ఆ కారణంతో జ్యోతికపై ఫుల్‌ ట్రోల్స్‌..!

కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో నటించిన సీనియర్‌ హీరోయిన్‌ జ్యోతిక ప్రస్తుతం బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే.;

Update: 2025-09-01 10:36 GMT

కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో నటించిన సీనియర్‌ హీరోయిన్‌ జ్యోతిక ప్రస్తుతం బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. తమిళ్‌ హీరో సూర్యను వివాహం చేసుకున్న తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉంది. పిల్లలు పెద్ద వారు అయ్యారు, కుటుంబ బాధ్యతలు ఏమీ లేకపోవడంతో మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీ మంచి సక్సెస్ అయింది. తక్కువ సమయంలోనే జ్యోతిక ఎక్కువ సినిమాలు చేసింది. వయసు తగ్గ పాత్రలను ఎంపిక చేసుకుంటూ, లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేయడం ద్వారా జ్యోతిక మెప్పించింది. సౌత్‌లో వరుసగా ఆమె సినిమాలు వచ్చాయి. అయితే హఠాత్తుగా బాలీవుడ్‌కి జ్యోతిక షిప్ట్‌ అయింది. అక్కడ హీరోలకు జోడీగా నటించడంతో పాటు, లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తోంది.

బాలీవుడ్‌లో జ్యోతిక వరుస సినిమాలు

జ్యోతిక ఒక్కసారిగా టర్న్‌ తీసుకోవడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు, ముఖ్యంగా సూర్యతో బ్రేకప్‌ కారణంగా జ్యోతిక ముంబై వెళ్లింది, అక్కడ నుంచి తిరిగి రాకపోవచ్చు అని ఊహగానాలు వినిపించాయి. జ్యోతిక వాటన్నింటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. అయితే సూర్య, జ్యోతిక బ్రేకప్‌ వార్తలు నిజం కాదని పలు సందర్భాల్లో నిరూపితం అయ్యింది. రెగ్యులర్‌గా జ్యోతిక, సూర్య కలిసి ఉన్న ఫోటోలు సోషల్‌ మీడియా ద్వారా వస్తూనే ఉన్నాయి. బాలీవుడ్‌లో నటించడం కోసం జ్యోతిక ముంబై మకాం మార్చిందని ఆమె బ్యాక్‌ టు బ్యాక్ చేస్తున్న సినిమాలను బట్టి అర్థం అవుతోంది. బాలీవుడ్‌లో జ్యోతిక సినిమాలు చేయడం మంచి విషయమే. అయితే ఆమె సౌత్ సినిమా ఇండస్ట్రీ గురించి తక్కువ చేసి మాట్లాడటం ఏమాత్రం కరెక్ట్‌ కాదు అనేది చాలా మంది అభిప్రాయం.

అజయ్‌ దేవగన్‌, మమ్ముట్టి సినిమాల్లో మాత్రమే..

ఇటీవల ఒక సినిమా ఈవెంట్‌లో భాగంగా మాట్లాడుతూ నేను సౌత్‌లో చాలా సినిమాల్లో నటించాను. కానీ వాటిల్లో మమ్ముట్టి గారు తప్ప మరే హీరో సినిమాలో నటించినా కూడా నా ఫేస్ ను పోస్టర్‌లపై వేయలేదు అంది. బాలీవుడ్‌ హీరో అజయ్ దేవగన్‌ మూవీలో నటించినప్పుడు, మమ్ముట్టీ సర్‌ సినిమాలో నటించినప్పుడు మాత్రమే నా ఫేస్ తో పోస్టర్‌లు వేశారు, మరే సౌత్‌ హీరో సినిమాలో నటించినా కూడా నా మొహంను కనీసం పోస్టర్‌ల మీద చూపించలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. జ్యోతిక చేసిన ఈ వ్యాక్యలు ఖచ్చితంగా మొత్తం సౌత్‌ సినీ ఇండస్ట్రీలో ఆడవారికి తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పకనే చెప్పినట్టు ఉంది. అందుకే ఈ విషయమై చాలా మంది సీరియస్‌గా స్పందిస్తున్నారు. ఇదే సమయంలో కొందరు సోషల్‌ మీడియా జనాలు స్పందిస్తున్నారు.

చిరంజీవి నటించిన ఠాగూర్‌లో..

జ్యోతిక ప్రస్తుతం చేస్తున్న సినిమాలను ప్రమోట్‌ చేసుకోవడం కోసం బాలీవుడ్‌ను ఆకాశానికి ఎత్తడం మంచిదే.. దాన్ని ఎవరూ తప్పుబట్టరు, కానీ ఈ సమయంలో ఆమె తనకు లైఫ్ ఇచ్చిన సౌత్‌ సినిమా ఇండస్ట్రీని తక్కువ చేయడం ఏమాత్రం కరెక్ట్‌ కాదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అంటున్నారు. సోషల్‌ మీడియాలో చాలా మంది జ్యోతిక గతంలో నటించిన తెలుగు ఇతర భాషల సినిమాల పోస్టర్‌లను షేర్‌ చేస్తున్నారు. వాటిల్లో చాలా పోస్టర్స్‌ లో జ్యోతిక ఫేస్ ఉంది. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమా పోస్టర్‌లోనూ జ్యోతిక ఉంది. ఇన్ని పోస్టర్స్ పై మీ ఫోటో ఉన్నా కూడా మీకు ఎందుకు అవి కనిపించడం లేదు అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై జ్యోతిక వివరణ ఇవ్వాల్సిందే అని చాలా సీరియస్‌గానే సోషల్‌ మీడియాలో జ్యోతికను ట్రోల్స్ చేస్తూ ఫోటోలు షేర్‌ చేస్తున్నారు. మరి జ్యోతిక స్పందన ఏంటి అనేది చూడాలి.

Tags:    

Similar News