ప్రభాస్ ఫీవర్.. కన్నప్ప కోసం ఊహించిన కటౌట్!

ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రుద్ర పాత్రలో కనిపించనుండడం చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది.;

Update: 2025-06-25 07:44 GMT

టాలీవుడ్‌లో ప్రస్తుతం భారీ అంచనాల నడుమ విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా కన్నప్ప. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ పౌరాణిక చిత్రంపై ఇప్పటికే మంచి హైప్ ఉంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రుద్ర పాత్రలో కనిపించనుండడం చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. ట్రైలర్‌లో ప్రభాస్ ఇంటెన్స్ లుక్ చూసిన అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. కథలో ప్రభాస్ రోల్ తక్కువ సమయంలోనే కనిపించనున్నప్పటికీ, ఆయన ఎంట్రీ కథానాయకుడు తిన్నడు పాత్రకి టర్నింగ్ పాయింట్‌గా నిలవబోతోంది. దీంతో స్క్రీన్ టైమ్ చిన్నదైనా ప్రభాస్ ఇంపాక్ట్ భారీగా ఉండబోతోంది.

ఈ క్రేజ్‌ను చాటేందుకు విశాఖపట్నం అభిమానులు ముందుకొచ్చారు. అక్కడి కిన్నెరా థియేటర్‌ సమీపంలో 40 అడుగుల ప్రభాస్ కటౌట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. సినిమా రిలీజ్‌కు ముందు ఈ భారీ కటౌట్‌ను అధికారికంగా ఆవిష్కరించనున్నారు. ఇది స్థానికంగా మాత్రమే కాకుండా సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. ప్రభాస్ పాత్ర చిన్నదైనా అభిమానులు చూపుతున్న స్పందన అసాధారణం అనే చెప్పాలి.

కన్నప్పలో ప్రభాస్‌తో పాటు మోహన్ బాబు, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, ప్రీతి ముకుందన్, మధుబాల వంటి స్టార్ కాస్ట్ కనిపించనున్నారు. 24 ఫ్రేమ్స్ - AVA ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై మోహన్ బాబు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. విజువల్‌గా, మ్యూజికల్‌గా ఈ సినిమా భారీ అంచనాలు నెలకొల్పింది.

ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్.. ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. కన్నప్ప కథను ఆధారంగా తీసుకున్న ఈ చిత్రం భావోద్వేగాలతో కూడిన డివోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రభాస్ పాత్ర సినిమాకి వెన్నుముక అనేలా నిలుస్తుందని మేకర్స్ అంటున్నారు. మొత్తానికి కౌంట్‌డౌన్ మొదలైంది. కన్నప్ప విడుదలకు ముందు నుంచే ప్రభాస్ క్రేజ్ సినిమాకి అదనపు బలంగా మారింది. ఇప్పటికే అభిమానుల ఊహల్ని రెట్టింపు చేసిన ప్రభాస్ లుక్.. థియేటర్లలో ఎలాంటి విజువల్ ఫీస్ట్ ఇవ్వబోతుందో చూడాలి.

Tags:    

Similar News