కంటెంట్ ఉంది.. కానీ కాజల్ మూవీ కనెక్ట్ అయ్యిందా?

ఒక చిన్నారి మరణం.. ఓ తండ్రి ఆవేదన.. పెద్ద సంస్థలపై న్యాయపోరాటం.. సమాజాన్ని ప్రశ్నించే ఓ సమస్య.

Update: 2026-07-27 03:07 GMT

ఒక చిన్నారి మరణం.. ఓ తండ్రి ఆవేదన.. పెద్ద సంస్థలపై న్యాయపోరాటం.. సమాజాన్ని ప్రశ్నించే ఓ సమస్య. ఇలాంటి స్ట్రాంగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటించిన ది ఇండియా స్టోరీ. సాధారణ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఓ సామాజిక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన ఆ మూవీ.. మెసేజ్ విషయంలో ఆకట్టుకునే ప్రయత్నం చేసినా, స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం కొన్ని సవాళ్లు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలి కాలంలో కాజల్ తన సినిమాల ఎంపికలో ఛేంజ్ చూపిస్తున్నారు. కేవలం గ్లామర్ రోల్స్ కే పరిమితం కాకుండా.. యాక్టింగ్ కు ఛాన్స్ ఉన్న, స్ట్రాంగ్ స్టోరీ ఉన్న సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు. అదే క్రమంలో ది ఇండియా స్టోరీ మూవీలో కీలక పాత్ర ఎంచుకున్నారు. సామాజిక బాధ్యత ఉన్న కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా ఆ సినిమా నిలిచింది. ఆ మూవీ స్టోరీ ఓ తండ్రి చుట్టూ తిరుగుతుంది.

తన చిన్న కూతురు క్యాన్సర్‌ తో మరణించడంతో తీవ్రంగా కలత చెందిన అతడు.. ఆ మరణానికి కారణాలపై పోరాటం ప్రారంభిస్తాడు. కలుషితమైన ఆహారం, వ్యవసాయ విధానాలు, పురుగు మందుల వినియోగం వంటి అంశాలు ఆ పోరాటంలో కీలకంగా మారతాయి. సాధారణ వ్యక్తిగా మొదలైన అతని జర్నీ.. చివరకు న్యాయస్థానం వరకు చేరుతుంది. ఆ న్యాయపోరాటంలో ఓ లాయర్, ఓ పోలీస్ అధికారి అతనికి తోడవుతారు.

సమస్య కేవలం వ్యక్తిగత విషాదంగా కాకుండా.. సమాజాన్ని ప్రభావితం చేసే అంశంగా చూపించే ప్రయత్నం సినిమాలో కనిపిస్తుంది. పురుగు మందుల తయారీ సంస్థల బాధ్యత ఏంటి? వ్యవసాయ పద్ధతుల్లో మార్పులు అవసరమా? వినియోగదారుల భద్రతకు ఎవరు బాధ్యత వహించాలి? అనే ప్రశ్నలు ఆ సినిమా స్క్రీన్ పైకి తీసుకొస్తుంది. అయితే.. స్ట్రాంగ్ ఎలిమెంట్ ఉన్నప్పటికీ దాన్ని ప్రేక్షకులకు చేరవేయడంలో స్క్రీన్ ప్లే కీలక పాత్ర పోషిస్తుంది. ది ఇండియా స్టోరీ విషయంలో ఇదే ప్రధాన చర్చగా మారింది.

మెసేజ్ బాగున్నా.. స్క్రీన్ ప్లే నెమ్మదిగా సాగడం వల్ల కొన్ని సందర్భాల్లో ప్రేక్షకుల ఆసక్తి తగ్గే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. సామాజిక అంశాలతో వచ్చే సినిమాలకు సవాల్.. మెసేజ్ స్ట్రాంగ్ గా చెప్పడంతో పాటు, ప్రేక్షకుడిని కథలో భాగం చేయడం. ఒక సమస్య చూపించడం మాత్రమే కాకుండా.. ఎమోషనల్ గా కనెక్ట్ చేయడం ముఖ్యం. ఆ విషయంలో స్క్రీన్‌ ప్లే మరింత ప్రభావవంతంగా ఉండాల్సిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

కాజల్ తన పాత్రకు న్యాయం చేసే ప్రయత్నం చేశారు. ఆమెతో పాటు శ్రేయాస్ తల్పడే, మురళీ శర్మ పలు పాత్రల్లో కనిపించారు. హిందీలో మాత్రమే విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఓపెనింగ్ అందుకోలేకపోయినట్లు సమాచారం. తొలి రోజు ఆక్యుపెన్సీ తక్కువగా నమోదైనప్పటికీ.. వీకెండ్ వసూళ్లు సినిమాకు కీలకంగా మారనున్నాయి. ఇండియా స్టోరీలో చెప్పాలనుకున్న విషయం బలమైనది. కానీ మంచి మెసేజ్ ను ప్రేక్షకుల మనసుల్లోకి తీసుకెళ్లడానికి కథనం అంతే బలంగా ఉండాలి. కంటెంట్ ఉన్న సినిమాకు అసలు పరీక్ష మొదలవుతుంది. మరి మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు నిలబడుతుందో చూడాలి.

Tags:    

Similar News