రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి': భార్యలు అడిగే ఆ ఒక్క ప్రశ్నతోనే అసలు ఆట!
మాస్ మహారాజా రవితేజ నటించిన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమా జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.;
మాస్ మహారాజా రవితేజ నటించిన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమా జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా గురించి డైరెక్టర్ కిషోర్ తిరుమల తాజాగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఒక భర్త తన అనుభవాల ద్వారా మిగతా భర్తలకు ఏం చెప్పాలనుకుంటున్నాడు, తను ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటనేదే ఈ కథలోని ప్రధాన అంశం అని అన్నారు. ఈ సినిమాలో ఇద్దరు అమ్మాయిలు అడిగే ఒక ప్రశ్న ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తుందని కిషోర్ తిరుమల తెలిపారు. పెళ్లయిన ప్రతి వ్యక్తికీ ఏదో ఒక సమయంలో ఎదురయ్యే ఆ కఠినమైన ప్రశ్న చుట్టూనే కథ సెన్సిబుల్‌గా సాగుతుందని అన్నారు.
ఇక సాధారణంగా ఇలాంటి విషయాల్లో విడాకుల వరకు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ, ఈ సినిమాలో మాత్రం దాన్ని చాలా భిన్నంగా, వినోదాత్మకంగా డీల్ చేశారట. ఈ కాన్ఫ్లిక్ట్ 'ఐ' సినిమాలో విక్రమ్ చెప్పే 'అంతకుమించి' అనే రేంజ్ లో ఉంటుందని ఆయన వివరించారు. రవితేజ ఈ కథను విన్న వెంటనే చాలా ఎగ్జైట్ అయి, ఇతర ప్రాజెక్టులు ఉన్నా కూడా దీనికే ముందు ఓటు వేశారని తెలిపారు.
షూటింగ్ సమయంలో ఆయన చాలా ఫ్రెష్‌గా కనిపిస్తారని, సలహాలు ఇస్తూ ఎంతో జోష్‌తో పనిచేశారని కిషోర్ పేర్కొన్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో కిషోర్ స్వయంగా డ్యాన్స్ చేయడం చర్చనీయాంశమైంది. సినిమా తీయడం ఒక ఎత్తైతే, దాన్ని ప్రేక్షకులకు చేరవేయడం కూడా అంతే ముఖ్యమనే ఉద్దేశంతోనే ఆ జోష్ తో డ్యాన్స్ చేసినట్లు ఆయన వెల్లడించారు.
సినిమాలో కామెడీ గురించి మాట్లాడుతూ, సత్య, వెన్నెల కిషోర్ ల ట్రాక్స్ హిలేరియస్‌గా ఉంటాయని దర్శకుడు హామీ ఇచ్చారు. సునీల్ పాత్ర 'పెళ్ళాం ఊరెళితే', 'దుబాయ్ శీను' చిత్రాలలోని ఫన్ ను గుర్తు చేస్తుందని, సత్య నటించిన ఒక బిట్ సాంగ్‌కు కిషోర్ స్వయంగా కొరియోగ్రఫీ చేసినట్లు తెలిపారు. హీరోయిన్లు ఆషిక రంగనాథ్, డింపుల్ హయతి పాత్రలకు సినిమాలో మంచి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉందని, వారిద్దరూ భిన్నమైన రోల్స్‌లో కనిపిస్తారని అన్నారు.
నిర్మాత సుధాకర్ చెరుకూరి గురించి చెబుతూ, ఆయన ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను రిచ్‌గా నిర్మించారని కిషోర్ ప్రశంసించారు. సంక్రాంతి సీజన్ లో ఎంటర్‌టైన్‌మెంట్‌కు స్కోప్ ఎక్కువగా ఉంటుందని, అందుకే ఈ అవుట్ అండ్ అవుట్ ఫన్ ఫిల్మ్‌తో వస్తున్నట్లు చెప్పారు. ఇది ఆయన మొదటి సంక్రాంతి సినిమా కావడం విశేషం. ఇప్పటికే సినిమా చూసిన వారందరికీ కథ బాగా నచ్చిందని, ఆడియన్స్ కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని కిషోర్ తిరుమల ధీమా వ్యక్తం చేశారు.
తన భవిష్యత్ ప్రాజెక్టుల గురించి స్పందిస్తూ, 'మిరాయ్' సినిమా ద్వారా నటుడిగా మారడం ఒక కొత్త అనుభూతిని ఇచ్చిందని కిషోర్ తెలిపారు. ప్రస్తుతం తన దగ్గర ఒక మైథాలజీ కథతో పాటు 'మున్నా భాయ్' లాంటి సోషల్ సెటైర్ స్క్రిప్టులు ఉన్నాయని, త్వరలోనే వాటి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.