ఆరోజు ఎన్టీఆర్ ఆ సన్నివేశాన్ని అలా ఫన్నీగా మార్చేసారు!
స్టార్ హీరోల చుట్టూ కొందరు భజంత్రీ బ్యాచ్ కొన్ని అబద్ధాలను నిజాలుగా.. నిజాల్ని అబద్ధాలుగా ఎలా మార్చేస్తారో చాలా సందర్భాలలో గుసగుసలు బయటపడుతూనే ఉన్నాయి.
స్టార్ హీరోల చుట్టూ కొందరు భజంత్రీ బ్యాచ్ కొన్ని అబద్ధాలను నిజాలుగా.. నిజాల్ని అబద్ధాలుగా ఎలా మార్చేస్తారో చాలా సందర్భాలలో గుసగుసలు బయటపడుతూనే ఉన్నాయి. అలాంటి ఒక ఘటన గురించి తారక్ కి అత్యంత సన్నిహితంగా ఉండే నటుడు శ్రీనివాస్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు చాలా సరదాగా ఫన్ ని జనరేట్ చేస్తున్నాయి... పూర్తి వివరంలోకి వెళితే..
చిత్రపరిశ్రమలో స్టార్ హీరోల చుట్టూ ఉండే కొందరు కోటరీ లేదా `భజంత్రీల బ్యాచ్` వాస్తవాలను ఎలా కప్పిపుచ్చుతుందో.. అబద్ధాలను నిజాలుగా ఎలా కలరింగ్ ఇస్తుందో తరచుగా గుసగుసల్లో వింటూనే ఉంటాం. హీరోలను నిజం తెలుసుకోనివ్వకుండా పొగడ్తలతో ముంచెత్తే ఇటువంటి కోటరీల తీరుపై ఇండస్ట్రీలో నిరంతరం చర్చ జరుగుతూనే ఉంటుంది. కొన్నేళ్ల క్రితం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన `నరసింహుడు` సినిమా విడుదల నాటి ఒక ఆసక్తికరమైన సంఘటనను నటుడు శ్రీనివాసరెడ్డి ఒక ఇంటర్వ్యూలో సరదాగా షేర్ చేయడంతో ఈ విషయం మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మాస్ దర్శకుడు బి. గోపాల్ - ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న `నరసింహుడు` చిత్రంపై అప్పట్లో ప్రేక్షకులు, అభిమానుల్లో కనీవిని ఎరుగని రేంజ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదల రోజున థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం.. ఉత్కంఠ వాతావరణం విపరీతంగా ఉంది. అయితే సినిమా ప్రదర్శన ఆలస్యం కావడంతో తారక్‌తో పాటు ఆయన సన్నిహితులు... ఇతర నటులు ఫలితం కోసం తీవ్రమైన ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.
సరిగ్గా అదే సమయంలో ఎన్టీఆర్ చుట్టూ ఉన్న కొందరు ఆయన వద్దకు వచ్చి ఓవర్ బిల్డప్ ఇవ్వడం ప్రారంభించారు. థియేటర్లలో రెస్పాన్స్ మామూలుగా లేదని.. ఎన్టీఆర్ స్క్రీన్ పై కనిపించగానే థియేటర్ల కప్పులు బద్దలైపోతున్నాయంటూ అతిగా పొగిడేస్తూ సినిమాకి మైండ్ బ్లాకింగ్ టాక్ వచ్చిందని చెప్పారు. హీరోను ప్రసన్నం చేసుకోవడానికి బయటి పరిస్థితితో సంబంధం లేకుండా వారు చెప్పిన ఆ అబద్ధపు వార్తలు ఆ సమయంలో అక్కడ ఉన్నవారికి కాసేపు నిజమేనేమో అనిపించేలా చేశాయి.
అయితే ఆ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. ఖమ్మం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అసలు రిపోర్టుల ద్వారా బయట సినిమా టాక్ అనుకున్న స్థాయిలో లేదని... డివైడ్ టాక్ వచ్చిందనే చేదు నిజం త్వరగానే బయటపడింది. భజంత్రీల బ్యాచ్ చెప్పిన బిల్డప్‌కు.. బయట ఉన్న అసలు రియాలిటీకి నడుమ కొండంత తేడా ఉండటంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కొద్దిసేపటి క్రితం వరకు ఆకాశానికి ఎత్తేసిన వాళ్ళు.. అసలు నిజం బయటపడటంతో సైలెంట్ అయిపోయారు.
ఈ పరిణామాన్ని గమనించిన ఎన్టీఆర్ ఏమాత్రం కుంగిపోకుండా.. చుట్టూ ఉన్నవారు ఇచ్చిన ఓవర్ బిల్డప్‌ను .. మారిన పరిస్థితులను చూసి పక్కున నవ్వేశారు. దీంతో అక్కడ ఉన్న టెన్షన్ వాతావరణం అంతా ఒక్కసారిగా పోయి లైట్ మోడ్‌లోకి మారిపోయింది. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఆనాటి అనుభవాన్ని శ్రీనివాసరెడ్డి ఎంతో సరదాగా వివరించిన ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.