#GlobeTrotter మహేష్ ది గ్రేట్
ఇక మహేష్ బర్త్ డే సందర్భంగా, ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.;
సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ అడ్వెంచర్ థ్రిల్లర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. #GlobeTrotter (#గ్లోబ్ ట్రోటర్) అనే హ్యాష్‌ట్యాగ్‌తో మొదటి గ్లింప్స్‌ను పోస్ట్ చేయగా దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. గ్లోబ్ ట్రోటర్ వర్కింగ్ టైటిల్ లోనే ఈ సినిమా కథాంశం దాగి ఉంది. ప్రపంచాన్ని చుట్టేసేవాడు! అనేది దీని అర్థం. విభూది నామాలు- త్రిశూలం-ఢమరుకం- నందీశ్వరుడు- రుద్రాక్షతో ప్రత్యేకంగా తయారు చేసిన ఒక మాలను మెడలో ధరించిన ఒక యువకుడిని పోస్టర్ లో ఆవిష్కరించగా, ప్రపంచంపై దండయాత్ర చేసే పరమశివుడిని చూపిస్తున్నాడా? అంటూ అభిమానులు ఉబ్బితబ్బిబ్బయ్యారు.
భార్య అతడికి పెద్ద అండ:
అదంతా అటుంచితే మహేష్ బాబు ఈ శనివారం నాడు 50వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అతడి చుట్టూ అల్లుకున్న పాజిటివ్ వైబ్రేషన్ గురించి కచ్ఛితంగా చర్చించి తీరాలి. మహేష్ కి ఎప్పుడూ ఆయన భార్య నమ్రత శిరోద్కర్ గొప్ప అండ. మహేష్ ప్రతి ప్రణాళికలో నమ్రత భాగం. అతడి సినిమాలు, వ్యాపారాలు అన్నిటినీ సవ్యంగా నడిపించడంలో కీలక సూత్రధారి. లైఫ్ లో ఎలాంటి స్ట్రెస్ లేకుండా కుటుంబాన్ని నడిపిస్తున్న సతీమణి. ఇంకా చెప్పాలంటే అతడు సూపర్ స్టార్ గా ఎదగడంలో సహకరించిన నిజమైన అర్థనారి. ఈసారి బర్త్‌డేకి మహేష్ తన భార్య పిల్లలతో శ్రీలంక యాత్రను ఆస్వాధించారు.
సహచర హీరోల నుంచి ఆరా:
ఇక మహేష్ బర్త్ డే సందర్భంగా, ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇండస్ట్రీలో వేరొక హీరోకి సాధ్యపడనంతగా అతడిని ప్రతి ఒక్క హీరో అభిమానిస్తారంటే అతడి చుట్టూ ఉన్న ఆరా(మాయ)ను అర్థం చేసుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్, అడివి శేష్.. ఇంకా మహేష్ తో పాటు ఉన్న ఇండస్ట్రీ సహచరులంతా అతడికి బర్త్ డే విషెస్ తెలిపారు. సూపర్ స్టార్ ఇకపై గ్లోబల్ స్టార్ గా ఏలాలని విష్ చేసారు.
రాజమౌళితో అంతర్జాతీయ వైబ్రేషన్:
మహేష్ ని గ్లోబల్ స్టార్ గా ఆవిష్కరిస్తున్న ఎస్ఎస్ రాజమౌళి ఇప్పటికే మహేష్ చుట్టూ ఆరా (మాయ)ను క్రియేట్ చేసారు. మహేష్‌తో రాజమౌళి కలయికే ఒక పాజిటివ్ వైబ్రేషన్. ఇప్పటివరకూ మనం చూసిన మహేష్ వేరు... ఇకపై కనిపించబోయే మహేష్ వేరు! నిజానికి మహేష్‌కి టాలీవుడ్ లో ఏ ఇతర దర్శకుడు ఇవ్వని కానుకను ఎస్.ఎస్.రాజమౌళి సిద్ధం చేస్తున్నారు. ఎస్.ఎస్.ఎం.బి 29 (గ్లోబ్ ట్రోటర్) భారీతనం నిండిన ఒక అద్భుతమైన సాహసికుడి కథతో రూపొందుతున్న సినిమా. ``ఏవో కొన్ని ఫోటోలు లేదా ప్రెస్ కాన్ఫరెన్సులతో మహేష్ అభిమానులను ప్రజలను సంతృప్తి పరచలేన``ని రాజమౌళి అన్నారు. దీని అర్థం మహేష్ ని ఒక హాలీవుడ్ స్టార్ లా లాంచ్ చేయడమే తన ఉద్దేశమని చెప్పకనే చెప్పారు. బహుశా ఈ ఎస్ఎస్ఎంబి 29 ( #GlobeTrotter) కి అంతర్జాతీయ మీడియా ఎదుట మాట్లాడతాననే సందేశాన్ని ఇచ్చారు.
అభిమానులే అతడి ప్రమోటర్స్:
ఇక మహేష్ బాబును అరక్షణం అయినా విడిచిపెట్టని ఘట్టమనేని అభిమానులు ఎప్పుడూ అతడి చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్ కి కారకులు. ప్రతిసారీ తమ ఫేవరెట్ స్టార్ ఈవెంట్లలో సందడి చేయడమే కాదు, సోషల్ మీడియాల్లో, ఇతర డిజిటల్ మాధ్యమాల్లోను మహేష్ గొప్పతనాన్ని ప్రమోట్ చేయడంలో అభిమానులు ఎప్పుడూ ముందుంటారు. ఇక సేవామార్గంలోను మహేష్ తక్కువేమీ కాదు. ఆంధ్రా హాస్పిటల్స్ తో వేలాది మంది పేద దిగువ తరగతి చిన్నారులకు గుండె ఆపరేషన్లు నిర్వహించేందుకు మహేష్ చేస్తున్న ధాతృత్వ సేవ ఎప్పుడూ అతడి చుట్టూ ఒక వైబ్రేషన్ ని క్రియేట్ చేస్తుంది. అతడికి, అతడి కుటుంబానికి ఇది నిజమైన శ్రీరామరాక్ష.