50 ఏళ్లుగా ఇంతేగా.. ఇంకా రిటైర్ అవ్వరా? కమల్‌కి ప్రశ్న!
విశ్వనటుడు కమల్ హాసన్ ఖ్యాతి కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపు అసాధారణమైనది.;
విశ్వనటుడు కమల్ హాసన్ ఖ్యాతి కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపు అసాధారణమైనది. ఐదు దశాబ్ధాల కెరీర్ లో ఏ ఇతర నటుడు చేయనన్ని ప్రయోగాలు చేసిన ఆయనను ప్రయోగశాల అని పిలిచేందుకు అభిమానులు వెనకాడరు. ఉలగనాయగన్ ఏం చేసినా అది ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. ప్రతిసారీ తనదైన ప్రత్యేకతను నిలుపుకునేందుకు అతడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. 60ప్లస్ వయసులోను కమల్ జెన్ జెడ్ తో నవయుకువడిలా పోటీపడుతూనే ఉన్నాడు.
ఇటీవల `విక్రమ్` సినిమాతో అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. `కల్కి 2898 ఏడి`లో కనిపించింది కొన్ని నిమిషాలే అయినా తనదైన ముద్ర వేసాడు. ఇప్పుడు ఈ పాన్ ఇండియన్ సినిమా సీక్వెల్ లో కమల్ హాసన్ విశ్వరూపాన్ని ఆవిష్కరించబోతున్నారు. మణిరత్నంతో థగ్ లైఫ్ ఫెయిలైనా ఏజ్డ్ గ్యాంగ్ స్టర్ గా అతడి నటనకు మంచి గుర్తింపు దక్కింది. మరోవైపు కమల్ వరుసగా సినిమాలను నిర్మిస్తూ, ఫిలింమేకర్ గా తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నాన్ని ఆపలేదు.
ఇలాంటి సమయంలో ఆయనను రిటైర్ మెంట్ (నటన విరమణ) గురించి ప్రశ్నించారు హోస్ట్. మనోరమ హోర్టస్ లిటరరీ అండ్ ఆర్ట్ ఫెస్టివల్ కి హాజరైన కమల్ హాసన్ కి ఈ క్లిష్ఠమైన ప్రశ్న ఎదురైంది. నేటి జెన్ జెడ్ కొత్త హీరోలను చూడాలనుకుంటున్నందున సీనియర్లు రిటైర్ అవ్వాల్సిన సమయం ఆసన్నమైందా? అని ప్రశ్నించగా, కమల్ హాసన్ ఎంతో ప్రశాంతంగా స్పందించారు. కొత్త వ్యక్తులు రావడం ముఖ్యం... కానీ పాత వారిని రిటైర్ అవ్వమని చెప్పడం మీ పని మాత్రమేనని అన్నారు. తనదైన హాస్యం- సెటైర్ తో కమల్ ఇలా వ్యాఖ్యానించారు.
నేను కూడా రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నానని కమల్‌హాసన్ ఒప్పుకున్నాడు. ఎవరూ నన్ను రిటైర్ అవ్వమని అడగలేదు. కానీ చెడ్డ సినిమా చేసినప్పుడల్లా ఒక మంచి సినిమా తీసి విరామం తీసుకోండి అని అంటుంటారు. నేను ఇప్పటికీ అలాంటి సినిమా కోసం చూస్తున్నాను! అని కమల్ అన్నారు. మంచి సినిమాతో తన నటనా కెరీర్ ని వదిలి పెట్టాలనే ఆలోచనను ఆయన షేర్ చేసారు. అయితే కమల్ హాసన్ లాంటి విలక్షణ నటుడు విరామం తీసుకోవాలని భావిస్తే, అది భారతీయ చలనచిత్ర పరిశ్రమకు పెద్ద లోటు. నటుడిగా ఆయన నుంచి ఇంకా అద్భుతమైన ప్రదర్శనలను చూడాలని అభిమానులు ఎల్లపుడూ కోరుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆస్కార్‌లకు పోటీగా భారతీయ చిత్రపరిశ్రమ పురస్కారాలు అందించాలని కోరుకున్న నటుడు, అలాంటి ఒక విజయాన్ని సెలబ్రేట్ చేసుకునే వరకూ నటిస్తూనే ఉండాలి.