'లగాన్' రీమేక్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన డైరెక్ట‌ర్!

బాలీవుడ్ క్లాసిక్ `లగాన్` అప్ప‌ట్లో ఎలాంటి సంచ‌ల‌నాలు న‌మోదు చేసిందో చెప్పాల్సిన ప‌నిలేదు.

Update: 2026-06-16 15:30 GMT

బాలీవుడ్ క్లాసిక్ `లగాన్` అప్ప‌ట్లో ఎలాంటి సంచ‌ల‌నాలు న‌మోదు చేసిందో చెప్పాల్సిన ప‌నిలేదు. భార‌తీయ సినిమాకే వ‌న్నే తీసుకొచ్చిన చిత్ర‌మ‌ది. ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో ఆశుతోష్ గోవారికర్ తెరకెక్కించిన చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడమే కాకుండా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల రేసులో నిలిచి దేశం గర్వించేలా చేసింది. ఈ ఏడాది ల‌గాన్ విడుద‌లై 25 ఏళ్తు పూర్త‌యింది. ఈ సంద‌ర్భంగా `లగాన్` చిత్రాన్ని నేటి కాలానికి అనుగుణంగా రీమేక్ రూపాన్ని ఇస్తే ఎలా ఉంటుందనే ? చర్చ సోష‌ల్ మీడియాలో న‌డుస్తోంది.

ఈనేప‌థ్యంలో అశుతోష్ గోవారికర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. కొన్ని చలనచిత్రాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయన్నారు. అలాంటి క్లాసిక్స్ ను ఎట్టిపరిస్థితుల్లో రీమేక్ చేయకూడదని బలంగా అభిప్రాయపడ్డారు. లగాన్ లాంటి సినిమాలు ఒక నిర్దిష్ట కాలంలో ప్రత్యేకమైన భావోద్వేగంతో.. చిత్ర బృందం మొత్తం ప్రాణం పెట్టి చేసిన ప్రయత్నం వల్ల మాత్రమే సాధ్యమైంద‌ని గుర్తుచేశారు. ఆనాటి మ్యాజిక్‌ను, ఆ వాతావరణాన్ని మళ్లీ రీ-క్రియేట్ చేయడం అసాధ్యమని.. ఆ ప్రయత్నం చేయడం కూడా సరికాదని అభిప్రాయ‌ప‌డ్డారు.

సినిమా మేకింగ్ అనేది కేవలం సాంకేతికత లేదా భారీ బడ్జెట్‌తో కూడినది మాత్రమే కాదని ఆ సమయంలో నటీనటులు .. సాంకేతిక నిపుణుల మధ్య కుదిరే అద్భుతమైన సమన్వయమని గోవారికర్ వివరించారు. ఆమిర్ ఖాన్ నటన, ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం, బ్రిటీష్ కాలం నాటి గ్రామీణ వాతావరణం... ఇవన్నీ లగాన్ చిత్రానికి అమూల్యమైన ఆత్మను ఇచ్చాయి. నేడు ఎంతటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వ‌చ్చినా? ఆనాటి పవిత్రతను, సహజత్వాన్ని మళ్లీ వెండితెరపై ఆవిష్కరించడం ఎవరికీ సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం హాలీవుడ్‌తో పాటు భారతీయ చిత్ర పరిశ్రమలోనూ ఎన్నో పాత చిత్రాలను సరికొత్త వెర్షన్‌లతో రీమేక్ లేదా రీబూట్ చేయడం వ్యాపార వ్యూహంగా మారింది. కానీ ప్రతి ఐకానిక్ చిత్రానికి ఒక ప్రత్యేకమైన ఉనికి ఉంటుందని దాన్ని గౌరవించాల్సిన బాధ్యత నేటి దర్శకులపై ఉంద‌న్నారు. క్లాసిక్ చిత్రాలను ముట్టుకోవడం అంటే వాటి లెగసీని దెబ్బతీయడమే అవుతుందని హెచ్చరించారు. కొత్త కథలను, సరికొత్త ఆలోచనలను వెండితెరకు పరిచయం చేయడంపైనే నేటి తరం దర్శకులు దృష్టి పెట్టాలి తప్ప అప్పటికే చరిత్ర సృష్టించిన చిత్రాల నీడలో ప్రయాణించడం శ్రేయస్కరం కాదని హితవు పలికారు.

ప్రేక్షకులు కూడా ఇలాంటి క్లాసిక్ చిత్రాలతో భావోద్వేగపరంగా తీవ్రంగా కనెక్ట్ అయి ఉంటారు. వారి మనస్సుల్లో భువన్ పాత్రలో ఆమిర్ ఖాన్ ముద్ర అలాగే సుస్థిరంగా ఉండిపోతుంది. ఇప్పుడు ఆ పాత్రలో మరొక నటుడిని ఊహించుకోవడం సగటు ప్రేక్షకుడికి సైతం కష్టమే. రీమేక్ల ద్వారా కొత్త తరం ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చనే వాదన ఇండస్ట్రీలో ఉన్నా? అసలైన చిత్రం అందించిన అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని ఏ రీమేక్ కూడా భర్తీ చేయలేదనేది జగమెరిగిన సత్యం. అందుకే ఇలాంటి మాస్టర్‌పీస్‌లను ముట్టుకోకుండా అలాగే వదిలేయడం సినిమా రంగానికి మంచిదని అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News