ఇలా చేయడం.. మమ్ముట్టికి మాత్రమే సాధ్యం
ఇప్పుడు మమ్ముటి కొత్త సినిమా కలంకవల్ చూసి మరోసారి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇందులో ఆయనది సీరియల్ సైకో కిల్లర్ పాత్ర కావడం విశేషం.;
నాలుగు దశాబ్దాలకు పైగా నట ప్రస్థానం.. 400కు పైగా సినిమాలు.. లెక్కలేనన్ని బ్లాక్‌బస్టర్లు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పురస్కారాలు.. అయినా సరే మమ్ముట్టిలోని నటుడి ఆకలి తీరట్లేదు. స్వాతికిరణం సహా కొన్ని చిత్రాలతో తెలుగు వారినీ అమితంగా ఆకట్టుకున్న ఈ మలయాళ లెజెండరీ నటుడు.. 74 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన పాత్రలు, సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు.
కొంచెం స్టార్ ఇమేజ్ రాగానే.. ఇమేజ్ ఛట్రంలో కూరుకుపోయి డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు చేయడానికి విముఖత చూపుతుంటారు హీరోలు. అలాంటిది అంత పెద్ద స్టార్ అయి ఉండి మమ్ముట్టి చేసే పాత్రలు చూసి అవాక్కవ్వకుండా ఉండలేం. రెండేళ్ల ముందు కాదల్ అనే సినిమాలో మమ్ముట్టి క్యారెక్టర్ చూసి షాకవ్వని ప్రేక్షకుడు లేడు. అందులో ఆయనది స్వలింగ సంపర్కుడి పాత్ర కావడం గమనార్హం. గత ఏడాది భ్రమయుగం అనే సినిమాలో నెగెటివ్ రోల్ చేసి ఇంకో పెద్ద షాకిచ్చాడు మమ్మూకా.
ఇప్పుడు మమ్ముటి కొత్త సినిమా కలంకవల్ చూసి మరోసారి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇందులో ఆయనది సీరియల్ సైకో కిల్లర్ పాత్ర కావడం విశేషం. రిలీజ్ ముందు వరకు ఈ విషయం లీక్ కాకుండా చూసుకుంది టీం. ఇందులో జైలర్ విలన్ వినాయకన్ కీలక పాత్ర చేశాడు. క్రైమ్ థ్రిల్లర్ అనగానే ఇందులో మమ్ముట్టి హీరో అని.. వినాయకన్ విలన్ అని అనుకున్నారు చాలామంది. కానీ సినిమా చూశాక పాత్రలు రివర్స్ కావడంతో ఆడియన్స్‌కి దిమ్మదిరిగిపోయింది. ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. వసూళ్లు కూడా అదిరిపోతున్నాయి. విలన్ పాత్రలో మమ్ముట్టి నటనకు జనం ఫిదా అయిపోతున్నారు. తనే సినిమాకు ప్రధాన ఆకర్షణ అంటున్నారు.
జితిన్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమాను స్వయంగా మమ్ముట్టే ప్రొడ్యూస్ చేయడం విశేషం. సొంత బేనర్లో సినిమా అంటే హీరోయిజం మీదే ఫోకస్ పెడతారు స్టార్ హీరోలు. కానీ ఇలా విలన్ పాత్ర చేయడం మమ్ముట్టికే చెల్లింది. మమ్ముట్టి గొప్పదనానికి మరో రుజువు ఏంటంటే.. ఇందులో తాను విలన్, వినాయకన్ హీరో కాబట్టి పోస్టర్లలో వినాయకన్ పేరే ముందు వేసి, తన పేరును వెనుక వేయించాడు. ఒక రకంగా ఇందులో తాను విలన్ అనే విషయాన్ని మమ్ముట్టి ముందే హింట్ ఇచ్చాడు కూడా. కానీ సినిమా చూశాకే అసలు విషయం అర్థమైంది. అంత పెద్ద స్టార్ అయి ఉండి.. ఇలా చేయడం మమ్ముట్టికే సాధ్యం అని అందరూ ఆయన్ని కొనియాడుతున్నారు.