సెల్యూలాయిడ్ కి ఎవర్ గ్రీన్ రాఘవేంద్రుడు

కె రాఘవేంద్రరావు బీఏ అని తెర మీద పడితే జనాలు ఈలలు గోలలు వేయడం అంతకు ముందు జరగలేదు.

Update: 2026-05-24 04:15 GMT

కె రాఘవేంద్రరావు బీఏ అని తెర మీద పడితే జనాలు ఈలలు గోలలు వేయడం అంతకు ముందు జరగలేదు. అది రాఘవేంద్ర రావు నుంచే మొదలైంది. ఒక స్టార్ హీరోకి ఉన్న ఇమేజ్ ఒక డైరెక్టర్ కి సొంతం కావడం రాఘవేంద్రుడికే చెల్లింది. కమర్షియల్ సినిమాలను ఎలా తీయాలో ఆయనకే తెలుసు. సినిమాకు కమర్షియల్ హంగులు తొడిగి బాక్సాఫీస్ ని షేక్ చేయడం కూడా రాఘవేంద్రరావే టాలీవుడ్ కి నేర్పించారు అంటే అతిశయోక్తి కాదు. ఆయన సినిమాలో హీరో హీరోయిన్లు అంటే చాలు వారికి సూపర్ స్టార్ డం వచ్చేసినట్లే లెక్క. ఎంతో మందికి అలా స్టార్ ఇమేజ్ తెచ్చిన రాఘవేంద్రుడి హస్త వాసి మంచిది అని అంతా అంటారు.

పౌరాణికాల్లో ఎంట్రీ :

రాఘవేంద్ర రావు కుటుంబం గురించి తెలిసిందే. ఆయన తండ్రి ప్రఖ్యాతి చెందిన దిగ్దర్శకుడు. కేఎస్ ప్రకాశరావు. ఆయన ఎన్నో సినిమాలకు అద్భుతంగా దర్శకత్వం వహించి హిట్లు కొట్టిన వారు. ప్రేమ నగర్ ఒక్కటి చాలు ప్రకాశరావు బాక్సాఫీస్ స్టామినాను చెప్పడానికి ఆయన కుమారుడిగా రాఘవేంద్ర రావు తండ్రి వద్ద మెలకువలు నేర్చుకుంటూనే సహాయ దర్శకుడిగా పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు దగ్గర చేరారు ఆయన తొలి చిత్రం పాండవ వనవాసం. దీనిని 1966లో తీశారు. అలా 24 ఏళ్ళ యువకుడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రాఘవేంద్ర రావు ఆ తరువాత వి మధుసూదన రావు వద్ద ఎన్నో సినిమాలకు సహాయ దర్శకుడిగా చేస్తూ దర్శకుడిగా మెగా ఫోన్ పట్టడానికి తొమ్మిదేళ్ళు పట్టింది.

శోభన్ తో తొలి మూవీ :

తాను సహాయ దర్శకుడిగా పనిచేసిన అనేక సినిమాలకు హీరోగా శోభన్ బాబు ఉండడంతో ఆ పరిచయంతో తన తొలి సినిమాకు ఆయనను హీరోగా అడిగారు రాఘవేంద్రరావు దానికి ఆయన ఓకే చెప్పడంతో అలా మొదలైంది బాబు సినిమా. ఇది 1975లో రిలీజ్ అయింది. బాగానే ఆడింది. ఆ మూవీలోనే రాఘవేంద్రరావు అప్పటికి ఎవరూ చూడని కొత్త గ్లామర్ తో శోభన్ ని చూపించారు. ఇక ఆయన సినిమాలో పాటలు పరుగులు పెట్టాయి. హీరోయిన్ల అందం కూడా వేరే లెవెల్ అని అంతా అన్నారు. ఆ తర్వాత జ్యోతి కల్పన సినిమాలతో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తీసుకుంటున్న రాఘవేంద్రరావుకు ఎన్టీఆర్ నుంచి బంపర్ ఆఫర్ వచ్చింది. అదే అడవి రాముడు. ఎన్టీఆర్ తోనే రాఘవేంద్ర రావు తొలి సినీ ప్రయాణం పాండవ వనవాసం ద్వారా మొదలైంది. అదే ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేసే చాన్స్ కూడా తొందరగానే వచ్చింది. అడవి రాముడు మూవీ సూపర్ హిట్ కావడం రాఘవేంద్రుడి క్రెడిట్ గానే చూడాలి. ఎన్టీఆర్ ని నవ యువకుడిగా మార్చి చూపించిన వైనం ఆ రోజుల్లో సంచలనం క్రియేట్ చేసింది. అది లగాయితూ ఎన్టీఆర్ తో 12 సినిమాలు తీశారు. అన్నీ సూపర్ డూపర్ హిట్లు

అందరితోనూ సక్సెస్ :

ఇక రాఘవేంద్రరావు తొలితరం లో ఏఅన్నార్, క్రిష్ణ, తరువాత కృష్ణంరాజు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మోహన్ బాబు, మహేష్ బాబు అల్లు అర్జున్ ఇలా అందరి హీరోలతోనూ సినిమాలు తీసి సక్సెస్ అందుకున్నారు. వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించడం అందులో ఎక్కువ శాతం సక్సెస్ రేటు ఉండడం రాఘవేంద్రుడికే చెల్లింది. అంతే కాదు ఆయన ప్రతీ స్టార్ హీరో సొంత సినిమాలకు డైరెక్షన్ చేశారు. అలాగే తన సొంత బ్యానర్ ఆర్కే అసోసియేట్స్ మీద స్టార్స్ అందరితోనూ సినిమాలు తీశారు ఈ స్పెషాలిటీ మరే డైరెక్టర్ కీ లేదు. తాజా పుట్టిన రోజుతో 84 నిండి 85 లోకి అడుగుపెట్టిన రాఘవేంద్రరావు ఇంకా నవ యువకుడే అంటోంది టాలీవుడ్ సెల్యూలాయిడ్. ఆయనకు వయసు ఒక నంబర్ మాత్రమే అని అంటోంది అభిమాన జనం. మళ్ళీ మెగా ఫోన్ పట్టి అద్భుతమైన సినిమాలు ఆయన తీయాలని అంత కోరుకుంటున్నారు.

Tags:    

Similar News