రష్మిక, ఐశ్వర్య రాయ్.. ఇప్పుడు కీర్తి సురేష్!
తాజాగా ఈ ఏఐ డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోల గురించి కీర్తి సురేష్ స్పందించింది.;
సినిమా ఇండస్ట్రీ వారు పెరిగిన టెక్నాలజీ ఉపయోగించుకుని అద్భుతాలు ఆవిష్కరిస్తున్నారు. రాజమౌళి వంటి దర్శకులు వీఎఫ్‌ఎక్స్‌తో వండర్స్‌ను క్రియేట్ చేసి ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తూ, విజువల్ వండర్‌లను అందిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో టెక్నాలజీని ఉపయోగించి అద్భుతాలను ఆవిష్కరిస్తున్న దర్శకులు చాలా మంది ఉన్నారు. అయితే అదే టెక్నాలజీతో కొందరు ఆకతాయిలు నేరాలకు పాల్పడుతున్నారు, కొందరు హీరోయిన్స్‌ని అసభ్యంగా చూపించి రాక్షస ఆనందం పొందుతున్నారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీల యొక్క డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొందరి వీడియోలు, ఫోటోలు వారి ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా ఉన్నాయి. సమాజంలో చాలా గౌరవం తో ఉన్న స్టార్స్ సైతం ఏఐ ఫోటోలు, వీడియోల కారణంగా తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
కీర్తి సురేష్ డీప్ ఫేక్ ఫోటోలు వైరల్
ఏఐ వల్ల మొదట ఇబ్బంది పడ్డ హీరోయిన్స్‌లో రష్మిక మందన్న ముందు ఉంటారు. ఈమె హీరోయిన్‌గా స్టార్‌డంతో దూసుకు పోతున్న సమయంలో ఏఐ తో క్రియేట్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అప్పటికి ఏఐ గురించి ఇంకా ఎక్కువగా ప్రచారం లేదు. దాంతో ఆ వీడియో నిజంగానే రష్మిక మందన్నది అయ్యి ఉంటుందని చాలా మంది అనుకున్నారు. ఆ తర్వాత అది డీప్ ఫేక్ వీడియో అని వెళ్లడి అయింది. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ డీప్ ఫేక్ వీడియోను సైతం తయారు చేసి కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక హీరోయిన్ ఐశ్వర్య రాయ్ వీడియోను సైతం కొందరు అసభ్యకరంగా తయారు చేయడం, అది సోషల్ మీడియాలో చర్చనీయాంశం కావడం అందరికీ తెలిసిందే. ఇప్పుడు డీప్ ఫేక్ వీడియోలు అనేవి చాలా కామన్ అయ్యాయి అని సెలబ్రిటీలు మాట్లాడుకుంటున్నారు.
రివాల్వర్ రీటా సినిమాతో కీర్తి సురేష్..
తాజాగా ఈ ఏఐ డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోల గురించి కీర్తి సురేష్ స్పందించింది. ఈమె నటించిన తమిళ మూవీ రివాల్వర్ రీటా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నవంబర్ 28న విడుదల కాబోతున్న రివాల్వర్ రీటా సినిమాకు జేకే చంద్రు దర్శకత్వం వహించాడు. రాధిక, శరత్ కుమార్, సునీల్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కీర్తి సురేష్ పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. ఒక ఇంటర్వ్యూలో సినిమా గురించి మాట్లాడటంతో పాటు, తన పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియా ప్రచారం గురించి స్పందించింది. ముఖ్యంగా ఏఐ తో చేసిన డీప్ ఫేక్ ఫోటోల గురించి కీర్తి సురేష్ స్పందించింది. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి నేను వేసుకున్న డ్రస్ మార్చారు, నేను వేరే ఫోజ్‌లు ఇచ్చినట్లుగా క్రియేట్ చేశారు. చూడ్డానికి అసభ్యంగా ఉన్న ఆ ఫోటోలు చూసి నేనే షాక్ అయ్యాను అంది.
మెగాస్టార్ చిరంజీవి ఫిర్యాదు
ఏఐ అనేది ప్రస్తుతం సెలబ్రిటీలకు పెద్ద తలనొప్పిగా మారింది. గతంలో ఎంతో మంది సెలబ్రిటీలు ఇలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు. వాటి గురించి స్పందిస్తే మరింత మందికి రీచ్ అవుతాయి, స్పందించకుండా అవి ఎక్కువగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యి, నిజం అని నమ్మే పరిస్థితి వస్తుంది. దాంతో సెలబ్రిటీలు డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోల గురించి ఎలా స్పందించాలో అర్థం కాక తల పట్టుకుంటున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి డీప్ ఫేక్ వీడియోలను కూడా క్రియేట్ చేశారు. అందుకు సంబంధించి చిరంజీవి పోలీసులకు ఫిర్యాదు చేయడం, కేసు నమోదు చేయడం జరిగింది. ముందు ముందు మారుతున్న టెక్నాలజీ కారణంగా ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో అని సెలబ్రిటీలతో పాటు, సోషల్ మీడియా జనాలు సైతం ఆందోళనతో ఉన్నారు.