'K-ర్యాంప్' కలెక్షన్ల జోరు.. రెండో రోజు ఇంకాస్త ఎక్కువగా..
సోషల్ మీడియాలో రివ్యూలు ఆన్‌లైన్ ట్రోలింగ్‌ను దాటి, కేవలం మౌత్ టాక్‌తోనే కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిలబడిపోతాయి. ఈ దీపావళికి సరిగ్గా అలాంటి ఒక ట్రెండే కనిపిస్తోందని అంటోంది 'K-ర్యాంప్' చిత్రయూనిట్.;
పండగ బాక్సాఫీస్ లెక్కలు కొన్నిసార్లు చిత్రంగా ఉంటాయి. విమర్శకులు పెదవి విరిచిన సినిమాలు, ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేస్తుంటాయి. సోషల్ మీడియాలో రివ్యూలు ఆన్‌లైన్ ట్రోలింగ్‌ను దాటి, కేవలం మౌత్ టాక్‌తోనే కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిలబడిపోతాయి. ఈ దీపావళికి సరిగ్గా అలాంటి ఒక ట్రెండే కనిపిస్తోందని అంటోంది 'K-ర్యాంప్' చిత్రయూనిట్.
శనివారం విడుదలైన కిరణ్ అబ్బవరం 'K-ర్యాంప్' చిత్రానికి క్రిటిక్స్ నుంచి మిక్స్ డ్ టాక్ లభించిన విషయం తెలిసిందే. దీంతో, సినిమా పండగ రేసులో నిలదొక్కుకోవడం కష్టమేనని చాలామంది భావించారు. ఈ నేపథ్యంలో, చిత్ర నిర్మాత రాజేశ్ దండా పలు ట్విట్టర్ రివ్యూయర్లపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, ప్రేక్షకుల తీర్పే ఫైనల్ అని ధీమాగా చెప్పారు. ఇప్పుడు ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ, సినిమా కలెక్షన్లపై మేకర్స్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.
చిత్రయూనిట్ వదిలిన లేటెస్ట్ పోస్టర్ ప్రకారం, 'K-ర్యాంప్' మొదటి రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.11.3 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు తెలుస్తోంది. ఈ నంబర్‌తో, ఈ దీపావళికి తమ సినిమానే ఛాంపియన్‌గా నిలిచిందని వారు ప్రకటించారు. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్‌లో కొత్త జోష్ నింపుతోంది.
మేకర్స్ చెబుతున్న దాని ప్రకారం, సినిమాకు రోజురోజుకు కలెక్షన్లు పెరుగుతున్నాయి. మొదటి రోజును మించిన వసూళ్లు రెండో రోజు వచ్చాయని, ఇది సినిమాకు ఆడియన్స్‌లో ఉన్న పాజిటివ్ మౌత్ టాక్‌కు నిదర్శనమని వారు అంటున్నారు. ముఖ్యంగా, మాస్, యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారని, B, C సెంటర్లలో సినిమాకు అద్భుతమైన ఆదరణ లభిస్తోందని వారు చెబుతున్నారు.
ఈ పాజిటివ్ ట్రెండ్‌కు హీరో కిరణ్ అబ్బవరం చేసిన ప్రమోషనల్ టూర్స్ కూడా బాగా హెల్ప్ అయ్యాయని చిత్రయూనిట్ అంటోంది. ఆయన నేరుగా ప్రేక్షకుల్లోకి వెళ్లడం సినిమాపై క్రేజ్‌ను పెంచిందని వారు అభిప్రాయపడుతున్నారు. "రిచ్చెస్ట్ చిల్లర్ గయ్"గా కిరణ్ పెర్ఫార్మెన్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తోందని చెబుతున్నారు. అయితే, అసలు సిసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది. ఈ రోజు (సోమవారం), రేపు (మంగళవారం) దీపావళి పండగ సెలవులు ఉన్నాయి. ఈ లాంగ్ వీకెండ్ సినిమా భవిష్యత్తును నిర్ణయించనుంది. మేకర్స్ ప్రకటించిన ఈ ఊపు, పండగ తరువాత కూడా కొనసాగి, సినిమాను సేఫ్ జోన్‌లోకి తీసుకెళ్తుందో లేదో చూడాలి.