'దృశ్యం 3' ఎఫెక్ట్‌: అజ‌య్ దేవ్‌గ‌న్‌కి దిమ్మ‌దిరిగే షాక్!

'దృశ్యం', దృశ్యం 2`ల‌తో సూప‌ర్ హిట్‌ల‌ని ద‌క్కించుకున్న ఆయ‌న ఇప్పుడు దానికి కొన‌సాగింపుగా `దృశ్యం 3`ని తెర‌పైకి తీసుకొస్తున్నారు.;

Update: 2026-01-07 06:58 GMT

మ‌ల్లూవుడ్ డైరెక్ట‌ర్ జీతూ జోసెఫ్ బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ‌గ‌న్‌కు దిమ్మ‌దిరిగే షాక్ ఇచ్చాడా?. త‌న‌కంటే ముందే `ద‌శ్యం 3`ని రిలీజ్ చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించి భారీ దెబ్బ‌కొట్టాడా? అంటే మ‌లయాళ ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అవున‌నే చెబుతున్నాయి. వివ‌రాల్లోకి వెళితే...జీతూ జోసెఫ్‌..ఇండియ‌న్ సినీ హిస్ట‌రీలోనే క్రైమ్ థ్రిల్ల‌ర్‌తో సిరీస్‌ని విజ‌య‌వంతంగా ర‌న్ చేస్తూ మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న ఏకైక ద‌ర్శ‌కుడాయ‌న‌. మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీతో పాటు దేశ వ్యాప్తంగా `దృశ్యం` సీక్వెల్స్‌తో భారీ క్రేజ్‌ని సొంతం చేసుకున్నారు.

'దృశ్యం', దృశ్యం 2`ల‌తో సూప‌ర్ హిట్‌ల‌ని ద‌క్కించుకున్న ఆయ‌న ఇప్పుడు దానికి కొన‌సాగింపుగా 'దృశ్యం 3'ని తెర‌పైకి తీసుకొస్తున్నారు. మోహ‌న్‌లాల్, మీనా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ థ‌ర్డ్ ఇనిస్టాల్‌మెంట్‌పై స‌ర్వ‌త్రా అంచ‌నాలున్నాయి. సెకండ్ పార్ట్ కోవిడ్ కార‌ణంగా థియేట‌ర్ల‌లో రిలీజ్ కాకుండా ఓటీటీలో స్ట్రీమింగ్ కావాల్సి వ‌చ్చింది. అయితే పార్ట్ 3ని భారీ స్థాయిలో థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ మొత్తం పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.

తాజాగా ఈ మూవీని ఏప్రిల్‌లో రిలీజ్ చేస్తున్న‌ట్టుగా ద‌ర్శ‌కుడు జీతూ జోసెఫ్‌ ప్ర‌క‌టించారు. ఓ హాస్పిట‌ల్ ప్రారంభోత్స‌వంలో పాల్గొన్న ద‌ర్శ‌కుడు జీతూ 'దృశ్యం 3'ఏప్రిల్ ఫ‌స్ట్ వీక్‌లో థియేట‌ర్ల‌లోకి వ‌స్తుంద‌ని క‌న్ఫ‌ర్మ్ చేశాడు. ఎలాంటి ఎక్స్‌పెక్టేష‌న్స్ లేకుండా ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వెళ్లాల‌న్నారు. అంతే కాకుండా జాతీయ మీడియాతో మాట్లాడుతూ 'దృశ్యం' చాలా ఏళ్లుగా ఎంతో మందిని ప్ర‌భావితం చేసిన సినిమా. పార్ట్ 3పై భారీ అంచ‌నాలున్నాయి. అయితే ఎలాంటి అంచ‌నాలు పెట్టుకోకుండా ఈ సినిమా చూడ‌మ‌ని ప్రేక్ష‌కుల్ని కోరుతున్నాను` అన్నారు.

ఇక సినిమా రిలీజ్ ఏప్రిల్ ఫ‌స్ట్ వీక్‌లో ఉంటుంద‌ని చెప్పిన ఆయ‌న డేట్‌ని త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టిస్తామ‌న్నారు. జ‌న‌వ‌రి 30న తాను రూపొందించిన మ‌రో సినిమా `వ‌ల్లాతు వాశంతే క‌ల్లాన్‌` రిలీజ్ అవుతోంద‌ని తెలిపారు. ఇదిలా ఉంటే జీతూ జోసెఫ్ `దృశ్యం 3`ని ఏప్రిల్ లో రిలీజ్ చేస్తుండ‌టంతో అజ‌య్ దేవ‌గ‌న్ `దృశ్యం 3`పై చ‌ర్చ జ‌రుగుతోంది. దీన్ని అక్టోబ‌ర్‌లో రిలీజ్ చేస్తున్నారు. దీనికి స‌రిగ్గా ఐదు నెల‌ల ముందే జీతూ జోసెఫ్ ..మోహ‌న్ లాల్‌తో చేస్తున్న సినిమాని రిలీజ్ చేస్తుండ‌టంతో అజ‌య్ మూవీపై తీవ్ర ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

గ‌త రెండు భాగాల‌ని జీతూ జోసెఫ్ అండ్ కో నుంచి రైట్స్ తీసుకుని చేసిన అజ‌య్ దేవ‌గ‌న్ మూడ‌వ పార్ట్‌ని వారికి సంబంధం లేకుండానే తెర‌పైకి తీసుకొస్తున్నాడు. దీంతో 'దృశ్యం' ఒరిజిన‌ల్ మేక‌ర్స‌కి, అజ‌య్‌కి మ‌ధ్య వైరం మొద‌లైంది. అదే ఇప్పుడు అజ‌య్ చేస్తున్న‌'దృశ్యం 3'కి ఇబ్బందిక‌రంగా మారుతోంద‌నే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. ఐదు నెల‌ల ముందు మోహ‌న్‌లాల్ `దృశ్యం 3` చూసిన ప్రేక్ష‌కులు అజ‌య్ మూవీపై పెద్ద‌గా ఆస‌క్తిని చూపించే అవ‌కాశం లేదు. దీంతో అజ‌య్ టీమ్ తీవ్ర ఒత్తిడికి గుర‌వుతోంద‌ని బాలీవుడ్‌లో కామెంట్‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఈ గండాన్ని అజ‌య్ దేవ‌గ‌న్ ఎలా అధిగ‌మిస్తాడో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News