ఇక థ్రిల్లర్ జానర్ జోలికి వెళ్లను: 'దృశ్యం' ఫేం జీతూ
అంతేకాదు.. జార్జి కథకు సరైన ముగింపు లభించాక దృశ్యంకి ముగింపు పలుకుతున్నానని, ఇకపై తాను థ్రిల్లర్ జానర్ సినిమాలు తీయనని జీతూ జోసెఫ్ తెలిపారు.;
పర్ఫెక్ట్ స్క్రిప్ట్, సీన్ మేకింగ్, తారా బలం అన్నీ కలిసొస్తే థ్రిల్లర్లను బ్లాక్ బస్టర్‌లుగా మలచడం కష్టం కాదని నిరూపించారు మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్. కథ, కథనం పరంగా చాలా హార్డ్ వర్క్ చేసాకే అతడు సెట్స్ పైకి వెళతాడు. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్లను రూపొందించడంలో `దృశ్యం` ఫ్రాంఛైజీతో అతడు తన స్పెషాలిటీని నిరూపించాడు. ఇప్పటికీ తెలుగు, తమిళ దర్శకులు తనకు ఫోన్ చేసి థ్రిల్లర్ ని తెరకెక్కించడంలో లాజిక్ ఏమిటో చెప్పాలని అడుగుతారని జీతూ అంటున్నారు.
అయితే జీతూ తెరకెక్కించిన దృశ్యం, దృశ్యం 2 చిత్రాలు పలు భాషల్లోకి రీమేక్ అయి అక్కడ కూడా విజయం సాధించడం వల్ల అతడి ఇమేజ్ అంతటా పెరిగింది. థ్రిల్లర్ జానర్ స్పెషలిస్టుగా అతడికి సాటి దర్శకుల్లో కూడా గౌరవం పెరిగింది. ఇప్పుడు దృశ్యం 3 ని కూడా గ్రిప్ చెడకుండా, ఆద్యంతం సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నానని జీతూ చెబుతున్నారు.
అంతేకాదు.. జార్జి కథకు సరైన ముగింపు లభించాక దృశ్యంకి ముగింపు పలుకుతున్నానని, ఇకపై తాను థ్రిల్లర్ జానర్ సినిమాలు తీయనని జీతూ జోసెఫ్ తెలిపారు. ఈ జానర్ పై విసుగొచ్చింది. నేను ఒక బాక్స్ లో ఉండిపోయానని నిరాశను వ్యక్తపరిచారు జీతూ. ఈ శైలితో విసిగిపోయానని చెప్పారు. మనోరమ న్యూస్ కాన్క్లేవ్ 2025లో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా మలయాళ పరిశ్రమలో థ్రిల్లర్లు ప్రస్తుతం ఎలా ఆధిపత్యం చెలాయిస్తున్నాయో వెల్లడించారు. థ్రిల్లర్ లతో విసిగిపోయాను.. ఇక ఏదైనా కొత్తగా ట్రై చేస్తానని అతడు అన్నారు. రిపీటెడ్ గా అదే జానర్ తో సినిమాలు తీస్తే ప్రేక్షకులకు కూడా విసుగొస్తుందని అన్నారు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న దృశ్యం 3 స్క్రిప్టు కోసం చాలా శ్రమించానని, అదనంగా శ్రమించి అదనపు సన్నివేశాలను రాసానని కూడా వెల్లడించారు జీతూ.