కొత్త సంస్థ‌తో అలియాభ‌ట్ ఏం చేయ‌బోతుంది?

బాలీవుడ్ స్టార్ అలియా భట్ కేవలం నటనకే పరిమితం కాకుండా నిర్మాతగా కూడా తన సామ్రాజ్యాన్ని వేగంగా విస్తరిస్తోంది.;

Update: 2026-03-16 09:30 GMT

బాలీవుడ్ స్టార్ అలియా భట్ కేవలం నటనకే పరిమితం కాకుండా నిర్మాతగా కూడా తన సామ్రాజ్యాన్ని వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ పై `డార్లింగ్స్`, `జిగ్రా` వంటి వైవిధ్యమైన చిత్రాలను నిర్మించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా తన 33వ పుట్టినరోజు ను పుర‌స్క‌రించుకుని `ఎటర్నల్ కిడ్స్` అనే మ‌రో కొత్త నిర్మాణ సంస్థ‌ని ప్రారంభించి ఆశ్చర్యపరిచింది. తన మాతృ సంస్థకు ఇదొక‌ చిన్నారి లాంటిదని, పిల్లల కోసం అద్భుతమైన కథలను అందించడమే లక్ష్యమని పేర్కొంది. అలియా భట్ ఈ కొత్త సంస్థ ద్వారా ప్రధానంగా తన బాల్యానికి సంబంధించిన జ్ఞాపకాలను, తాతయ్య నరేంద్రనాథ్ రజ్దాన్ చెప్పిన కథలను వెండితెరపైకి తీసుకురావాలని భావిస్తోంది.

`మా చిన్నప్పుడు మేము పెరిగిన కథలను మళ్ళీ సజీవం చేయబోతున్నాం` అంటూ ఆమె ఎమోషనల్ అయింది. ఈ కొత్త బ్యానర్‌లో ఇప్పటికే మూడు ప్రాజెక్టులు పట్టాలెక్కడం విశేషం. సీ, జీ, ఎం అనే సినిమాల‌ను నిర్మిస్తుంది. వీటికి సంబంధించిన పేర్ల‌ను త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నుంది. ఇవీ ఆమె చిన్న నాటి జ్ఞాప‌కాల నుంచి పుట్టిన క‌థ‌లుగా తెలుస్తోంది. గతంలో `ఎటర్నల్ సన్ షైన్` ప్రారంభించినప్పుడు అలియా భ‌ట్ చాలా జోరుగా సినిమాలు తీస్తుందని అందరూ భావించారు. అయితే ఆ సంస్థ లో కేవలం పరిమితంగా ప్రయోగాత్మక చిత్రాలే చేస్తున్నారు. తాజాగా `ఎటర్నల్ కిడ్స్` ద్వారా మళ్ళీ యాక్టివ్ మోడ్‌లోకి రావడం గమనార్హం.

తల్లిగా మారిన తర్వాత పిల్లల కంటెంట్ పట్ల ఆమెకు ఆసక్తి పెరిగిందని, అందుకే తన కూతురు రాహా వంటి చిన్నారులందరినీ అలరించేలా ఫ్యామిలీ-ఫ్రెండ్లీ కథలను నిర్మించడమే తన తదుపరి లక్ష్యమని అమ్మ‌డు గత ఇంటర్వ్యూలలోనే సూచన ప్రాయంగా చెప్పింది. నిర్మాతగా అలియా కేవలం సొంత సినిమాలకే పరిమితం కాకుండా, కొత్త టాలెంట్‌ను కూడా ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతం ఆమె తన సోదరి షాహీన్ భట్‌తో కలిసి అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం `డోంట్ బీ షై` అనే రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని నిర్మిస్తోంది. `జిగ్రా` వంటి సీరియస్ సినిమాల తర్వాత మళ్ళీ వినోదానికి ప్రాధాన్యతనిస్తూ, వైవిధ్యమైన జోనర్లలో తన నిర్మాణ సంస్థను పరుగులు పెట్టించాల‌ని అమ్మ‌డిలో గట్టి పట్టుదల క‌నిపిస్తోంది.

ప్ర‌స్తుతం అలియా భ‌ట్ నటిగా `ఆల్ఫా`, `లవ్ అండ్ వార్` వంటి భారీ చిత్రాల్లో నటిస్తోన్న సంగ‌తి తెలిసిందే. నిర్మాతగా ఎటర్నల్ కిడ్స్ ద్వారా విభిన్నమైన అభిరుచిని చాటుకుంటోంది. మొదటి సంస్థతో పోలిస్తే ఈ కొత్త విభాగం మరింత వేగంగా ప్రాజెక్టులను పూర్తి చేసేలా కనిపిస్తోంది. చిన్నపిల్లల ప్రపంచంలో అలియా సృష్టిం చబోయే మ్యాజిక్ ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే అలియా భ‌ట్ `ఆర్ ఆర్ ఆర్` త‌ర్వాత తెలుగు సినిమాల్ని లైట్ తీసుకుంది. అవ‌కాశాలు వ‌స్తున్నా నో చెబుతుంది. అయినా అమ్మ‌డి వెంట ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ప‌డుతున్నారు? దీంతో అమ్మ‌డు అలియా టాలీవుడ్లో డిమాండింగ్ భామ‌గానూ మారింది.

Tags:    

Similar News