హిట్లు లేకపోయినా జోరు మీదున్న ఖుషీ ... బాంద్రాలో ఖరీదైన ప్లాట్ కొనుగోలు!

సినిమా కెరీర్ గ్రాఫ్ ఆశించిన స్థాయిలో లేక‌పోయినా.. ఖుషీ కపూర్ సంపాదనకు మాత్రం ఎలాంటి డోకా లేదు.

Update: 2026-09-06 14:30 GMT

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, దివంగత నటి శ్రీదేవి చిన్నకుమార్తె ఖుషీ కపూర్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. సినిమాల‌తో కంటే డేటింగ్ వ్య‌వ‌హారాల‌తో ఈ భామ పేరు మార్మోగుతోంది. న‌టించిన రెండు మూడు సినిమాలు ఫ్లాపులు అయినా ఈ యంగ్ బ్యూటీ త‌న సోష‌ల్ మీడియాల ద్వారా బాగానే ఆర్జిస్తుండ‌టం నిరంత‌రం చ‌ర్చ‌గా మారుతోంది. ఖుషీ సినీ కెరీర్ జర్నీని పరిశీలిస్తే... ఇప్పటివరకు ఖాతాలో ఒక్క సరైన హిట్ కూడా పడలేదు. నటనపరంగా చూస్తే.. త‌న సోద‌రి జాన్వీ కపూర్ కనీసం తన మొదటి సినిమా `ధడక్`తో అందం, నటనతో ప్రేక్షకులను కొంతవరకు మెప్పించగలిగింది. కానీ ఖుషీ కపూర్ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా తయారైంది. బాలీవుడ్‌లో `ది ఆర్చీస్` అనే అవుట్‌డేటెడ్ ఓటీటీ ప్రాజెక్ట్‌తో ఎంట్రీ ఇచ్చిన ఈ కపూర్ గాళ్, ఆ తర్వాత కూడా వరుసగా పెద్దగా స్టార్‌డమ్ లేని కొత్త హీరోల సరసన నటిస్తూ ఆరంభంలోనే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులను ఎదుర్కొంది.

సినిమా కెరీర్ గ్రాఫ్ ఆశించిన స్థాయిలో లేక‌పోయినా.. ఖుషీ కపూర్ సంపాదనకు మాత్రం ఎలాంటి డోకా లేదు. బాక్సాఫీస్ వద్ద సినిమాలు డిజాస్టర్లుగా మిగిలినా.. సోషల్ మీడియా వేదికగా త‌న‌కు ఉన్న క్రేజ్ - పాపులారిటీతో భారీగానే ఆర్జిస్తోంది. నిరంతరం పాపుల‌ర్ బ్రాండ్లకు మోడలింగ్ చేయడం, ఎండార్స్‌మెంట్లు- ప్రమోషనల్ యాడ్స్ ద్వారా కోట్లు గడిస్తోంది. సినిమాలు లేకపోయినా సోషల్ మీడియా స్టార్‌డమ్‌తోనే సొంతంగా సంపాదించే స్థాయికి చేరుకోవడం విశేషం.

ఈ క్రమంలోనే ఖుషీ కపూర్ ఇటీవల ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఇల్లు కొనుగోలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ముంబైలోని బాంద్రా వెస్ట్ ప్రాంతంలో ఉన్న `సమతాదీప్` బిల్డింగ్‌లో రూ. 63 లక్షల విలువైన ఒక రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ సిఆర్ఇ మేట్రిక్స్ ద్వారా లభించిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ ప్రాపర్టీ వివరాలను పరిశీలిస్తే.. బాంద్రా వెస్ట్‌లోని 25వ రోడ్డులో ఉన్న ఈ అపార్ట్‌మెంట్ 180 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా, 216 చదరపు అడుగుల బిల్ట్-అప్ ఏరియాను కలిగి ఉంది. ఫరూక్ ఛాగ్లా అనే వ్యక్తి నుంచి ఖుషీ ఈ ప్లాట్‌ను కొనుగోలు చేయగా.. ఈ లావాదేవీ 2026 సెప్టెంబర్ 1న రిజిస్టర్ అయ్యింది. ఈ అపార్ట్‌మెంట్ రిజిస్ట్రేషన్ కోసం ఖుషీ రూ. 3.15 లక్షల స్టాంప్ డ్యూటీని కూడా చెల్లించారు. కార్పెట్ ఏరియా ప్రకారం చూస్తే ఇక్కడ చదరపు అడుగుకి సుమారు రూ. 35,000 రేటు ఉంది.

ముంబైలోని బాంద్రా వెస్ట్ - పాలి హిల్ ప్రాంతాలు బాలీవుడ్ సెలబ్రిటీలకు, వ్యాపారవేత్తలకు నిలయంగా భావిస్తారు. అక్కడ సొంత ఇల్లు ఉండటం ఒక హోదాగా పరిగణిస్తారు. కెరీర్ ప్రారంభంలోనే వరుస పరాజయాలు ఎదురైనా మోడలింగ్, బ్రాండ్ డీల్స్ ద్వారా సొంతంగా సంపాదిస్తూ ఇలాంటి ప్రామిసింగ్ ఏరియాలో ఆస్తిని సొంతం చేసుకోవడం ద్వారా ఖుషీ కపూర్ ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు.

Tags:    

Similar News