మనవరాలి చేతుల మీదుగా.. నింగి కేగిన జానకమ్మ!
దక్షిణాది సహా.. అనేక భాషల్లో తన గాత్రమాధుర్యం ద్వారా వీనుల విందు చేసిన గాన కోకిల ఎస్ జానకి.. అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం ముగిశాయి.
దక్షిణాది సహా.. అనేక భాషల్లో తన గాత్రమాధుర్యం ద్వారా వీనుల విందు చేసిన గాన కోకిల ఎస్ జానకి.. అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. ఆమె కుమార్తె కూతురు అప్సర చేతుల మీదుగా జానకి గగనలోకానికి తరలిపోయారు. కర్ణాటకలోని మైసూరులో ఉన్న అపోలో ఆసుపత్రిలో శనివారం రాత్రి అనారోగ్య కారణాలతో 88 ఏళ్ల జానకి తుది శ్వాస విడిచారు. ఈ వార్త.. అశేష సంగీత అభిమానులను కన్నీటి పర్యంతం చేసింది. ప్రధాని నుంచి ముఖ్యమంత్రుల వరకు జానకి కి నివాళులర్పించారు.
ఇసకేస్తే రాలనంత!
మైసూరులోని మహారాజా కళాశాల ప్రాంగణంలో ఉన్న మైదానంలో ఆదివారం ఉదయం నుంచి జానకి పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచారు. ఈ సందర్భంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రసీమల నుంచి అనేక మంది అభిమానులు, సంగీత దర్శకులు, గాయకులు తరలి వెళ్లి.. జానకికి కడసారి వీడ్కోలు పలికారు. ఆమె స్మృతులను నెమరువేసుకున్నారు. ప్రముఖ గాయని చిత్ర.. కన్నీటి పర్యంతమయ్యారు.
అనంతరం.. కర్ణాటక ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో జానకి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసింది. పోలీసులు బ్యాండు మేళం నడుమ జానకి కుమార్తె కూతురు అప్సర విద్యుల అమ్మమ్మకు చివరి కార్యక్రమాలు నిర్వహించారు. హిందూ సంప్రదాయంలో జరిగిన అంతిమసంస్కారాలకు కర్ణాటక ప్రభుత్వం తరఫున పలువురు మంత్రులు హాజరయ్యారై.. జానకమ్మ గౌరవార్థం పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు.
అనేక మధురానుభూతులు..
పలు రాష్ట్రాలకు చెందిన సంగీత దర్శకులు, ప్రముఖ నటులు.. జానకమ్మతో తమకు ఉన్న మధురానుభూతులను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇసైజ్ఞాని ఇళయ రాజా ఓ వీడియో విడుదల చేశారు. జానకమ్మ తో తనకు ఉన్న అనుబంధాన్ని ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. అలానే.. మలయాళ సంగీత రంగానికి చెందిన ప్రముఖులు కూడా వీడియోలు విడుదల చేసి తమ మధురానుభూతులు ఎల్లవేళలా నిలిచి ఉంటాయని పేర్కొన్నారు.