లోకేష్ మాస్ లైనప్.. ఇప్పట్లో దొరికేలా లేడుగా!
మా నగరం సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన లోకేష్ కనగరాజ్ ఆ తర్వాత కార్తీతో తీసిన ఖైదీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు.;
లోకేష్ కనగరాజ్. ప్రస్తుతం ఈ డైరెక్టర్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మా నగరం సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన లోకేష్ కనగరాజ్ ఆ తర్వాత కార్తీతో తీసిన ఖైదీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. ఖైదీ తర్వాత మాస్టర్ చేసిన లోకేష్, ఆ తర్వాత కమల్ హాసన్ తో చేసిన విక్రమ్ సినిమాతో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్నారు. ఆ సినిమాతో సక్సెస్ అందుకోవడమే కాకుండా తన పేరిట సినిమాటిక్ యూనివర్స్ ను కూడా క్రియేట్ చేశారు.
ఇండియన్ సినిమాలో ఖైదీ, విక్రమ్, లియో సినిమాలతో లోకేష్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలోనే తమ అభిమాన నటులు కూడా ఒక్కసారైనా లోకేష్ దర్శకత్వంలో సినిమా చేస్తే చూడాలని ఎందరో టాలీవుడ్ మూవీ లవర్స్ ఆశపడుతున్నారు. కానీ అవేమీ జరిగేట్టు కనిపించడం లేదు. మొన్నటి వరకు లోకేష్.. చరణ్, ప్రభాస్ తో సినిమా చేసే అవకాశముందన్నారు కానీ ఇప్పుడు ఆ సూచనలేమీ కనిపించట్లేదు.
ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా కూలీ సినిమా చేసిన లోకేష్ ఆ సినిమాను ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కూలీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న లోకేష్ లైనప్ చూస్తుంటే అతను ఇప్పట్లో టాలీవుడ్ హీరోలకు దొరికేలా అనిపించడం లేదు. కూలీ తర్వాత లోకేష్ కార్తీతో కలిసి ఖైదీ2 చేయనున్నారు. మరో 8 నెలల్లో ఖైదీ2 సెట్స్ పైకి వెళ్లనుంది.
ఆ తర్వాత అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో లోకేష్ ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ లోపు బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ తో కలిసి ఓ సూపర్ హీరో మూవీ చేస్తారు. అవన్నీ పూర్తయ్యే సరికి ఎంతలేదన్నా మరో రెండేళ్లు పడుతుంది. ఆ తర్వాత మరోసారి సూపర్ స్టార్ తో సినిమా చేయనున్నారు లోకేష్. కూలీ సినిమా షూటింగ్ టైమ్ లో రజినీకి ఓ లైన్ చెప్పానని లోకేష్ చెప్పడం చూస్తుంటే అతని లైనప్ పై ఓ క్లారిటీ వస్తోంది.
అవన్నీ పూర్తయ్యాక అప్పటి వీలుని బట్టి రోలెక్స్, విక్రమ్2 ఉంటాయా ఉండవా అనేది డిసైడవుతుంది. ఇంతటి బిజీ లైనప్ లో ఈ స్టార్ డైరెక్టర్ కు తెలుగు హీరోలతో సినిమా తీసేంత టైమ్ ఎక్కడుంది? ఇక కూలీ సినిమా విషయానికొస్తే ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, శృతి హాసన్, సౌబిన్ షాహిర్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. భారీ అంచనాలతో వస్తోన్న ఈ సినిమా ద్వారా లోకేష్ తమిళ ఇండస్ట్రీకి మొదటి రూ. 1000 కోట్ల సినిమాను ఇవ్వబోతున్నారని అందరూ ఎంతో నమ్మకంగా ఉన్నారు. మరి కూలీ ఎలాంటి టాక్ ను తెచ్చుకుంటుందో చూడాలి. కూలీ సూపర్ హిట్ అయి, ఆ తర్వాత బాలీవుడ్ లో ఆమిర్ తో చేసే సినిమా కూడా హిట్టైతే లోకేష్ బాలీవుడ్ లో సెటిలైపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.