నా ఆలోచనలకు ప్రతిఫలమే తిమ్మరాజు పల్లి TV
డైరెక్టర్ మునిరాజ్ ఈ సినిమాను కమర్షియల్ ఫార్ములాలకు లోబడకుండా నిజాయితీగా తెరకెక్కించాలని మొదటి నుంచే నిర్ణయించుకున్నారని కిరణ్ ప్రశంసించారు.;
హైదరాబాద్‌లో జరిగిన తిమ్మరాజుపల్లి TV గ్రాండ్ రివీల్ ఈవెంట్‌లో హీరో మరియు నిర్మాత అయిన కిరణ్ అబ్బవరం తన మనసుకు ఎంతో దగ్గరైన ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. కొత్త టాలెంట్ ను ప్రోత్సహించాలనే తన కల ఈ సినిమా రూపంలో నిజమైందని ఆయన వెల్లడించారు. ఇండస్ట్రీలో సెటిల్ అవకముందే కొత్త కళాకారులతో సినిమా చేయాలనే ఆలోచన తనలో ఉండేదని, అది ఇప్పుడు కార్యరూపం దాల్చడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.
నమ్మకాన్ని ఎప్పుడూ వదలలేదు
తన కెరీర్ స్టార్టింగ్ దశలో ఎన్నో అనిశ్చితులు ఎదురైనా, ఒకరోజు తాను ఎదిగి ఇతరులకు అవకాశాలు కల్పించే స్థాయికి చేరుతాననే నమ్మకాన్ని ఎప్పుడూ వదలలేదని కిరణ్ చెప్పారు. తిమ్మరాజుపల్లి TV ఆ ఆలోచనకు ప్రతిఫలమని పేర్కొన్నారు. ఈ సినిమా కేవలం ఒక సినిమా కాకుండా, గ్రామీణ జీవన విధానాన్ని, పాతకాలపు భావోద్వేగాలను ప్రతిబింబించే ప్రయోగాత్మక కథగా రూపొందిందని వివరించారు.
సస్పెన్స్, ఎమోషన్స్ సమపాళ్లలో..
ఈ సినిమా కథ 1990ల గ్రామీణ నేపథ్యంతో సాగుతుందని, ఆ కాలంలో టీవీలు అరుదుగా ఉండేవని ఆయన గుర్తుచేశారు. గ్రామాల్లో ఒకే చోట ప్రజలు చేరి టీవీ చూసే రోజుల్ని మళ్లీ తెరపై చూపించడానికి ఈ సినిమా ప్రయత్నిస్తుందని తెలిపారు. ఆ అమాయకత్వం, ఆ అనుబంధం, ఆ సామూహిక అనుభూతి.. అన్నీ ఈ సినిమాలో మెయిన్ ఎట్రాక్షన్స్ గా నిలుస్తాయని చెప్పారు. అదే సమయంలో కథలో సస్పెన్స్, ఎమోషన్స్ సమపాళ్లలో మిళితమై ఉంటాయని వెల్లడించారు.
సౌకర్యాలను పక్కన పెట్టి మరీ..
డైరెక్టర్ మునిరాజ్ ఈ సినిమాను కమర్షియల్ ఫార్ములాలకు లోబడకుండా నిజాయితీగా తెరకెక్కించాలని మొదటి నుంచే నిర్ణయించుకున్నారని కిరణ్ ప్రశంసించారు. కథ చెప్పడంలో రియాలిటీని కాపాడటమే మెయిన్ టార్గెట్ గా టీమ్ వర్క్ చేసిందని కిరణ్ తెలిపారు. ఈ క్రమంలో చిత్ర బృందం మొత్తం షూటింగ్ సమయంలో గ్రామ వాతావరణంలోనే నివసిస్తూ, సౌకర్యాలను పక్కనపెట్టి మరీ వర్క్ చేసిందని చెప్పారు. ఈ డెడికేషనే సినిమా క్వాలిటీను మరింత పెంచిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా, కొత్తగా ఇండస్ట్రీలోకి వస్తున్న కళాకారులకు ఈ సినిమా ఒక వేదికగా నిలుస్తుందని, వారి టాలెంట్ ను ప్రేక్షకులు గుర్తించాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఏప్రిల్ 17న థియేటర్లలో రిలీజ్ కాబోతున్న తిమ్మరాజుపల్లి TV ప్రేక్షకులను, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను మరియు 90స్ జెనరేషన్ ఆడియన్స్ ను బలంగా ఆకట్టుకుంటుందని కిరణ్ అబ్బవరం విశ్వాసం వ్యక్తం చేశారు.