MAA సొంత భవనం.. ఎవరు మోకాలడ్డారు విష్ణు?
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) కు సొంత భవంతిని నిర్మించి కానుకగా ఇస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు ప్రస్తుత అధ్యక్షుడు మంచు విష్ణు. దీనికోసం ఎన్నికోట్లు ఖర్చయినా, పెట్టుబడి అంతా తానే సమకూరుస్తానని అన్నారు.;
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) కు సొంత భవంతిని నిర్మించి కానుకగా ఇస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు ప్రస్తుత అధ్యక్షుడు మంచు విష్ణు. దీనికోసం ఎన్నికోట్లు ఖర్చయినా, పెట్టుబడి అంతా తానే సమకూరుస్తానని అన్నారు. ఆ తరవాత భూమికోసం వెతికారు. సిటీ ఔటర్ లో భూమి అందుబాటులో ఉందని కూడా ప్రకటించారు. కానీ ఎవరూ సానుకూలంగా స్పందించలేదు. ప్రస్తుతం ఉన్న ఫిలింనగర్- ఫిలింఛాంబర్ లోనే నిర్మించాలనే ప్రతిపాదన వచ్చింది. అది కూడా సాధ్యపడలేదు ఇంతవరకూ.
ఎన్నికలు జరిగి నాలుగేళ్లయినా ఇప్పటికీ మా అసోసియేషన్ కి సొంత భవంతి లేదు సరికదా.. కనీసం పునాది రాయి కూడా పడలేదు. రాజకీయాలు ఎన్ని ఉన్నా కోలీవుడ్ లో నడిగర సంఘం అధ్యక్షుడిగా పని చేసిన విశాల్ భవంతిని నిర్మించేందుకు వెనకాడలేదు. అక్కడ ఆర్టిస్టుల అసోసియేషన్ బిల్డింగ్ నిర్మాణం దాదాపు పూర్తయింది. నడిగర సంఘం భవంతికి పునాది రాయి వేసే సమయంలో రజనీకాంత్- కమల్ హాసన్ సహా అక్కడ `మా` అసోసియేషన్ లో పోటీచేసి ఓడిన ప్రకాష్ రాజ్ కూడా ఉన్నారు. కానీ తెలుగు అసోసియేషన్ (మా) బిల్డింగ్ కోసం పునాది రాయి వేయడంలో ప్రకాష్ రాజ్ పాత్ర లేనే లేదు. కనీసం అతడు విమర్శనాత్మకంగా అయినా పునాది రాయి వేయించలేక విఫలమయ్యాడు.
తాజాగా తమ్మారెడ్డి భరద్వాజతో యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో మంచు విష్ణు స్పందించారు. `మా` అసోసియేషన్ సొంత ఆఫీస్ నిర్మాణం కోసం.. ప్రస్తుతం ఉన్న ఛాంబర్ బిల్డింగ్ ని కూలగొట్టి, పునర్మిర్మాణానికి నేను సిద్ధమేనని చెప్పాను కానీ, కానీ ఇతరులే రెడీగా లేరు అని మంచు విష్ణు అన్నారు. తనతో పాటు ఆర్థిక సాయానికి భాగస్వామి కూడా ముందుకు వచ్చారని కూడా తెలిపారు. అలాగే మరొక ఆప్షన్ కూడా ఉంది. హైదరాబాద్ ఔటర్ నార్సింగిలోను బిల్డింగ్ రెడీగా ఉంది.. అక్కడ ఆఫీస్ ఓకేనా? అని అడిగాను.. కానీ అందరూ ఛాంబర్ లోనే మా ఆఫీస్ కావాలన్నారు... కానీ ఇది ముందుకు సాగలేదు! అని మంచు విష్ణు నిరాశను వ్యక్తం చేసాడు. అయితే పరిశ్రమ పెద్దలు ఎవరూ సహకరించకపోవడం వల్లనే మూవీ ఆర్టిస్టుల సంఘం(మా) సొంత భవంతి నిర్మాణం పూర్తి కాలేదని అతడి మాటలను బట్టి అర్థం చేసుకోవాలి. అయితే దీనిపై ప్రత్యర్థుల వెర్షన్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. పరిశ్రమ పెద్దలు అయిన మురళి మోహన్ (మా గత అధ్యక్షుడు), చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కల్యాణ్, ప్రకాష్ రాజ్ వీరంతా మా సొంత భవంతి నిర్మాణం కోసం ఆలోచించడం లేదా? అందుకే ఇది ఆగిపోయిందా?