ఆయన కోసమే అగధ ఒప్పుకున్నా - కామాక్షి భాస్కర్ల
పొలిమేర' సినిమాతో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకని ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి కామాక్షి భాస్కర్ల.
పొలిమేర' సినిమాతో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకని ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి కామాక్షి భాస్కర్ల. ఆ సినిమా తర్వాత పలు ప్రాజెక్ట్‌లలో నటించినప్పటికీ, తనకు తగినంత గుర్తింపు రాలేదని ఆమె భావిస్తోంది. అయితే, సీనియర్ నిర్మాత, దర్శకుడు ఎంఎస్ రాజు తెరకెక్కించిన మిస్టికల్ డివైన్ థ్రిల్లర్ 'అగధ' సినిమా తన కెరీర్‌కు మరో పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందని ఎంతో నమ్మకంతో చెబుతున్నారు కామాక్షి..ఆ వివరాలు చూద్దాం..
చీకటి లోకానికి, పంచభూతాలకు మధ్య పోరాటం:
ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘అగధ’ మూవీ ట్రైలర్‌ను సోమవారం చిత్రయూనిట్ విడుదల చేసింది. మంత్రతంత్రాలు, అతీంద్రియ శక్తులు మరియు దైవిక అంశాల కలబోతగా ఈ ట్రైలర్ ఉత్కంఠభరితంగా సాగింది. చీకటి లోకం నుంచి పుట్టుకొచ్చిన శక్తి ‘అగధ’కి, సృష్టిని నడిపించే పంచభూతాలకు మధ్య జరిగే ఆసక్తికర పోరాటమే ఈ సినిమా కథ అని ట్రైలర్ చూస్తుంటే స్పష్టమవుతోంది.
కామాక్షి భాస్కర్ల ఎమోషనల్ కామెంట్స్:
ఈ సందర్భంగా కామాక్షి మాట్లాడుతూ.. "‘పొలిమేర’ సినిమా తర్వాత నేను చాలా చిత్రాల్లో నటించినప్పటికీ, ఆ సినిమా ఇచ్చినంత ఇంపాక్ట్‌ను మరిదేదీ ఇవ్వలేకపోయింది. కానీ ఎంఎస్ రాజు గారు నాకు కాల్ చేసి ‘అగధ’ కథ చెప్పినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. నటిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం దొరికిందని పించింది" అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
శ్రవణ్ రెడ్డి ప్రధాన పాత్ర.. ఐదు భాషల్లో విడదల:
కామాక్షి భాస్కర్ల తన పాత్రలో ఎంతో ఎమోషన్‌ను ప్రదర్శించగా, శ్రవణ్ రెడ్డి కూడా కథలో కీలకమైన పాత్రలో ఆకట్టుకునేలా కనిపిస్తున్నారు. వీరితో పాటు ఇతర నటీనటులు కూడా కథకు తగ్గట్టుగా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసినట్లు ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది. గతంలో కుటుంబ కథా చిత్రాలు, ప్రేమకథలతో ఘన విజయాలు అందుకున్న ఎంఎస్ రాజు, ఈసారి అతీంద్రియ శక్తులు, మంత్ర తంత్రాలు మరియు పురాతన రహస్యాల నేపథ్యంలో పూర్తిగా భిన్నమైన 'మిస్టరీ డివైన్' జానర్‌ను ఎంచుకోవడం విశేషం. ఇక ఈ చిత్రాన్ని శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లకు మంచి స్పందన వస్తుండటంతో, సినిమాపై బజ్ బాగా పెరిగింది. ఇక మూవీ ను ఐదు భాషల్లో విడదల చేయనున్నారు.
ఆగస్టు 14న రహస్యం వీడనుంది:
ఈ మిస్టరీ డివైన్ థ్రిల్లర్ మూవీ ఆగస్టు 14న తెలుగుతో పాటు ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. మరి ‘పొలిమేర’ తర్వాత కామాక్షి భాస్కర్ల ఆశించిన విజయాన్ని, టర్నింగ్ పాయింట్‌ను ఈ 'అగధ' అందిస్తుందో లేదో చూడాలి.