జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక టికెట్‌ పై సంచలన ప్రకటన చేసిన టీపీసీసీ చీఫ్

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.;

Update: 2025-06-20 11:28 GMT

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. టికెట్‌ ఎవరికి ఇవ్వాలన్నది పార్టీ వర్కింగ్ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. ‘‘అభ్యర్థుల ఎంపికకు పద్ధతి ఉంది. టికెట్ కోరే వారందరూ PCCకు దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తులను ఫిల్టర్ చేసి పార్టీ ఎలక్షన్ కమిటీ, వర్కింగ్ కమిటీలకు పంపుతాం. చివరకు ఒక అభ్యర్థిని తుది మంజూరు చేస్తారు. ఇప్పటివరకు ఎవరిపైనా నిర్ణయం తీసుకోలేదు,’’ అని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

ఇక క్రికెటర్, కాంగ్రెస్ నేత మోహమ్మద్ అజహరుద్దీన్ ఇప్పటికే తన ఆసక్తిని వ్యక్తం చేశారు. గురువారం బంజారాహిల్స్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి తాను పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. చివరి నిమిషంలో టికెట్ ఇచ్చినప్పటికీ పూర్తిగా పోరాడానని, తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయానని చెప్పారు.

అలాగే అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు వచ్చిన అత్యధిక ఓట్లు జూబ్లీహిల్స్ నుంచే వచ్చాయని గుర్తు చేశారు. ‘‘జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ బలోపేతం కోసం గత ఏడాదిన్నర కాలంగా బూత్ స్థాయి నుండి డివిజన్ స్థాయివరకు పలు సమావేశాలు నిర్వహించాం. ఇప్పుడు కాంగ్రెస్ విజయమే ఖాయం’’ అని ధీమా వ్యక్తం చేశారు. అయితే పార్టీలోని కొంతమంది కావాలని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తనకు టికెట్ ఇవ్వదని గాసిప్స్ వ్యాపిస్తున్నాయని, ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు కూడా అజహరుద్దీన్ పేర్కొన్నారు.

అయితే అప్పుడే కాంగ్రెస్ సీటుపై పోటీ మొదలు కావడంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక టికెట్ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. అభ్యర్థి ఎంపిక పూర్తిగా పార్టీలోని కమిటీల నిర్ణయం మేరకే జరుగుతుందని TPCC పేర్కొంది. అజహరుద్దీన్ ఆసక్తి చూపినప్పటికీ టికెట్ ఎవరికి దక్కుతుందన్నది అధికారిక ప్రకటన వచ్చే వరకు అంచనాలే.

Tags:    

Similar News