ప్రముఖ సినీ నటుడు మృతి.. అసలేమైందంటే?
గత కొంతకాలంగా డయాలసిస్ సమస్యతో బాధపడుతున్న ఆయన కొచ్చిలోని త్రిపుణితురలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే తుది శ్వాస విడిచారు. ఆయన ఎవరో కాదు ప్రముఖ మలయాళ నటుడు శ్రీనివాసన్.;
చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు స్వర్గస్తులయ్యారు. గత కొంతకాలంగా డయాలసిస్ సమస్యతో బాధపడుతున్న ఆయన కొచ్చిలోని త్రిపుణితురలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే తుది శ్వాస విడిచారు. ఆయన ఎవరో కాదు ప్రముఖ మలయాళ నటుడు శ్రీనివాసన్. ఆయన వయసు 69 సంవత్సరాలు. ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో 225 కు పైగా చిత్రాలలో నటించిన ఈయన.. సామాజిక అంశాలను హాస్యంతో మేళవించి కథలను అందించడంలో దిట్ట. అంతేకాదు ఆయన రాసిన ఎన్నో కథలు మలయాళ సినిమా రూపురేఖలనే మార్చేశాయని చెప్పవచ్చు. అలాంటి ఒక గొప్ప నటుడు, దర్శకుడు అనారోగ్య సమస్యలతో స్వర్గస్తులవడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శ్రీనివాసన్ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.
48 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంలో సామాన్యుల సమస్యలను హాస్యం జోడించి చెప్పడంలో శ్రీనివాసన్ కి ప్రత్యేకమైన నైపుణ్యత ఉంది. గాంధీనగర్ సెకండ్ స్ట్రీట్, టీపీ బాలగోపాలన్ ఎంఏ, తలయణమంత్రం , సందేశం వంటి చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తన అద్భుతమైన నటనతో, రచనలతో ఐదు సార్లు కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలను అందుకున్న ఈయన.. ముఖ్యంగా ఈయన రాసి దర్శకత్వం వహించి, నటించిన 'చింత విష్టయాయ శ్యామల' అనే చిత్రానికి జాతీయ పురస్కారం లభించింది. అలాగే మరో చిత్రం కూడా నేషనల్ అవార్డు అందుకోవడం గమనార్హం.
శ్రీనివాసన్ బాల్యం, కెరియర్ విషయానికి వస్తే.. 1956 ఏప్రిల్ 4న తలస్సేరి సమీపంలో జన్మించారు. కతిరూర్ ప్రభుత్వ పాఠశాల, పలస్సిరాజా ఎన్ఎస్ఎస్ కాలేజీలో చదువుకున్న ఈయన మద్రాస్ లోని ఫిలిం ఛాంబర్ ఇన్స్టిట్యూట్లో సినిమా నటనలో డిప్లొమా పూర్తి చేశారు. 1977లో పిఏ బక్కర్ దర్శకత్వం వహించిన మణిముళక్కం అనే చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత వందల సంఖ్యలో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు.
ఇకపోతే ఈయన కుమారుడు వినీత్ శ్రీనివాసన్ కూడా సినీ రంగంలో రాణిస్తున్న విషయం తెలిసిందే. ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ అనే చిత్రంతో తెలుగు వారికి పరిచయమయ్యారు. శ్రీనివాసన్ మరణించడంతో పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. అందులో మలయాళ నటుడు, దర్శకుడైన పృథ్వీరాజ్ సుకుమారన్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో ఈ విధంగా రాసుకొచ్చారు. మలయాళ సినీ పరిశ్రమ యొక్క గొప్ప దర్శకుడు, రచయిత, నటుడిని కోల్పోయింది. ఆయనకు వీడ్కోలు చెప్పడం కూడా అత్యంత కష్టంగా మారింది. కానీ వెండితెరపై మీరు పంచిన నవ్వులు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. పరిశ్రమ కోసం మీరు చేసిన పనులకు ధన్యవాదాలు అంటూ ఆయన పేర్కొన్నారు. అలాగే పలువురు మలయాళ నటులు ఆయన మరణానికి సంతాపం తెలియజేస్తున్నారు.