ప్లాస్టిక్ సర్జరీ నా ఇష్టం: సీనియర్ నటి కాజోల్
'మెరుపు కలలు' సినిమాలో ప్రభుదేవా సరసన నటించింది కాజోల్. తనదైన అందం, ప్రతిభతో ఈ బ్యూటీ కుర్రకారు హృదయాలను దోచుకుంది.;
`మెరుపు కలలు` సినిమాలో ప్రభుదేవా సరసన నటించింది కాజోల్. తనదైన అందం, ప్రతిభతో ఈ బ్యూటీ కుర్రకారు హృదయాలను దోచుకుంది. 'దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే' (డిడిఎల్‌జే) నటిగా కాజోల్‌కి యూత్ లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇక షారూక్ - కాజోల్ జంట తెరపై కనిపిస్తే, బాక్సాఫీస్ వద్ద కాసులు కురిసినట్టే. అయితే ఇటీవలి కాలంలో ఈ జోడీ రిపీట్ కావడం లేదు.
కొంతకాలంగా కాజోల్ తన నటనపై సీరియస్‌గానే దృష్టి సారించింది. తాజాగా `మా` అనే హారర్ థ్రిల్లర్ మూవీలో నటించింది. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఇటీవలే టీజర్ విడుదల కాగా, ప్రశంసలు కురిసాయి. ఆత్మ ఆవహించిన తన కూతురు చుట్టూ ఉన్న మిస్టరీని ఛేధించే క్రమంలో అరణ్యంలోని పల్లెటూరికి ఉన్న శాపం ఏమిటన్నది తెలుసుకుంటుంది. టీజర్ చాలా భయపెట్టింది.. విజువల్స్ అద్భుతంగా కుదిరాయని ప్రశంసలు కురిసాయి.
ఈ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో కాజోల్ కథానాయికల ప్లాస్టిక్ సర్జరీ వ్యవహారం గురించి ప్రశ్నను ఎదుర్కొంది. కాజోల్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ సర్జరీ అనేది చాలా సంక్లిష్ఠమైన విషయం. అవసరం మేర దీనిని అనుసరిస్తే ఫర్వాలేదు. ముఖంపై మచ్చ తొలగించడానికి లేదా ఎబ్బెట్టుగా ఏదైనా ఉంటే దానిని తొలగించుకునేందుకు సర్జరీ అవసరం. అలా కాకుండా నా దవడ ఎముకను సరి చేయండి.. అందం పెంచండి అంటే అది సరి కాదు. అయినా ముఖం సర్జరీ చేయించుకునే వ్యక్తిది. దానిపై వారికి మాత్రమే హక్కు ఉంటుందని కూడా కాజోల్ అన్నారు. శరీర తత్వాన్ని బట్టి కూడా సర్జరీ అవసరమా కాదా? అనేది నిర్ణయించాలని కూడా తెలిపారు.
డిడిఎల్‌జే తర్వాత కెరీర్ పరంగా ఎదిగే క్రమంలో కాజోల్ తన అందం పెంచుకునేందుకు, ముఖానికి శస్త్ర చికిత్స చేయించుకుందని, తన శరీర ఛాయను మెరుగు పరుచుకునేందుకు చాలా ఖర్చు చేసిందని మీడియాలో కథనాలొచ్చాయి. హిందీ చిత్రసీమలో చాలా మంది కథానాయికలు తమ అందాన్ని మెరుగు పరుచుకునేందుకు చాలా శస్త్ర చికిత్సలు చేయించుకుంటున్న సంగతి విధితమే.