సినిమా టికెట్ ధర రూ.200.. స్టే విధించిన హైకోర్టు
కర్ణాటక సినిమా టికెట్ ధరల విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.;
కర్ణాటక సినిమా టికెట్ ధరల విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అన్ని థియేటర్లలో సినిమా టికెట్ ధర రూ.200 మించకుండా పరిమితి విధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని పన్నులతో సహా సినిమా ధర రూ.200కే పరిమితంగా ఉండాలని, ఇది సింగిల్ స్క్రీన్ తో పాటు మల్టీప్లెక్స్ లకు కూడా వర్తిస్తుందని తెలిపింది.
దీని ప్రకారం... రాష్ట్రంలోని సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ ల్లో ధర రూ.120 - రూ.200 మధ్యే ఉండాల్సి ఉంటుంది. ప్రముఖ థియేటర్ చైన్లు ఐమాక్స్, పీవీఆర్, 4డీఎక్స్, ఐసీఈ ఆయా థియేటర్లలో ఛార్జీలతో కలిపి రూ.236గా ఉండవచ్చని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే 75 సీటింగ్ కెపాసిటీ కంటే తక్కువగా ఉన్న స్క్రీన్లలో కూడా రూ.200 కంటే కాస్త ఎక్కువగా పెంచుకునేందుకు వెసులుబాటు ఇచ్చింది.
అయితే రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించి, ప్రజలందరికీ సినిమా చూడడం సులభం చేయడమే లక్ష్యంగా కొత్త నిబంధన తీసుకొస్తున్నట్లు సీఎం సిద్ధరామయ్య ఇటీవల తెలిపారు. కానీ, ఇది అన్యాయమని, ఇలా ప్రభుత్వమే టికెట్ ధరలపై పరిమితి విధించడం కరెక్ట్ కాదని థియేటర్ల ఓనర్లు, మల్టీప్లెక్స్ ఆసోసియేషన్ ఆఫ్ ఇండియా, సినీ నిర్మాతలు వాపోయారు. సింగిల్ స్క్రీన్లకు మల్టీపెక్స్ లకు ఒకే ధర ఉండడం ఎలా సాధ్యమని, మల్టీపెక్స్ లకు మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువ ఉంటుందని పేర్కొంటూ హైకోర్టును ఆశ్రయించారు.
మంగళవారం ఈ పిటిషన్ జస్టిస్ రవి వి హొస్మాని ముందుకు విచారణకు వచ్చింది. టికెట్ ధరలపై పరిమితి విధించడం అనవసర చర్య అని, టికెట్ ధర అనేది థియేటర్లో కల్పించే వసతులను బట్టి ఉంటుందని పిటిషనర్లు కోర్టుకు వివరించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ప్రభుత్వం విధించిన టికెట్ ధరల పరిమితిపై స్టే విధించింది. తదుపరి విచారణ జరిపి తుది తీర్పు ఇచ్చే వరకు ధరలపై పరిమితిని అమల చేయకూడదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికైతే థియేటర్ల ఓనర్లు వాళ్ల రేట్ల ప్రకారమే ఛార్జ్ చేసుకోవచ్చని పేర్కొంది.
అయితే ప్రభుత్వం అన్ని భాషల సినిమాలకు టికెట్ ధర సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ ల్లో రూ.200 మించకుండా పరిమితి విధించింది. 2025-26 బడ్జెట్ సమావేశాల్లో సీఎం ఈ ప్రకటన చేశారు. సినీ రంగాన్ని ప్రోత్సహించడం, మిడిల్ క్లాస్ కు కూడా టికెట్ ధర అందుబాటులోకి తీసుకురావడానికే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయానికి సంబంధించి ప్రభుత్వం టికెట్ ధరల ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది.