‘పవర్ ఆఫ్ కంటెంట్‌’కు ఇది నిదర్శనం

జనాలు థియేటర్లకు రావట్లేదని.. ఇలా అయితే సినిమాల మనుగడ చాల కష్టమని ఇటీవల సినీ జనాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.;

Update: 2025-06-23 03:39 GMT

జనాలు థియేటర్ల కు రావట్లేదని.. ఇలా అయితే సినిమాల మనుగడ చాల కష్టమని ఇటీవల సినీ జనాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ మంచి సినిమా అందిస్తే.. ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధమే అని ఎప్పటికప్పుడు రుజువు అవుతూనే ఉంటుంది. ప్రేక్షకులను మభ్యపెట్టకుండా.. లెక్కలు వేసుకోకుండా.. సిన్సియర్‌గా సినిమా తీస్తే ఎలాంటి ఆదరణ దక్కుతుందో చెప్పడానికి ‘కుబేర’ సినిమానే రుజువు.

ఈ సినిమా ప్రోమోలేమీ క్రేజీగా కనిపించలేదు. హీరోయిజం లేని.. కమర్షియల్ హంగులు జోడించని సినిమాలా కనిపించింది. హీరోను బిచ్చగాడిగా చూపించడం ఏంటి.. ఈ రోజుల్లో ఇలాంటి సీరియస్ సినిమాను ఎవరు చూస్తారు అన్న నిట్టూర్పులు వినిపించాయి రిలీజ్‌కు ముందు. తమిళంలో అడ్వాన్స్ బుకింగ్స్ ఏమాత్రం ఆశాజనకంగా కనిపించలేదు. తెలుగులో కూడా పరిస్థితి అంతంతమాత్రమే.

మరోవైపు సినిమా మీద ఏకంగా రూ.150 కోట్ల బడ్జెట్ పెట్టేశారు నిర్మాతలు. రికవరీ చాలా కష్టమని.. సినిమా హిట్టవ్వాలంటే అద్భుతాలు జరగాలని ట్రేడ్ పండిట్లు అభిప్రాయపడ్డారు. కానీ రిలీజ్ తర్వాత నిజంగా అద్భుతమే జరిగింది. మార్నింగ్ షోలకు థియేటర్లలో జనం పలుచగానే కనిపించారు. కానీ మ్యాట్నీ నుంచి ఒక్కసారిగా అంతా మారిపోయింది. సినిమా హౌస్ ఫుల్స్‌తో రన్ అయింది.

శనివారం, ఆదివారం ఈవెనింగ్, నైట్ షోలకు అయితే హైదరాబాద్‌లో ‘కుబేర’ థియేటర్లు ప్యాక్డ్ హౌస్‌లతో నడిచాయి. చాలా థియేటర్లలో కొన్ని గంటల ముందే టికెట్లు అయిపోయాయి. ఇది హీరోయిజం ఉన్న, మాస్ మూవీ కాకపోయినా.. ఇలాంటి రష్ కనిపించడం ఆశ్చర్యం కలిగించే విషయమే. చిత్ర బృందం కూడా రిలీజ్ తర్వాత ఓ హంగామా చేయలేదు. పబ్లిసిటీ గిమ్మిక్కులేమీ అనుసరించలేదు.

చిన్న ప్రెస్ మీట్ పెట్టి సింపుల్‌గా మాట్లాడారు. కానీ కంటెంట్‌లో ఉన్న బలం, పాజిటివ్ రివ్యూలు, మౌత్ పబ్లిసిటీ.. తోడై సినిమా రేంజ్ మారిపోయింది. ఆదివారం కూడా సినిమా హౌస్ ఫుల్స్‌తో రన్ అయ్యేలా కనిపిస్తోంది. తమిళంలో కూడా ‘కుబేర’ బాగా పుంజుకుని పెద్ద హిట్ దిశగా అడుగులు వేస్తోంది. అన్నింటికీ మించి యుఎస్‌లో ‘కుబేర’ అదరగొడుతోంది. 2 మిలియన్ మార్కును అలవోకగా దాటేస్తోంది.

Tags:    

Similar News