అఖిల్ మూవీకి మళ్లీ బ్రేక్.. ఇంకెప్పుడు వచ్చేది?
విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నా.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు మాత్రం అందడం లేదు.;
టాలీవుడ్ లో యంగ్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే టార్గెట్ తో ముందుకెళ్తున్న అక్కినేని అఖిల్ కు మాత్రం అదృష్టం ఇంకా పూర్తిగా కలిసి రావడం లేదని ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. దాదాపు పదేళ్ల క్రితం హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్, ఇప్పటికీ ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.
విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నా.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు మాత్రం అందడం లేదు. ఈ నేపథ్యంలో అఖిల్ ఎంతో ఆశలు పెట్టుకున్న తాజా చిత్రం లెనిన్ కు కూడా వరుస అడ్డంకులు ఎదురవుతున్నాయి. అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఆ చిత్రం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది.
అయితే ఆ సినిమాకు స్టార్టింగ్ లోనే కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. మొదట హీరోయిన్ గా ఎంపికైన శ్రీలీల ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసిన తర్వాత, డేట్స్ సమస్యల కారణంగా ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. దీంతో ఆమె స్థానంలో భాగ్యశ్రీ బోర్సేను తీసుకున్నారు. ఆ మార్పుల కారణంగా షూటింగ్ కొంత ఆలస్యమైనా, చివరకు పూర్తి అయినట్లు సమాచారం. కానీ అసలు సమస్యలు విడుదల విషయంలో మొదలయ్యాయి.
మొదట సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అదే రోజు మరో భారీ చిత్రం పెద్ది విడుదలవుతుందనే ప్రకటనతో, విడుదల తేదీని మే 1కి మార్చారు. అయితే ఆ తేదీకి కూడా సినిమా సిద్ధంగా లేకపోవడంతో, మరోసారి వాయిదా పడింది. రీసెంట్ గా జూన్ 26న లెనిన్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
కానీ ఇక్కడ కూడా అఖిల్ కు లక్ కలిసి రాకపోవడం గమనించాల్సిన విషయం. ఎందుకంటే భారీ అంచనాల ఉన్న పెద్ది సినిమాను జూన్ 25న విడుదల చేయనున్నట్లు దర్శకుడు బుచ్చిబాబు ఒక కార్యక్రమంలో వెల్లడించారు. అంటే లెనిన్ కు ఒకరోజు ముందే పెద్ద సినిమా పోటీగా రానుంది. ఇలాంటి పరిస్థితుల్లో లెనిన్ జూలైకి వాయిదా పడే అవకాశం ఉందని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
హై బడ్జెట్, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న పెద్ది వంటి చిత్రంతో పోటీ పడటం లెనిన్ టీమ్ కు రిస్క్‌గా మారే అవకాశం ఉంది. అందుకే విడుదల తేదీని మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్నిసార్లు వాయిదా పడుతున్నా.. చివరికి సినిమా విజయం మాత్రం కంటెంట్ పై ఆధారపడి ఉంటుంది. ఎంత ఆలస్యమైనా మంచి కథ, ఆకట్టుకునే ప్రదర్శన ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. మరి అఖిల్ కు ఎంతో కీలకమైన లెనిన్ ఎలాంటి రిజల్ట్ ను సాధిస్తుందో వేచి చూడాలి.