ప్రదర్శన విధానంపైనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి!
తాజాగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన `మీట్ ద ప్రెస్` కార్యక్రమం చిత్ర పరిశ్రమలోని ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టింది. ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై చిన్న సినిమాల నిర్మాణం గురించి స్పందించారు.;
ప్రస్తుతం చిన్న సినిమాల నిర్మాణం అన్నది పూర్తిగా తగ్గిపోయింది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోవడం, రిలీజ్ చేసే సమయానికి సరైన థియేటర్లు దొరక్కపోవడం సహా చాలా కారణాలే ఉన్నాయి. తాజాగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన `మీట్ ద ప్రెస్` కార్యక్రమం చిత్ర పరిశ్రమలోని ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టింది. ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై చిన్న సినిమాల నిర్మాణం గురించి స్పందించారు. చిన్న సినిమా అనేది ఇండస్ట్రీకి ఒక విత్తనం వంటిదన్నారు. నేడు మనం చూస్తున్న స్టార్ హీరోలు, అగ్ర దర్శకులం దరూ చిన్న సినిమాల నుంచే ఎదిగారని గుర్తుచేశారు. డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్ల దోపిడీ వల్ల చిన్న నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో 3-4 వేలు వసూలు చేస్తుంటే, మన వద్ద రూ. 10 వేల వరకు వసూలు చేయడం వల్ల వంద థియేటర్లలో విడుదల చేసే చిన్న నిర్మాతపై అదనంగా రూ. 10 లక్షల భారం పడుతోందని, ఇది వారిని నిర్మాణానికి దూరం చేస్తోందని విశ్లేషించారు.
అలాగే పరిశ్రమలో నెలకొన్న గిల్డ్' సంస్కృతిపై చదలవాడ ఘాటుగా స్పందించారు. గిల్డ్‌ను ఒక విషపురుగుగా అభివర్ణిస్తూ కేవలం నలుగురు పెద్ద వ్యక్తులు కలిసి వ్యాపారం కోసం విడిపోవడం వల్ల చిన్న నిర్మాతలకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. ప్రభుత్వం గిల్డ్ సభ్యులను కాకుండా, ఓట్లు వేసి గెలిపించే చిన్న నిర్మాతలు మరియు కార్మికులను ప్రోత్సహించాలని కోరారు. పెద్ద నిర్మాతల వెనుక తిరగడం కంటే, పరిశ్రమను నమ్ముకున్న సామాన్య నిర్మాతలకు అండగా నిలవడమే ప్రభుత్వ బాధ్యత అని విజ్ఞప్తి చేసారు.
థియేటర్ల లభ్యత , ఓటీటీ ఒప్పందాలపైనా స్పందించారు. చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడమే గగనమైపోయిందని పేర్కొన్నారు. థియేటర్లలో తినుబండారాల అధిక ధరల వల్ల సామాన్య ప్రేక్షకుడు సినిమాకు దూరం అవుతున్నాడని, ఇది చిన్న సినిమాల కలెక్షన్లపై దెబ్బ కొడుతోందని అన్నారు. ప్రభుత్వం తన విధానాలను మార్చుకుని, ప్రతి కమ్యూనిటీలో 50 నుంచి 200 సీట్ల సామర్థ్యం గల మినీ థియేటర్ల నిర్మాణానికి సపోర్ట్ చేయాలని, అప్పుడే వైవిధ్యమైన కథలతో వచ్చే చిన్న చిత్రాలకు గుర్తింపు లభిస్తుందని సూచించారు.
నిర్మాత విలువ తగ్గిపోవడంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిర్మాత క్యాష్ బ్యాంక్ లాగా మారడానికి కారణం మనమే. సరిగ్గా ప్లాన్ చేసే నిర్మాత ఎవరికీ లొంగడన్నారు. తాను గతంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి దిగ్గజాలతో పెద్ద సినిమాలు తీశానని, కానీ నేటి కాలంలో హీరోలలో అప్పటి సిన్సియారిటీ, హానెస్టీ కనిపించడం లేదని అందుకే తాను చిన్న సినిమాలు తీస్తున్నానని చెప్పారు. క్రమశిక్షణతో షూటింగ్ ప్లాన్ చేసుకుంటే రూ. 3 నుంచి 5 కోట్లలోనే క్వాలిటీ సినిమా తీయవచ్చన్నారు.
అలాగే ఫిల్మ్ జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. గద్దర్ అవార్డులు , ఇతర ప్రభుత్వ పురస్కారాలు కేవలం రెగ్యులర్ ఫీల్డ్ జర్నలిస్టులకే దక్కేలా నిబంధనలు ఉండాలని డిమాండ్ చేశారు. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులను కాదని ఎక్కడో ఉండే ఫ్రీలాన్సర్లకు అవార్డులు ఇవ్వడం సరికాదని, దీనిపై ప్రభుత్వం వద్ద గట్టిగా రిప్రజెంట్ చేస్తామన్నారు.
అలాగే కార్యక్రమంలో భాగంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ప్రభు రాసిన `శూన్యం నుండి శిఖరాగ్రం వరకు` పుస్తకం గద్దర్ అవార్డ్ సాధించిన సందర్భంగా చదలవాడ చేతుల మీదగా చిరు సత్కారం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బత్తుల ప్రసాద్ , సెక్రటరీ సురేష్ కొండేటి, ప్రసన్న కుమార్ సహా పలువురు సీనియర్ పాత్రికేయులు పాల్గొని చిన్న సినిమాలకు మద్దతు ప్రకటించారు.