రాజమౌళిని గుర్తించక పోవడం ఏంటి భయ్యా..!

రాజమౌళి సమర్పిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కోసం ఏకంగా ఎన్టీఆర్‌ రాబోతున్నట్లు సమాచారం అందుతోంది. రాజమౌళి సైతం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొనబోతున్నాడు.

Update: 2026-09-28 09:30 GMT

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెలుగు సినిమాను ఆస్కార్‌ రేంజ్‌కి తీసుకు వెళ్లిన విషయం తెల్సిందే. ఇప్పటి వరకు ఏ ఇండియన్‌ సినిమాకు దక్కని ఎన్నో గుర్తింపులను, గౌరవాలను, కలెక్షన్స్‌ ను రాజమౌళి తన సినిమాలతో తెచ్చి పెట్టాడు. ఇండియన్ సినిమాకు ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద వెయ్యి కోట్లు సాధ్యమా అనుకుంటున్న సమయంలో బాహుబలితో ఆ రికార్డ్‌ను సునాయాసంగా సొంతం చేసుకున్నాడు. సౌత్‌ దర్శకులు నార్త్‌లో గుర్తింపు తెచ్చుకోవడం, నార్త్‌లో సౌత్‌ సినిమాలకు ఆధరణ దక్కడం సాధ్యమేనా అనుకుంటున్న సమయంలో మొత్తం నార్త్‌ ఇండియా, బాలీవుడ్‌ సౌత్‌ సినిమాల వైపు చూసేలా చేసింది కచ్చితంగా రాజమౌళి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి రాజమౌళిని ఇప్పటికీ నార్త్‌ ఇండియన్స్ చాలా మంది గుర్తు పట్టరు అంటూ స్వయంగా ఎస్‌ఎస్‌ కార్తికేయ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాయి.

రాజమౌళి వారణాసి షూటింగ్‌తో...

ప్రస్తుతం రాజమౌళి 'వారణాసి' సినిమాతో బిజీగా ఉన్నాడు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్‌ వంటి ప్రముఖ స్టార్స్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరిందని సమాచారం అందుతోంది. ఈ సినిమాకు రాజమౌళి ఎంత వర్క్ చేస్తాడో అంతకు మించి ఎస్ ఎస్ కార్తికేయ వర్క్ చేస్తాడు అనడంలో సందేహం లేదు. వారణాసి సినిమాకు సంబంధించిన అన్ని విభాగాలను ఏకతాటిపై నడిపించడం అనేది కచ్చితంగా వల్లే సాధ్యం అవుతుందని యూనిట్‌ సభ్యులు అంటూ ఉంటారు. ఆ సినిమాతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కాస్త గ్యాప్‌ తీసుకుని ఫహద్‌ ఫాసిల్‌ నటించిన 'డోంట్ ట్రబుల్‌ ది ట్రబుల్‌' సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఆర్కా మీడియాతో కలిసి ఈ సినిమాను నిర్మించిన కార్తికేయ మొత్తం ప్రమోషన్ బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నాడు.

ఎస్‌ఎస్‌ కార్తికేయ నిర్మాణంలో...

రాజమౌళి సమర్పిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కోసం ఏకంగా ఎన్టీఆర్‌ రాబోతున్నట్లు సమాచారం అందుతోంది. రాజమౌళి సైతం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొనబోతున్నాడు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల కార్తికేయ మాట్లాడుతూ... నార్త్‌ ఇండియాలో బాహుబలి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ ఇప్పటికీ చాలా మందికి దర్శకుడు రాజమౌళి తెలియదు, ఆ సినిమా కు రాజమౌళి దర్శకుడు అనే విషయం తెలియదు అన్నాడు. అక్కడి వారు అంతా బాహుబలి అనగానే ప్రభాస్‌ ను గుర్తు చేసుకుంటారు, వారు అంతా కూడా బాహుబలి అనగానే ప్రభాస్‌ ముఖమే గుర్తుకు వస్తుందని అంటారని కార్తికేయ చెప్పకొచ్చాడు. అయితే చాలా మంది సోషల్‌ మీడియాలో కార్తికేయ వ్యాఖ్యలను సరికాదు అంటున్నారు. బాహుబలి అంటే ప్రభాస్‌ అనే విషయం కచ్చితంగా గుర్తు చేసుకుంటారు, కానీ బాహుబలి వెనుక ఉన్న మాస్టర్‌ మైండ్‌ రాజమౌళిని గుర్తించరు అంటే మాత్రం సరికాదంటున్నారు.

డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌...

ఈగ సమయంలోనే రాజమౌళికి బాలీవుడ్‌ నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. ఒక ఈగ తో సినిమా ఎలా చేశారు అంటూ చాలా మంది హిందీ ప్రేక్షకులు రాజమౌళి గురించి మాట్లాడుకున్నారు. ఇక బాహుబలి తర్వాత రాజమౌళి పేరు అక్కడ మారుమ్రోగింది. ఆ తర్వాత వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌, ఆస్కార్‌ల కారణంగా హీరోలను మించిన గుర్తింపు రాజమౌళి దక్కించుకున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి సమయం నుంచే రాజమౌళికి అక్కడ గుర్తింపు ఉందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి వారు రాజమౌళికి గుర్తించక పోవడం ఏంటి భయ్యా అంటూ చాలా మంది సోషల్‌ మీడియాలో కార్తికేయను ఉద్దేశించి ప్రశ్నిస్తున్నారు. బాలీవుడ్‌లో ఉన్న స్టార్‌ దర్శకులందరితో పోల్చితే రాజమౌళి సినిమా కోసమే అక్కడి వారు కూడా ఎదురు చూస్తున్నారు. వారణాసి సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో, రాజమౌళి పై నమ్మకంతో దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆ రేంజ్‌లో ఎదురు చూస్తున్నారు అనడంలో సందేహం లేదు.

Tags:    

Similar News