కమల్- మణిరత్నం ఇంత గ్యాప్ ఎందుకు?
కమల్ హాసన్ - మణిరత్నం కాంబినేషన్ లో మూడు దశాబ్ధాల క్రితం వచ్చిన నాయకుడు (నాయగన్) ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే.;
కమల్ హాసన్ - మణిరత్నం కాంబినేషన్ లో మూడు దశాబ్ధాల క్రితం వచ్చిన నాయకుడు (నాయగన్) ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. కమల్ హాసన్ కెరీర్ ఉత్తమ సినిమాల్లో ఇది ఒకటి. అయితే అలాంటి కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాకపోవడంపై అభిమానుల్లో చాలా నిరాశ ఉంది. ఎట్టకేలకు థగ్ లైఫ్ కోసం ఆ ఇద్దరూ 2024-25 సీజన్ నాటికి కలవగలిగారు. థగ్ లైఫ్ కి ఇప్పటికే ప్రమోషన్ మొదలైంది. ఈ సందర్భంగా ప్రచార వేదికలపై మణిరత్నం, కమల్ హాసన్ తమకు ఇంతకాలం కుదరకపోవడానికి కారణమేమిటో చెప్పారు.
అసలు ఇలాంటి ఒక ప్రయత్నానికి ఇంతకాలం ఎందుకు పట్టింది? అన్న విలేకరి ప్రశ్నకు సమాధానంగా మణిరత్నం స్పందిస్తూ ``అతడు నన్ను పిలవలేదు..`` అని సింపుల్ గా నవ్వేస్తే, కమల్ హాసన్ మాత్రం పూర్తి డీటెయిలింగ్ ఇచ్చారు. నిజానికి మేం చాలాసార్లు ప్రయత్నించాం. రకరకాల కారణాలతో వర్కవుట్ కాలేదు. కొన్నేళ్ల క్రితం ఒక సినిమా కోసం ప్రయత్నించాం. కానీ దానికి అన్ని లెక్కలు వేయగా బడ్జెట్ ఒక అంకె వద్ద ఆగింది. దానిని చూసి ఇది వర్కవుట్ కాదని భావించి మధ్యలో వదిలేసాం. కథ కొన్నాక కూడా దానిని చేయలేదు! అని కమల్ హాసన్ చెప్పారు.
అది ఏ సినిమా? అంటే పొన్నియన్ సెల్వన్. నిజానికి రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా కోసం దాదాపు 600 కోట్ల బడ్జెట్ ఖర్చయింది. మొదటి భాగం బాగానే ఆడినా, రెండో భాగం ఓకే అనిపించింది. అయితే పీఎస్ 1, పీఎస్ 2 సినిమాల్లో భారీ తారాగణం నటించినా కమల్ కి మాత్రం ఈసారి అవకాశం దక్కలేదు. విక్రమ్, కార్తీ, త్రిష, ఐశ్వర్యారాయ్, జయం రవి తదితరులు ఈ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.