'K-ర్యాంప్' కోసం యూఎస్ ట్రిప్.. నిర్మాత కొత్త ప్లాన్!

ఈ మీట్‌లో నిర్మాత రాజేశ్ దండా మరోసారి మూవీ రిజల్ట్ పై క్లారిటీ ఇచ్చారు. నిర్మాత రాజేశ్ దండా మాట్లాడుతూ, హీరో కిరణ్ అబ్బవరం డెడికేషన్‌పై ప్రశంసలు కురిపించారు.;

Update: 2025-10-21 11:03 GMT

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన 'K-ర్యాంప్' చిత్రం దీపావళి కానుకగా థియేటర్లలోకి వచ్చింది. సినిమాకు మిశ్రమ స్పందనలు వస్తున్నాయనే విషయంలో మేకర్స్ స్పందించారు. అవన్నీ నిజం కాదని సినిమా బ్లాక్ బస్టర్ అని తెలిపింది. ఏదేమైనా చిత్రయూనిట్ మాత్రం ప్రమోషన్ల విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా, B, C సెంటర్లలో సినిమాకు మంచి ఆదరణ లభిస్తోందని చెబుతూ, తాజాగా "ర్యాంపేజ్ బ్లాక్‌బస్టర్ మీట్"ను నిర్వహించింది.

ఈ మీట్‌లో నిర్మాత రాజేశ్ దండా మరోసారి మూవీ రిజల్ట్ పై క్లారిటీ ఇచ్చారు. నిర్మాత రాజేశ్ దండా మాట్లాడుతూ, హీరో కిరణ్ అబ్బవరం డెడికేషన్‌పై ప్రశంసలు కురిపించారు. "హీరో గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. నిన్న కర్నూలు, అనంతపురం వెళ్లాం. అప్ అండ్ డౌన్ 12 గంటలు జర్నీ చేశాం. అయినా కూడా, మళ్లీ రేపు ఏం చేద్దాం, ఎల్లుండి ఏం చేద్దాం అనే తపనలోనే ఆయన ఉంటారు. మీతో మళ్లీ మళ్లీ వర్క్ చేయాలని ఉంది సార్" అంటూ కిరణ్‌కు థ్యాంక్స్ చెప్పారు.

అయితే, ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న సమయంలోనే, నిర్మాత తనలోని ఒక అసంతృప్తిని కూడా బయటపెట్టారు. "నాకు ఒక చిన్న డిసప్పాయింట్‌మెంట్ ఉంది. ఈ మిక్స్‌డ్ రివ్యూల వల్ల, ఓవర్సీస్ మార్కెట్‌లో సినిమా ఆశించిన స్థాయిలో పిక్ అప్ అవ్వలేదు" అని ఆయన నిజాయితీగా అంగీకరించారు.

ఈ లోటును భర్తీ చేయడానికి, టీమ్ ఇప్పుడు ఒక కొత్త ప్లాన్ వేసింది. ఓవర్సీస్ ప్రేక్షకులను నేరుగా ఆకట్టుకోవాలని నిర్ణయించుకుంది. "మా హీరో గారిని తీసుకొని ఈ గురువారం మేం యూఎస్ ట్రిప్ వెళ్తున్నాం. అక్కడ కూడా ఆడియన్స్, మా మాటలు నమ్మి థియేటర్లకు రావాలని కోరుకుంటున్నాను" అని రాజేశ్ దండా ప్రకటించారు. మాములుగా సినిమాలు విడుదలయ్యాక, లోకల్ గా థియేటర్ టూర్లు చేయడం చూస్తుంటాం. కానీ, ఒక సినిమా ఓవర్సీస్‌లో డల్‌గా ఉందని, ఏకంగా హీరోను, నిర్మాత అక్కడికి ప్రమోషన్ కోసం తీసుకెళ్లడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది.

సినిమాను ఎలాగైనా అమెరికా లో కూడా సక్సెస్ చేయాలనే వారి తపన బాగా హైలెట్ అవుతోంది. మొత్తం మీద, 'K-ర్యాంప్' టీమ్ తమ సినిమాపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ ని పట్టించుకోకుండా, సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. తెలుగు మార్కెట్‌లో మాస్ ఆడియన్స్‌ను మెప్పించామని చెబుతున్న టీమ్, ఇప్పుడు రివ్యూల వలన డీలా పడ్డ యూఎస్ మార్కెట్‌ను టార్గెట్ చేయడం ఆసక్తికరంగా మారింది.


Tags:    

Similar News