కిరణ్ అబ్బవరం మెదక్‌లో ఏం చేస్తున్నాడు?
ఫాంటసీ థ్రిల్లర్ `క` సినిమాతో సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చేసిన కిరణ్ అబ్బవరం రొమాంటిక్ కామెడీ `కే ర్యాంప్`తో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు.;
ఫాంటసీ థ్రిల్లర్ `క` సినిమాతో సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చేసిన కిరణ్ అబ్బవరం రొమాంటిక్ కామెడీ `కే ర్యాంప్`తో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం `చెన్నై లవ్‌స్టోరీ`లో నటిస్తున్న కిరణ్ దీని తరువాత `క` సీక్వెల్‌ని కూడా పట్టాలెక్కించబోతున్నాడు. దీనికి టైమ్ ఉండటంతో మధ్యలో మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. ఈ మధ్య యంగ్ హీరోల్లో చాలా మంది సినిమాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఓటీటీల్లో తొంగి చూస్తున్నారు. ఇక్కడ టైమ్ బాగాలేకపోతే అక్కడ బిజీ కావచ్చని ముందే ప్లాన్ చేసుకుంటున్నారు.
ఇప్పటికే ఈ ఫార్ములాని నవీన్ చంద్రతో పాటు సందీప్ కిషన్, ఆనంద్ దేవరకొండ ఫాలో అవుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా చేరుతున్నాడు. ఓ పక్క వరుస సినిమాల్లో నటిస్తూనే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందాం అన్నట్టుగా ఓటీటీ బాటపడుతున్నాడు. తొలి ప్రయత్నంగా కిరణ్ అబ్బవరం ఓ పొలిటికల్ థ్రిల్లర్ స్టోరీ నేపథ్యంలో సిరీస్‌లో నటిస్తున్నాడు. దీనికి `డియర్ కామ్రేడ్` భరత్ కమ్మ దర్శకుడు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ సిరీస్‌గా ఇది రూపొందుతోంది.
ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో కిరణ్ అబ్బవరం మెయిన్ క్యారెక్టర్‌లో నటిస్తుండగా, మరో కీలకమైన పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌లో యంగ్ హీరో తిరువీరు నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ మెదక్‌లో మమొదలైంది. అక్కడే పలు కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారట. అత్యంత భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో దీన్ని భరత్ కమ్మ తెరకెక్కిస్తున్నారు. విజయ్ దేవరకొండ `కింగ్‌డమ్` మూవీలో రూత్‌లెస్ విలన్‌గా నటించిన వెంకటేష్ విపి ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు.
భరత్ కమ్మ డైరెక్ట్ చేసిన `డియర్ కామ్రేడ్` మంచి టాక్‌ని సొంతం చేసుకున్నా కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకోలేకపోయింది. రష్మి మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ ప్రధాన స్టోరీ అంతా రష్మిక చుట్టే తిరగడంతో లేడీ ఓరియెంటెడ్ ఫీల్ కలిగింది. దీంతో రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు ఏర్పడ్డా..రిలీజ్ తరువాత అనుకున్న స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీ తరువాత భరత్ కమ్మ మరో సినిమా చేయలేకపోయాడు.
అయితే మళ్లీ కొంత విరామం తరువాత కిరణ్ అబ్బవరంతో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్‌ని చేస్తున్నాడు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ ఒరిజినల్స్ విభాగంలో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ బాటలో సరికొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టిన భరత్ కమ్మ ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌తో డైరెక్టర్‌గా బిజీ అవుతాడా? అన్నది తెలియాలంటే ఈ సిరీస్ రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.