ఆ స్టార్ హీరోయిన్ పాలిటిక్స్ లోకి రానుందా?

సినీ ఇండ‌స్ట్రీకి సంబంధించిన సెల‌బ్రిటీలు ఎప్పుడెలా మారుతారో ఎవ‌రూ ఊహించ‌లేరు.;

Update: 2025-07-09 07:15 GMT

సినీ ఇండ‌స్ట్రీకి సంబంధించిన సెల‌బ్రిటీలు ఎప్పుడెలా మారుతారో ఎవ‌రూ ఊహించ‌లేరు. అప్ప‌టివ‌ర‌కు డైరెక్ట‌ర్ గా ఉన్న‌వాళ్లు, హీరోలైపోతారు, హీరోలు నిర్మాత‌లు, డైరెక్ట‌ర్లవుతారు. హీరోయిన్లు కూడా అంతే. స‌క్సెస్ లో ఉన్నంత కాలం సినిమాలు చేసే హీరోయిన్లు ఆ త‌ర్వాత కూడా లైమ్ లైట్ లో ఉండ‌టానికి నిర్మాణం వైపు, బిజినెస్ లేదా ఇంకేదైనా రంగాల వైపు మొగ్గు చూపుతూ ఉంటారు.

ఇప్పుడు మ‌ల‌యాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి కూడా ఇదే డిస్క‌ష‌న్స్ జ‌రుగుతున్నాయి. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి ముందు ఫ్యాష‌న్ డిజైన‌ర్ అవాల‌నుకున్నార‌ట‌. కానీ త‌ర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా స్థాయిలో ప‌లు స‌క్సెస్‌ఫుల్ సినిమాల‌ను ఖాతాలో వేసుకున్నారు. ఇదు ఎన్న‌మాయం సినిమాతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి మొద‌టి సినిమాతోనే మంచి హిట్ ను అందుకుని ఆ త‌ర్వాత స్టార్ హీరోయిన్ గా మారారు.

నేను శైల‌జతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్ ఆ సినిమాతో తెలుగు ఆడియ‌న్స్ లోనూ మంచి గుర్తింపును ద‌క్కించుకున్నారు. ఆ త‌ర్వాత సావిత్రి బ‌యోపిక్ గా తెర‌కెక్కిన మ‌హాన‌టి సినిమాలో జీవించి ఏకంగా నేష‌న‌ల్ అవార్డు అందుకున్న కీర్తి రీసెంట్ గా బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. అయితే త‌న బాలీవుడ్ డెబ్యూ అనుకున్న ఫ‌లితాన్ని అందుకోలేక‌పోయింది.

మొన్నీ మ‌ధ్య‌నే త‌న ప్రియుడు ఆంటోనీని పెళ్లి చేసుకుని దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్ కు పెళ్లి త‌ర్వాత పెద్ద‌గా ఆఫ‌ర్లు రావ‌డం లేదు. ఓ వారం కింద‌ట వచ్చిన ఉప్పు క‌ప్పురంబు కూడా పెళ్లికి ముందు క‌మిటైన సినిమానే. అయితే సినిమా అవ‌కాశాలు రాక‌పోయినా కీర్తి బిజీగానే ఉన్నారు. ఇటీవ‌ల కీర్తి ఓ ఈవెంట్ కోసం మ‌ధురై వెళ్ల‌గా అక్క‌డ ఆమెను చూసి చాలా మంది టీవీకే టీవీకే అని ద‌ళ‌ప‌తి విజ‌య్ పెట్టిన పార్టీ పేరును కేకలేశారు.

అయితే కీర్తిని చూసి ఫ్యాన్స్ అలా అర‌వ‌డానికి ప‌లు కార‌ణాలున్నాయి. వీరిద్ద‌రూ క‌లిసి గ‌తంలో రెండు సినిమాలు చేశారు. ఆ సాన్నిహిత్యంతోనే గోవాలో జ‌రిగిన‌ కీర్తి పెళ్లికి కూడా విజ‌య్ హాజ‌ర‌య్యారు. అభిమానులు అలా అరుస్తున్న‌ప్ప‌టికీ కీర్తి ఏమీ స్పందించ‌క‌పోవ‌డంతో ఆమెకు పాలిటిక్స్ పై ఇంట్రెస్ట్ ఉంద‌ని, త్వ‌ర‌లోనే ఆమె విజ‌య్ పార్టీ కండువా క‌ప్పుకుంటుంద‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లొస్తున్నాయి. ఇదిలా ఉంటే త‌న‌కు రాజ‌కీయాల‌పై ఎలాంటి ఆస‌క్తి లేద‌ని కీర్తి ఓ సంద‌ర్భంలో తెలిపారు.

Tags:    

Similar News