వీడియో: యాభైకి చేరువ‌లో జ్యోతిక తెగువ‌ చూసి సిగ్గు ప‌డాలి!

నటిగా కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న జ్యోతిక ఇప్పుడు తన ఫిట్‌నెస్‌తో షో స్టాప‌ర్‌గా నిలుస్తున్నారు.;

Update: 2026-04-14 18:35 GMT

నటిగా కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న జ్యోతిక ఇప్పుడు తన ఫిట్‌నెస్‌తో షో స్టాప‌ర్‌గా నిలుస్తున్నారు. త‌న‌ వయసు ప్రస్తుతం 47 ఏళ్లు అంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. 50 ఏళ్లకు చేరువలో ఉన్నా పాతికేళ్ల యువతికి ఏమాత్రం తీసిపోని విధంగా జ్యోతిక‌ చేస్తున్న కఠినమైన వ్యాయామాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి ఉంటే ఏ వయసులోనైనా మెరుపును కాపాడుకోవచ్చని ఈ `సెలబ్రిటీ మమ్మీ` నిరూపిస్తున్నారు.

జ్యోతిక ఫిట్‌నెస్ మంత్రంలో వైవిధ్యం ప్రధానాంశం. ఈ సీనియర్ న‌టి కేవలం సాధారణ జిమ్ వర్కవుట్స్‌కే పరిమితం కాకుండా..యోగా వీల్ ప్రాక్టీస్.. స్ట్రెంత్ ట్రైనింగ్ .. ఫంక్షనల్ ట్రైనింగ్‌లను మిళితం చేస్తున్నారు. ముఖ్యంగా వెన్నెముక ఫ్లెక్సిబిలిటీని పెంచే యోగా వీల్ ఆసనాలను వేస్తున్న తీరు చూస్తుంటే ఆ తెగువకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. శరీర సమతుల్యతను కోర్ స్ట్రెంత్‌ను కాపాడుకుంటూనే మెటబాలిజంను వేగవంతం చేసేలా జ్యోతిక‌ తన వర్కవుట్ ప్లాన్‌ను రూపొందించుకున్నారు.

ఒకవైపు ఇల్లాలుగా..మరోవైపు ఇద్దరు పిల్లల తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే జ్యోతిక తన కెరీర్‌ను కూడా ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నారు. షూటింగ్ షెడ్యూల్స్ ఎంత బిజీగా ఉన్నా.. ఒక్క రోజు కూడా వ్యాయామాన్ని విస్మరించకపోవడం ఈ న‌టి అంకితభావానికి నిదర్శనం. ప్రొఫెషనల్ ట్రైనర్స్ పర్యవేక్షణలో ఆమె చేస్తున్న ఈ సాహసాలు.. మధ్య వయసులో ఉన్న మహిళలకు ఒక గొప్ప రోల్ మోడల్‌గా నిలుస్తున్నాయి. కృత్రిమ పద్ధతుల కంటే కష్టపడి సాధించిన సహజమైన అందమే శాశ్వతమని త‌ను నమ్ముతారు.

నటిగా విభిన్న పాత్రలు పోషిస్తూనే.. జ్యోతిక తన భర్త సూర్యతో కలిసి `2డీ ఎంటర్‌టైన్‌మెంట్` బ్యానర్‌పై నాణ్యమైన సినిమాలను నిర్మిస్తున్నారు. కేవలం నటిగానే కాకుండా.. అభిరుచి ఉన్న నిర్మాతగా కూడా ఆమె సత్తా చాటుతున్నారు. సమాజానికి ఏదైనా సందేశాన్ని ఇచ్చే కథలను లేదా మహిళా ప్రధాన చిత్రాలను ప్రోత్సహించడంలో జ్యోతిక ఎప్పుడూ ముందుంటారు. న‌ట‌న ప‌రంగా కెరీర్ గ్రాఫ్ ఒక పక్కన విజయవంతంగా కొనసాగుతుండగానే.. వ్యక్తిగత ఆరోగ్యంపై జ్యోతిక‌ చూపిస్తున్న శ్రద్ధ త‌న‌ను ఒక కంప్లీట్ ఉమెన్‌గా నిలబెడుతోంది.

ఇక జ్యోతిక తదుపరి ప్రాజెక్టుల విషయానికి వస్తే... ఇటీవ‌ల సెల‌క్టివ్ గా న‌టిస్తున్న జ్యోతిక త‌దుప‌రి మరికొన్ని హిందీ ప్రాజెక్టులపై చర్చలు జరుపుతున్నారు. దక్షిణాదితో పాటు బాలీవుడ్ మ్యాపులోనూ తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్ర‌స్తుతం సిస్ట‌మ్ అనే వెబ్ సిరీస్ లో జ్యోతిక న‌టిస్తున్నారు.



Tags:    

Similar News