ఫ్యామిలీ వివాదాలపై పర్సనల్ ఎటాక్స్!
బాలీవుడ్ నటుడు గోవిందా సతిమణి సునీతా అహుజా కు బుల్లితెర ప్రముఖ నటి మల్లికా నాయక్ మద్దతుగా నిలిచారు.
బాలీవుడ్ నటుడు గోవిందా సతిమణి సునీతా అహుజా కు బుల్లితెర ప్రముఖ నటి మల్లికా నాయక్ మద్దతుగా నిలిచారు. ఇటీవల గోవిందా కుటుంబంలో నెలకొన్న వివాదాలు, దాంపత్య జీవితంపై వస్తున్న రూమర్లు మరియు వ్యక్తిగత విమర్శల నేపథ్యంలో మల్లికా నాయక్ స్పందించారు. సునీతా అహుజాను ఒక యోధురాలు గా అభివర్ణిస్తూ ఆమె ధైర్యాన్ని , పట్టుదలను ప్రశంసిస్తూ ప్రత్యేకంగా వ్యాఖ్యానించారు. కొంతకాలంగా గోవిందా వ్యక్తిగత జీవితం, వారి కుటుంబంలో జరుగుతోన్న పరిణామాలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో కోమల్ రాణి స్వర్ణకార్ ..సునీతా అహుజాపై తీవ్రస్థాయిలో విమర్శలు గప్పించడమే కాకుండా ఆమెను మానసిక అనారోగ్యంతో బాధపడుతోంది అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ వర్గాల్లో.. సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ విమర్శలపై నటి మల్లికా నాయక్ తీవ్రంగా స్పందించారు. సునీతా అహుజాపై జరిగిన వ్యక్తిగత దాడిని ఖండించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ కుటుంబానికి వెన్నుముకగా నిలిచే వ్యక్తిని ఎలాంటి ఆధారం లేకుండా మానసిక రోగి అని సంబోధించడం ఏమాత్రం తగదని మల్లికా హితవు పలికారు.
సునీత చూపిన సహనం, ధైర్యం ఎంతో ప్రశంసనీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సునీతా అహుజాను ఒక యోధురాలితో పోల్చిన మల్లికా నాయక్ సునిత తన కుటుంబాన్ని, భర్త గోవిందాను ఎంతో బాధ్యతగా చూసుకుంటారన్నారు. పరిశ్రమలో నిరంతరం మీడియా వెలుగులు, వివాదాలు, ఊహాగానాల మధ్య ఒక కుటుంబాన్ని ఏకతాటిపైకి తెచ్చి నిలబెట్టడం సామాన్యమైన విషయం కాదని ఆ విషయంలో సునీత ఎంతో దైర్యంగా నిలబడ్డారని కొనియాడారు.
ప్రతి ఒక్కరి కుటుంబంలోనూ .. దాంపత్య జీవితంలోనూ ఎగుడుదిగుడులు ఉంటాయని, అంతమాత్రాన బయటి వ్యక్తులు వారి వ్యక్తిగత విషయాలపై అసత్య ప్రచారాలు, హద్దులు దాటిన వ్యాఖ్యలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. పుకార్లకు ప్రాధాన్యత ఇవ్వకుండా సునీత ఎంతో ఆత్మగౌరవంతో వ్యవహరిస్తున్నారని చెప్పారు. మల్లికా నాయక్ చేసిన వ్యాఖ్యలకు నెటిజన్ల నుంచి విశేష మద్దతు లభిస్తోంది. ఒక మహిళగా మరొక మహిళ కష్టాల్లో ఉన్నప్పుడు ఈ రకమైన ధైర్యాన్ని, మద్దతును అందించడం ఎంతో గొప్ప విషయమని కొనియాడుతున్నారు. వ్యక్తిగత వివాదాలను విమర్శల స్థాయికి తీసుకెళ్లకుండా ఒకరికొకరు తోడుగా నిలవడం యొక్క ప్రాధాన్యతను ఈ పరిణామం మరోసారి ఎత్తి చూపుతుంది.