ఎంపికలతోనే కియరాకు ఇలాంటి చిక్కులు!
ఇప్పుడు చాలా హోప్స్ పెట్టుకుని ఎదురు చూసిన `వార్ 2` చిత్రంపై సమీక్షకులు విరుచుకుపడటంతో తన ఎంపికల విషయంలో ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.;
కెరీర్ లో నటించినవన్నీ భారీ క్రేజ్ ఉన్న సినిమాలే. ప్రతిసారీ అగ్రహీరోల సరసన అవకాశాలొచ్చాయి. కానీ ఈ భామకు సరైన బ్లాక్ బస్టర్ పడటం చాలా కష్టమే అవుతోంది. ఇటీవల అరడజను ఫ్లాపుల తర్వాత వార్ 2 రూపంలో అయినా సక్సెస్ చేతికి అందుతుందని భావించింది. కానీ మొదటిరోజు నిరాశపరిచే రివ్యూలతో అది కూడా ఆవిరైపోయింది. వార్ 2 మొదటి వీకెండ్ నాటికి కేవలం 200 కోట్లు వసూలు చేసింది. సోమవారం నుంచి టికెట్ విండో వద్ద ఊపు తగ్గిపోయిందని ట్రేడ్ విశ్లేషిస్తోంది.
చాన్నాళ్లుగా దక్కనిది...
నిజానికి భూల్ భులయా 3 తర్వాత కియరాకు అసలు విజయ అన్నదే లేదు. రామ్ చరణ్ సరసన శంకర్ దర్శకత్వంలో నటించిన `గేమ్ ఛేంజర్` భారీ హైప్ నడుమ విడుదలై ఘోరమైన డిజాస్టర్ గా మారింది. ఇది నిజానికి చరణ్, శంకర్ లతో పాటు కియరాను కూడా తీవ్రంగా నిరాశపరిచింది. అప్పటికి `దేవర`లో అవకాశం వచ్చినా కానీ గేమ్ ఛేంజర్ కోసం ఆ అవకాశాన్ని వదులుకుందన్న టాక్ కూడా ఉంది. జగ్ జగ్ జియో, గోవిందా నామ్ తేరా, సత్య ప్రేమ్ కి కథ వంటి సినిమాలు కూడా ఆశించినంత బ్లాక్ బస్టర్లు కాలేదు. దీంతో చాలా కాలంగా కియరా నిరాశలోనే ఉంది.
ఈ రెండిటితో రియలైజేషన్:
ఇప్పుడు చాలా హోప్స్ పెట్టుకుని ఎదురు చూసిన `వార్ 2` చిత్రంపై సమీక్షకులు విరుచుకుపడటంతో తన ఎంపికల విషయంలో ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హృతిక్, ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోల సరసన అవకాశం వచ్చినా, తన పాత్రలో అంతో ఇంతో విషయం ఉన్నా కానీ, స్క్రిప్టులో మ్యాటర్ లేకపోతే ఓవరాల్ గా ఫలితం ఎలా ఉంటుందో కియరాకు `గేమ్ ఛేంజర్` తర్వాత వెంటనే `వార్ 2`తో తెలిసొచ్చింది. కాబట్టి భవిష్యత్ లో స్క్రిప్టులో ప్రత్యేకతను కూడా గెస్ చేయడం నేర్చుకోవాల్సి ఉంది. ఇప్పటి ఈ రియలైజేషన్ నెక్ట్స్ ఎంపికపై ప్రభావం చూపుతుందేమో చూడాలి. పెద్ద స్టార్లు, పెద్ద స్టార్ డైరెక్టర్, బడా నిర్మాతలు మాత్రమే తనకు గొప్ప విజయాన్ని ఇవ్వలేరు. ఇప్పుడు కియరా కూడా ఒక నిత్యా మీనన్ లా, సాయిపల్లవిలా కిందికి దిగి వచ్చి ఆలోచించగలగాలి.
ఆదుకునేది ఇదొక్కటే...
ఈ క్లిష్ఠ సమయంలో కియరాను ఆదుకునేది `టాక్సిక్` ఒక్కటే. కేజీఎఫ్ యష్ లాంటి ట్యాలెంటెడ్ హీరో సరసన కియరాకు అరుదైన అవకాశమిది.. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రకరకాల కారణాలతో విడుదల అంతకంతకు ఆలస్యమవుతోంది. గేమ్ ఛేంజర్, వార్ 2 రేంజులో పాన్ ఇండియాలో విడుదలయ్యే మరో చిత్రం కావడంతో కియరా హోప్స్ అన్నీ ఈ సినిమాపైనే.