సూర్య ఫ్యాన్స్ కోపంలో అర్థముంది!
ముఖ్యంగా తమిళ సినీ పరిశ్రమలో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా భారీ విజయాన్ని అందుకున్న కరుప్పు సినిమా కూడా అదే లిస్ట్ లో చేరింది.
సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో వద్దనుకున్న కథ మరో హీరో చేతుల్లోకి వెళ్లడం, బ్లాక్‌బస్టర్‌గా మారడం కొత్త విషయమేమీ కాదు. ముఖ్యంగా తమిళ సినీ పరిశ్రమలో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా భారీ విజయాన్ని అందుకున్న కరుప్పు సినిమా కూడా అదే లిస్ట్ లో చేరింది. అయితే సినిమా సక్సెస్ పై కంటే, అది మొదట ఎవరికి చెప్పబడింది? ఎవరూ చేయాల్సింది? అనే అంశాలే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. డైరెక్టర్ ఆర్జే బాలాజీ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కరుప్పు కథను మొదట విజయ్‌కు వినిపించానని, ఆయన చివరి సినిమాగా ఇది ఉంటే బాగుంటుందనే ఆలోచనతో కథ చెప్పానని వెల్లడించడం ఈ వివాదానికి బీజం వేసింది.
ఇక్కడివరకు పెద్దగా సమస్య కనిపించలేదు. కానీ తర్వాత ఎడిటర్ కలైవనన్ చేసిన కామెంట్స్ ఈ సిట్యుయేషన్ ను మరో మలుపు తిప్పాయి. ఒకవేళ ఈ సినిమాను విజయ్ చేసి ఉంటే అది నెక్ట్స్ లెవెల్ లో ఉండేదని, ఇంకా పెద్ద స్థాయిలో సినిమా సక్సెస్ అయ్యేదని ఆయన చెప్పడం సూర్య అభిమానులను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. ప్రస్తుతం రూ.300 కోట్లకు పైగా వసూళ్ల దిశగా దూసుకెళ్తున్న సినిమా గురించి మాట్లాడేటప్పుడు, ఆ సక్సెస్ ను అందించిన హీరోను కాకుండా మరో హీరోతో పోల్చడం ఎంతవరకు సమంజసమని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సూర్య అభిమానులు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తూ, సూర్య నటనను తక్కువ చేసి చూపించే ప్రయత్నంగా ఈ వ్యాఖ్యలను చూస్తున్నారు. నిజానికి వారి కోపంలో కూడా కొంత అర్థం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే కరుప్పు సక్సెస్ కు కథ ఎంత కారణమో, సూర్య యాక్టింగ్ కూడా అంతే కీలకమని అభిమానులు వాదిస్తున్నారు.
ముఖ్యంగా క్లైమాక్స్‌లో దేవుడి ఆవేశంతో సూర్య చేసిన యాక్టింగ్, డ్యాన్స్, ఎమోషనల్ డెప్త్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. అలాంటి సీన్స్ ను ప్రతీ స్టార్ హీరో ఒకే విధంగా చేయగలడని చెప్పడం కష్టం. అందుకే కరుప్పు సినిమాను విజయ్ చేసి ఉంటే ఇంకా బాగుండేదనే వాదనను ఆడియన్స్ అంత ఈజీగా అంగీకరించలేకపోతున్నారు.
ఈ వివాదం మరింత ముదరకుండా చూసే ప్రయత్నంలో సూర్య నేరుగా స్పందించకపోయినా, ప్రేమతో ఉండండి అనే మెసేజ్‌తో ఒక సాధారణ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. సూర్య చేసిన ఆ పోస్ట్ ఇన్‌డైరెక్ట్ రియాక్షన్ గా గుర్తించి ఫ్యాన్స్ కూడా కాస్త సైలెంట్ అయిపోయారు. మరోవైపు పరిస్థితి తీవ్రతను గుర్తించిన కలైవనన్ కూడా తన కామెంట్స్ పై క్లారిటీ ఇస్తూ, తాను చెప్పిన మాటలు వేరే అర్థంలో వెళ్లిపోయాయని, ఫ్యూచర్ లో మరింత జాగ్రత్తగా ఉంటానని చెప్పడం చర్చకు తాత్కాలికంగా తెరదించింది.
ఈ మొత్తం వ్యవహారంలో మరో ఆసక్తికర అంశం ఆర్జె బాలాజీ- సూర్య మధ్య ఉన్న బాండింగ్. పలు సందర్భాల్లో సూర్య తనకు జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి అని, దేవుడితో సమానమని బాలాజీ చెప్పిన సంగతి తెలిసిందే. అలాంటి డైరెక్టర్ సినిమాపైనే ఇప్పుడు హీరోల పోలికలతో వివాదం రావడం విశేషం. మొత్తానికి కరుప్పు మరోసారి తమిళ ఇండస్ట్రీలోని పాత సెంటిమెంట్‌ను గుర్తు చేసింది. ఒక హీరో వద్దనుకున్న కథ, మరో హీరో చేతిలో బ్లాక్‌బస్టర్ కావడం సహజమే. కానీ సినిమా విజయం సాధించిన తర్వాత కూడా ఆ విజయాన్ని అందించిన నటుడి కృషిని పక్కన పెట్టి పోలికలు తీసుకురావడం మాత్రం కొత్త వివాదాలకు తావిస్తోందన్నది స్పష్టమవుతోంది.