తుంటి గాయంపై ర‌ష్మిక చికాకు.. గ‌తంలో న‌భా కూడా!

నటి రశ్మిక మందన్న ఇటీవల ఒక చిత్రంలో డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా తీవ్రంగా గాయపడి.. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు ఆరు వారాల పాటు బెడ్ రెస్ట్‌ తీసుకుంటున్న విషయం తెలిసిన‌దే.

Update: 2026-08-03 18:31 GMT

నటి రశ్మిక మందన్న ఇటీవల ఒక చిత్రంలో డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా తీవ్రంగా గాయపడి.. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు ఆరు వారాల పాటు బెడ్ రెస్ట్‌ తీసుకుంటున్న విషయం తెలిసిన‌దే. ఈ కాలి గాయంపై సోషల్ మీడియా (ఇన్‌స్టాగ్రామ్) వేదికగా స్పందిస్తూ తన ఆవేదనను షేర్ చేసారు. రెగ్యుల‌ర్ గా ఇలా గాయపడటం తనకు తీవ్రమైన చిరాకు పుట్టిస్తుంద‌ని.. అసలు ఈ విషయం ఎవరికీ తెలియకూడదని భావించినా బయటకు వచ్చేసిందని తెలిపారు. తనకు ఇలాంటి గాయం కావడం ఇది మూడోసారి అని రశ్మిక ఈ సందర్భంగా పేర్కొన్నారు. గ‌తంలో జిమ్ లో గాయ‌ప‌డిన‌ప్పుడు ఆ బాధ‌తోనే సినిమా ప్ర‌మోష‌న్ల‌కు హాజ‌రు కావాల్సి వ‌చ్చింది.




 


తన గాయం తీవ్రత గురించి వివరిస్తూ.. తుంటికి కాలుని కలిపే టెండన్స్ ప్రతి వైపు నాలుగు ఉంటాయని అయితే ప్రమాదవశాత్తూ తన కుడి తుంటిలోని ఒక టెండన్ ఊడిపోయిందని రశ్మిక వెల్లడించారు. తాను కాలు పైకి ఎత్తాలన్నా... సాధారణంగా కదలాలన్నా ఆ టెండెన్ మళ్లీ సరిగ్గా అతుక్కోవాల్సి ఉందన్నారు. `మైసా` సినిమా కోసం డ్యాన్స్ షూటింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని..తాను ఇప్పటివరకు అంగీకరించిన చిత్రాల్లో `మైసా` అత్యంత కష్టమైనదని చెప్పారు. అయితే నిరంతరం షూటింగ్స్‌తో బిజీగా ఉండే తనకు కాస్త విశ్రాంతిని ఇవ్వడానికే దేవుడు ఈ రూపంలో గాయాన్ని ప్రసాదించాడని పాజిటివ్‌గా భావిస్తున్నట్లు రశ్మిక‌ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం రశ్మిక మందన్న `రణబాలి`, `మైసా` చిత్రాల చిత్రీకరణల్లో పాల్గొనడమే కాకుండా మరికొన్ని భారీ ప్రాజెక్టులలో నటిస్తున్నారు. అంతేకాకుండా సుమారు 30కి పైగా ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. తుంటి గాయం కావడంతో సదరు చిత్రాల షూటింగ్స్‌తో పాటు, పలు ప్రకటనల చిత్రీకరణలు కూడా తాత్కాలికంగా నిలిచిపోయాయి. రశ్మిక త్వరగా కోలుకుని మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టాలని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.

ఇటీవ‌ల ఎందుకో ఇన్ని ప్ర‌మాదాలు?

ఇటీవలి కాలంలో సినీ పారిశ్రామిక వర్గాల్లో .. వేడుకలలో నటీనటులు బ్యాండేజీలు, కట్టులతో కనిపించడం సర్వసాధారణంగా మారింది. పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర కథానాయకులు షూటింగ్స్ - రిస్కీ యాక్షన్ సన్నివేశాలలో పాల్గొంటూ గాయపడి పలు వేడుకల్లో కట్టుతో కనిపించిన సందర్భాలు ఉన్నాయి. అదే బాటలో ఇటీవల నటి రశ్మికా మందన్న కూడా డ్యాన్స్ ప్రాక్టీస్‌లో తుంటికి తీవ్ర గాయం కావడంతో కొన్ని వారాల పాటు రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో కథానాయిక నభా నటేష్ సైతం తీవ్రమైన రోడ్డు ప్రమాదానికి గురై, సుదీర్ఘకాలం పాటు బెడ్ రెస్ట్‌కే పరిమితమవ్వాల్సి వచ్చింది. ఆ సమయంలో శారీరక వేదనతో పాటు తీవ్రమైన మానసిక చికాకును ఎదుర్కొన్నానని.. అయితే ఆ ప్రతికూల పరిస్థితుల నుంచి పట్టుదలతో కోలుకుని తిరిగి వెండితెరపై గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చానని నభా పలు ఇంటర్వ్యూలలో తెలిపారు.

కేవలం వీళ్లు మాత్ర‌మే కాకుండా, టాలీవుడ్- బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు కూడా వివిధ సందర్భాల్లో గాయాల బారిన పడి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. `పుష్ప 2` చిత్రంలో భారీ యాక్షన్ సీన్స్ చేస్తున్న సమయంలో అల్లు అర్జున్ బ్యాక్ పేయిన్ స‌హా గాయాల బారిన పడగా... వరుణ్ తేజ్, సందీప్ కిషన్ వంటి యువ హీరోలు కూడా రిస్కీ స్టంట్స్ వల్ల ఆసుపత్రి పాలు కావాల్సి వచ్చింది. ఇక బాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణే, శ్రద్ధా కపూర్ వంటి తారలు యాక్షన్ సీక్వెన్సుల చిత్రీకరణలో గాయపడి షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చారు. సినిమాల నిర్మాణంలో నాణ్యత, రియలిస్టిక్ స్టంట్స్ కోసం తారలు పడే ఈ శ్రమ వారిని రిస్కులోకి నెడుతున్నా.. ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నా ప‌ట్టుద‌ల‌గా కోలుకుని తిరిగి కెరీర్‌పై దృష్టి సారించడం వారి వృత్తిపరమైన అంకితభావానికి నిదర్శనంగా నిలుస్తోంది.




Tags:    

Similar News