ర‌కుల్.. ఆమె మామ‌పై ఐటీ శాఖ దాడుల‌కు అస‌లు కార‌ణం ఇదేనా?

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు మరోసారి ఊహించ‌ని కార‌ణాల‌తో ఇంట‌ర్నెట్ లో చ‌ర్చ‌గా మారింది.

Update: 2026-09-28 10:54 GMT

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు మరోసారి ఊహించ‌ని కార‌ణాల‌తో ఇంట‌ర్నెట్ లో చ‌ర్చ‌గా మారింది. ర‌కుల్.. త‌న మామ, ప్రముఖ సినీనిర్మాత వాషు భగ్నాని.., అలాగే ముంబైలోని పనోరమా స్టూడియోస్‌తో సంబంధం ఉన్న పలు స్థావరాలపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని తెలుస్తుంది. 28 సెప్టెంబర్ 2026న ముంబైలోని మొత్తం 12 ప్రాంతాలలో ఈ సోదాలు ప్రారంభమయ్యాయి.

అనుమానాస్పద నిధుల అక్రమాల నేపథ్యంలో ఈ ఆపరేషన్ చేపట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సినిమాల నిర్మాణం- ఫైనాన్సింగ్ ముసుగులో నిధులను అక్రమంగా విదేశాలకు మళ్లించారనే ఆరోపణలపై ముంబై ఐటీ శాఖ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

ముంబై ఆదాయపు పన్ను శాఖకు చెందిన పలు ప్రత్యేక బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. వీరు సంబంధిత ప్రాంగణాల్లోని పత్రాలు, ఆర్థిక రికార్డులు, విదేశాలకు బ‌దిలీ అయిన‌ట్టు భావిస్తున్న లావాదేవీల వివరాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. అయితే ఈ సోదాలకు సంబంధించి ఇప్పటివరకు ఎంత మొత్తం ప్రమేయం ఉందనే వివరాలను అధికారులు అధికారికంగా వెల్లడించలేదు.

ఈ కుటుంబ సంబంధాల విషయానికి వస్తే.. నిర్మాత వాషు భగ్నాని కుమారుడు జాకీ భగ్నానీని నటి రకుల్ ప్రీత్ సింగ్ వివాహం చేసుకున్నారు. భగ్నాని కుటుంబం పూజా ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థతో సంబంధం కలిగి ఉండగా, కుమార్‌ మంగత్‌కు చెందిన పనోరమా స్టూడియోస్ కూడా హిందీ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థగా కొనసాగుతోంది. పనోరమా స్టూడియోస్ బ్యానర్‌లో వస్తున్న `దృశ్యం: ది కన్‌క్లూజన్` చిత్రం అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

ప్రస్తుతానికి ఐటీ శాఖ ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలను లేదా ఎటువంటి పన్ను ఉల్లంఘనలు జరిగాయనే విషయాలను బహిరంగంగా వెల్లడించలేదు. ఈ సోదాలు ఇంకా కొనసాగుతుండటంతో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.

Tags:    

Similar News