'26/11 ముంబై ఎటాక్స్' నేప‌థ్యంలో కంగ‌న 'భారత్ భాగ్య విధాత'!

భారతదేశ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన 26/11 ముంబై ఉగ్రదాడుల నేపథ్యంలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తున్న సరికొత్త చిత్రం `భారత్ భాగ్య విధాత`.

Update: 2026-06-02 20:04 GMT

భారతదేశ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన 26/11 ముంబై ఉగ్రదాడుల నేపథ్యంలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తున్న సరికొత్త చిత్రం `భారత్ భాగ్య విధాత`. మనోజ్ తపడియా దర్శకత్వంలో యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ థ్రిల్లర్ డ్రామా చిత్రంపై ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. గతంలో ముంబై ఉగ్రదాడుల నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) `ది అటాక్స్ ఆఫ్ 26/11` పేరుతో ఒక చిత్రాన్ని రూపొందించారు. అయితే ఆర్జీవీ తెరకెక్కించిన ఆ సినిమా కథనంతో పోలిస్తే కంగనా రనౌత్ నిర్మిస్తూ నటిస్తున్న ఈ సరికొత్త ప్రయత్నం పూర్తిగా భిన్నమైన కోణంలో తెర‌కెక్కుతోంది.

గతంలో వచ్చిన ముంబై దాడుల చిత్రాలన్నీ ప్రధానంగా ఉగ్రవాదుల విధ్వంసం, హోటల్ తాజ్ పరిసరాలు, పోలీసుల ఎదురుదాడులు- కసబ్ లాంటి ఉగ్రవాదుల చుట్టూనే తిరిగాయి. కానీ కంగనా రనౌత్ ఆలోచనల నుండి వస్తున్న ఈ చిత్రం ఉగ్రవాదుల క్రూరత్వం కంటే కూడా... ఆ క్లిష్ట సమయంలో ప్రాణాలకు తెగించి పోరాడిన సామాన్యుల మానవత్వాన్ని చూపించబోతోంది. ముంబైలోని కామా హాస్పిటల్ పరిసరాల్లో తీవ్రవాదుల దాడి జరిగినప్పుడు అక్కడ ఉన్న నర్సులు, వైద్య సిబ్బంది ప్రాణభయంతో పారిపోకుండా రోగులను ఎలా కాపాడారనే సరికొత్త కథాంశాన్ని క్వీన్ ఎంపిక చేయ‌డం ఆస‌క్తిక‌రం. నిజానికి ఆర్జీవీ ఈ హాస్పిట‌ల్ ఎపిసోడ్ ని కూడా చూపించారు. కానీ ప‌రిమిత స‌మ‌యం మాత్ర‌మే దానిని ఆవిష్క‌రించారు. అత‌డు చూపించని పూర్తి ఎపిసోడ్ ని ఇప్పుడు కంగ‌న చూపించ‌బోతున్నారన్న‌మాట‌.

ఉగ్రవాదులు నగరంలో మారణహోమం సృష్టిస్తూ రక్తాన్ని పారిస్తున్న ఆ చీకటి రాత్రి.. సుమారు 400 మంది రోగుల ప్రాణాలను కాపాడిన ఆసుపత్రి నర్సులు, వార్డ్ బాయ్స్, భద్రతా సిబ్బంది, స్వీపర్ల అసాధారణ ధైర్యసాహసాలను.. వారి త్యాగాలను ఈ చిత్రంలో ప్రధానంగా ఆవిష్కరించనున్నారు. ఈ సినిమాలో కంగనా రనౌత్ స్వయంగా ఒక నర్సు పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఉద్వేగానికి గురిచేయనున్నారు. విపత్కర పరిస్థితుల్లో అనామక వీరులు చూపిన మానవత్వాన్ని తెరపైకి తీసుకురావాలనే కంగన తపన...ఈ ప్రయత్నం నిజంగా మెచ్చుకోదగినవి.

ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో కంగనాతో పాటు గిరిజా ఓక్, స్మితా తాంబే తదితరులు కీలక పాత్రలు పోషించారు. మణికర్ణికా ఫిల్మ్స్ - పెన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ఎమోష‌న‌ల్ డ్రామా చిత్రం 12 జూన్ 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. వినాశనాన్ని చూపించే గత చిత్రాల శైలికి భిన్నంగా క‌ష్ట స‌మ‌యంలో ప్ర‌జ‌ల్ని కాపాడిన‌ మన దేశపు సామాన్య వీరుల కథను చూపించబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పవచ్చు.

గిరిజా ఓక్ `నేషనల్ క్రష్` ట్యాగ్‌పై కంగనా సరదా వ్యాఖ్యలు!

`భారత్ భాగ్య విధాత` ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో నటీమణులు కంగనా రనౌత్, గిరిజా ఓక్ మధ్య జరిగిన ఒక సరదా సంభాషణ ప్రస్తుతం అంతర్జాలంలో విపరీతంగా వైరల్ అవుతోంది. గతంలో తాను నీలం రంగు చీరలో పాల్గొన్న ఒక పాడ్‌కాస్ట్ క్లిప్ వైరల్ అవ్వడం వల్ల తన రూపంపై పెద్ద ఎత్తున చర్చ జరిగి.. తనను `నేషనల్ క్రష్` అని పిలిచారని గిరిజా గుర్తుచేసుకున్నారు. అయితే ఇది తన విజయమేమీ కాదని కేవలం తల్లిదండ్రుల నుండి వచ్చిన జీన్స్ మాత్రమేనని ఆమె చాలా వినమ్రంగా పేర్కొన్నారు. ఈ విషయంపై కంగనా రనౌత్ ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ..``నువ్వు దేశవ్యాప్త క్రష్‌వా! ఇది నిజంగా నమ్మశక్యం కాని విషయం... మా సినిమాలో నువ్వు భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది`` అని కొనియాడారు. అలాగే ``దయచేసి నీ ఆ అందాన్ని ఉపయోగించి మన సినిమాను కూడా కాస్త ప్రమోట్ చేయి`` అంటూ సరదాగా చమత్కరించారు. దీనికి గిరిజా స్పందిస్తూ.. కంగనాకు దక్కిన జాతీయ గుర్తింపు నిజమైనదని.. కానీ తన క్రష్ ట్యాగ్ ఎంతవరకు నిజమో తెలియదని అనగానే కంగనా నవ్వుతూ హోస్ట్‌ను ఇంటర్నెట్ `దేవత` అని పిలవడంతో అక్కడ నవ్వులు విరిశాయి.



Tags:    

Similar News