లోకేష్ కనకరాజ్.. ఓవర్ రేటెడ్?
లోకేష్ కనకరాజ్.. చాలా తక్కువ సమయంలో సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్లలో ఒకడైపోయాడు. తన తొలి చిత్రం ‘మానగరం’ హిట్టయినా అతడికి గొప్ప పేరేమీ రాలేదు.;
లోకేష్ కనకరాజ్.. చాలా తక్కువ సమయంలో సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్లలో ఒకడైపోయాడు. తన తొలి చిత్రం ‘మానగరం’ హిట్టయినా అతడికి గొప్ప పేరేమీ రాలేదు. కానీ ‘ఖైదీ’ సినిమాతో తన కెరీర్ మారిపోయింది. ఆ సినిమా పెద్ద హిట్టయి.. ఏకంగా విజయ్‌తో ‘మాస్టర్’ లాంటి పెద్ద సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు.
ఆ సినిమా నిరాశపరిచింది. కానీ లోకేష్ నాలుగో చిత్రం ‘విక్రమ్’ సంచలన విజయం సాధించి తనను ఒకేసారి టాప్‌లో తీసుకెళ్లి కూర్చోబెట్టేసింది. కోలీవుడ్లో చాలామంది సీనియర్ డైరెక్టర్లు డౌన్ అయిపోయి, కొత్త తరం దర్శకుల పెర్ఫామెన్స్ అంతంతమాత్రంగా ఉన్న సమయంలో లోకేష్ అసాధారణమైన క్రేజ్ సంపాదించుకున్నాడు.
‘ఖైదీ’కి ‘విక్రమ్’కు లింక్ పెట్టి ‘లోకేష్ సినిమాటిక్ యూనివర్శ్’ అంటూ కొత్త ట్రెండ్ మొదలుపెట్టడంతో తన క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఎల్‌సీయూ.. ఎల్‌సీయూ.. అంటూ జనం ఊగిపోవడం మొదలుపెట్టారు. తెలుగు ప్రేక్షకులు సైతం దీనికి ఎగ్జైట్ అయి లోకేష్‌కు ఎక్కడ లేని హైప్ ఇవ్వడం మొదలుపెట్టారు.
కట్ చేస్తే.. లోకేష్ తర్వాతి చిత్రం ‘లియో’ ప్రేక్షకుల తలలు బొప్పి కట్టేలా చేసింది. ప్రోమోలు చూస్తే గొప్పగా అనిపించాయి కానీ.. సినిమాలో విషయం లేక అది బోల్తా కొట్టింది. లోకేష్ ఓ హాలీవుడ్ మూవీని కాపీ కొట్టి ఈ సినిమా తీయడం గమనార్హం. ‘లియో’ను ఒక మిస్టేక్‌గా భావించి.. లోకేష్ కొత్త చిత్రం ‘కూలీ’కి మళ్లీ హైప్ ఎక్కించుకున్నారు జనం. ఈ మధ్య కాలంలో ఏ సినిమాకూ రానంత బజ్ క్రియేట్ అయిందీ సినిమాకు. ఎంతో ఊహించుకుని సినిమాకు వెళ్లిన జనాలకు మరోసారి షాక్ తప్పలేదు.
ఈ సినిమా గురించి.. ఇందులో పాత్రల గురించి లోకేష్ సహా టీం అంతా చెప్పిన మాటలకు.. సినిమాలో ఉన్నదానికి అసలు పొంతన లేదు. ఈ కథతో అసలేం చెప్పాలనుకున్నారో అర్థం కాలేదు. ఒక్క పాత్రనూ సరిగా తీర్చిదిద్దలేదు. ఎంతో హైప్ ఇచ్చిన నాగ్ క్యారెక్టర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సినిమాలో లాజిక్‌కు అందని విషయాలు.. నాన్సెన్స్ అనిపించిన సన్నివేశాలు ఎన్నెన్నో. సన్నివేశంలో ఏమీ ఉండదు. ఊరికే టేకింగ్‌తో, బ్యాగ్రౌండ్ స్కోర్‌తో బిల్డప్ ఇచ్చి ప్రేక్షకుకు మస్కా కొట్టే ప్రయత్నమే చేశారు. లోకేష్ కేవలం విజువల్స్, మ్యూజిక్ సాయంతో ఇంట్రెస్టింగ్ ప్రోమోలు కట్ చేసి ప్రేక్షకుల్లో హైప్ పెంచుతున్నాడు తప్ప.. తన సినిమాల్లో విషయం ఉండట్లేదు. ఖైైదీ, విక్రమ్ సినిమాలను మినహాయిస్తే అతను గొప్పగా తీసిందేమీ లేదు. అంతమాత్రానికి అతడికి ఇంత హైప్ ఎందుకిస్తున్నారన్నది అర్థం కావడం లేదు. ఈ తరంలో మోస్ట్ ఓవర్ రేటెడ్ డైరెక్టర్ అంటూ లోకేష్‌ను విమర్శించే వారికి ‘కూలీ’ రూపంలో పెద్ద ఆయుధమే దొరికిందని చెప్పాలి.