ఒకే సినిమాతో మొదలైన మెగా - కోటా ప్రయాణం
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు మృతి చెందడం తీవ్ర విషాదానికి దారితీసింది.;
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు మృతి చెందడం తీవ్ర విషాదానికి దారితీసింది. 83 ఏళ్ల వయస్సులో వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో ఆయన ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో 750కు పైగా సినిమాల్లో నటించిన కోటా… విలన్, కామెడీ క్యారెక్టర్, సీరియస్ రోల్స్‌తో ప్రేక్షకులను అలరించి, తనదైన శైలిలో గుర్తింపు పొందారు.
కోటా శ్రీనివాసరావు మరణవార్తపై మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగంగా స్పందించారు. "కోటా గారు లేరు అనడం చాలా బాధగా ఉంది. ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో నేను, ఆయన ఇద్దరం ఒక్కేసారి కెరీర్ మొదలుపెట్టాం. ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో కలిసి పనిచేశాం. ప్రతి పాత్రను తనదైన శైలిలో అలరించిన గొప్ప నటుడు కోటా" అని చిరు పేర్కొన్నారు. కోటా మరణం తీరనిలోటని అభిప్రాయపడ్డారు.
1978లో వచ్చిన ప్రాణం ఖరీదు సినిమాతో చిరంజీవి, కోటా శ్రీనివాసరావు ఇద్దరూ సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. క్రాంతి కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించగా, రాజభదూర్ దర్శకత్వం వహించారు. ఆ సినిమాలోని పాత్రల కోసం నాటక బృందాన్ని తీసుకున్నారు. అందులో కోటా, చిరు ఇద్దరూ తమ పాత్రలకు న్యాయం చేస్తూ ఆకట్టుకున్నారు. ఇదే సినిమా మెగాస్టార్‌కు, కోటాకు సినీ ప్రస్థానానికి మొదటి అడుగు.
ఆ సినిమాలో చిరంజీవి పాత్రను సీరియస్‌గా అద్భుతంగా చేశారు. మరోవైపు కోటా చేసిన రోల్‌లో ఆయన నటన తనదైన శైలిలో చూపించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ఇద్దరూ తమ తమ శైలిలో దూసుకెళ్లారు. చిరు హీరోగా రాణిస్తే, కోటా విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన స్థానం సంపాదించుకున్నారు.
ఆ తర్వాత చిరంజీవి కోటా కలిసి నటించిన చిత్రాలు కూడా బలమైనవే. అన్నయ్య, యముడికి మొగుడు, స్నేహం కోసం,ముఠా మెస్ట్రీ, ముగ్గురు మొనగాళ్ళు, బావగారు బాగున్నారా లాంటి చిత్రాల్లో ఇద్దరూ స్క్రీన్ మీద కనిపించారు. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. చిరు నటనలో పవర్ ఉంటే, కోటా నటనలో క్లాస్ ఉండేది.
కోటా శ్రీనివాసరావు తెలుగులో తన నటనతోనే కాదు, తన గొంతుతో కూడా పాత్రలకు జీవం పోసేవారు. విలనిజానికి కొత్త అర్థం చెప్పారు. మెగా హీరోలతో ఆయన చేసిన సినిమాలు అభిమానుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. ఆయన లేరు అన్న విషయాన్ని ఒప్పుకోవడం కష్టం. కానీ ఆయన మొదటి చిత్రం మెగాస్టార్‌తో కలిసి ఉండటం ఓ ప్రత్యేకమైన జ్ఞాపకం.