలాం కావల్ సినిమాలో మమ్ముట్టి స్టాన్లీ దాస్ అనే క్రూరమైన సీరియల్ కిల్లర్ పాత్రలో నటించారు. కనికరం లేని స్వభావం, మానసిక వికారంతో కూడిన పాత్రలో ఆయన యాక్టింగ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. అణువణువు విషం నింపుకొన్న సైకో కిల్లర్ గా అదరగొట్టారు. తన స్టార్ ఇమేజ్ ను పక్కన పెట్టి ఇలాంటి డేరింగ్ రోల్ చేయడం ఆయన ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
కలాం కావల్ సినిమా కథ నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందింది. ముఖ్యంగా సైనైడ్ మోహన్ కేసు ఆధారంగా తీసుకుని ఆ సినిమాను తెరకెక్కించారు. ఒక చిన్న గ్రామంలో ప్రారంభమైన సాధారణ పోలీస్ విచారణ ఎలా భయానకమైన హత్యల సిరీస్ ను బయటపెడుతుందనే అంశం చుట్టూ కథ నడుస్తుంది. మహిళల అదృశ్యాలు, వాటి వెనుక దాగి ఉన్న నరమేధం వంటి అంశాలు కథను మరింత థ్రిల్లింగ్ గా మలుస్తాయి.
చిత్రంలో వినాయకన్ పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో నటించగా, రజీషా విజయన్, శృతి రామచంద్రన్, మాళవిక మీనన్ కీలక పాత్రలు పోషించారు. దర్శకుడు జితిన్ కె. జోష్ సినిమాను అత్యంత ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు. 74 ఏళ్ల వయసులో కూడా మమ్ముట్టి ఇలాంటి సవాళ్లను స్వీకరించడం విశేషం. తన నటనతో ప్రేక్షకులను భయపెట్టడమే కాకుండా ఆకట్టుకునేలా చేయగలిగారు.
ఆ చిత్రం 2025 డిసెంబర్ లో థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా సక్సెస్ సాధించింది. తర్వాత ఈ ఏడాది జనవరిలో ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లివ్ లో విడుదలైంది. ప్రస్తుతం తెలుగు, మలయాళం, హిందీతో పాటు పలు భాషల్లో స్ట్రీమింగ్ అవుతూ మరింత మంది ప్రేక్షకులను అలరిస్తోంది. మొత్తానికి కలాం కావల్ ద్వారా మమ్ముట్టి మరోసారి తన యాక్టింగ్ టాలెంట్ ను నిరూపించుకున్నారు. కథల ఎంపికలో, పాత్రల విషయంలో కొత్తదనాన్ని చూపిస్తూ ఆయన ముందుకు సాగుతున్న తీరు ఇన్స్పిరేషన్ గా నిలుస్తోంది.