థగ్ లైఫ్ మూల కథ క్రెడిట్ ఆయనదే!
ప్రమోషన్స్ లో పాల్గొన్న మణిరత్నం రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ థగ్ లైఫ్ కథ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు.;
లోక నాయకుడు కమల్ హాసన్, ది గ్రేట్ మణిరత్నం కలిసి నాయగన్ అనే సినిమాతో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. నాయగన్ సినిమా కేవలం సక్సెస్ సాధించి మంచి కలెక్షన్లను అందుకోవడమే కాకుండా ఇండియన్ సినీ చరిత్రలోని గ్రేటెస్ట్ ఫిల్మ్స్ లో ఒకటిగా నిలిచింది. టైమ్ అనౌన్స్ చేసిన వరల్డ్ బెస్ట్ 100 చిత్రాల్లో నాయగన్ కూడా స్థానం సంపాదించిందంటే అతి ఎంత పెద్ద సినిమా అనేది అర్థం చేసుకోవచ్చు.
అలాంటి వీరిద్దరి కలయికలో నాయగన్ కాకుండా మరో సినిమా వచ్చింది లేదు. నాయగన్ వచ్చిన 37 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ వీరి కలయికలో థగ్ లైఫ్ సినిమా రాబోతుంది. జూన్ 5న థగ్ లైఫ్ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ థగ్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
ప్రమోషన్స్ లో పాల్గొన్న మణిరత్నం రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ థగ్ లైఫ్ కథ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాకు మూల కథ రాసింది కమల్‌హాసనే అని, ఆ కథను తాను కొంచెం అటూ ఇటూ మార్చి థగ్ లైఫ్ గా మార్చానని తెలిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. కొన్నేళ్ల ముందు కమల్ అమర్ హై పేరుతో రాసిన ఓ స్క్రిప్ట్ ను తాను చదివానని, అందులో ఓ పాయింట్ తనకు బాగా నచ్చిందని ఆయన తెలిపారు.
కమల్ రాసిన స్క్రిప్ట్ లోని ఆ పాయింట్ కు నాయగన్ తరహా ట్రీట్‌మెంట్ ఇచ్చి దాన్ని థగ్ లైఫ్ గా మార్చానని, కాబట్టి థగ్ లైఫ్ మూల కథ క్రెడిట్ కమల్‌కే ఇవ్వాలని చెప్పడంతో పాటూ థగ్ లైఫ్ లో నాయగన్ షేడ్స్ ఉంటాయని ఆయన ఇన్‌డైరెక్ట్‌గా చెప్పారు. కమల్ ఎంత గొప్ప రైటర్ అయినప్పటికీ మణిరత్నం లాంటి స్టార్ డైరెక్టర్ ను మెప్పించే కథ రాయడమంటే మామూలు విషయం కాదు. కథతో మెప్పించడమే కాకుండా ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లి సినిమాను పట్టాలెక్కించి, ఇప్పుడు దాన్ని రిలీజ్ వరకు తీసుకురావడమంటే గొప్ప విషయమే. శింబు, త్రిష, అభిరామి కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.