సీనియర్ ఎన్టీఆర్ నోట హిందీ పాటలు
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు తెలుగు సినీ సీమను ఏకంగా మూడున్నర దశాబ్దాల పాటు తిరుగులేని ఆధిపత్యంతో ఏలారు.;
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు తెలుగు సినీ సీమను ఏకంగా మూడున్నర దశాబ్దాల పాటు తిరుగులేని ఆధిపత్యంతో ఏలారు. ఆయన 1949లో సినీ రంగ ప్రవేశం చేశారు. 1982లో రాజకీయ రంగ ప్రవేశం చేసేంతవరకు నటిస్తూనే ఉన్నారు. తిరిగి 1989 నుంచి 93 వరకూ మరో నాలుగేళ్ళ పాటు మాజీ సీఎం గా ఉంటూ సినిమాలు తీశారు, నటించారు, దర్శకత్వం వహించారు. మొత్తంగా 35 ఏళ్ళ సినీ హిస్టరీ ఎన్టీఆర్ సొంతం అని చెప్పాలి.
మంచి సంగీత ప్రియుడు :
ఎన్టీఆర్ మంచి సంగీత ప్రియుడు అన్నది అంతా చెబుతారు. ఆయన సొంత నిర్మాణ సంస్థ ఎన్ ఏటీ నుంచి నిర్మించిన చిత్రాలలో అయితే ప్రతీ పాటను దగ్గరుండి సంగీత దర్శకుల వద్ద కూర్చుని మరీ ఇష్టంగా చేయించుకునేవారు. అంతే కాదు ఘంటసాలతో కలిసి కొన్ని సినిమాలలోని పాటలలో తన పదాలను కలిపి గాయకుడిగా సరదా తీర్చుకున్నారు. ఆయనకు తెలుగు సంగీత దర్శకులలో అందరూ ఇష్టమే కానీ ఎక్కువగా టీవీ రాజుని ఆయన అభిమానించేవారు. తన సొంత సినిమాలు అన్నీ ఆయనతోనే మ్యూజిక్ చేయించేవారు.
హిందీలో ఆయనంటే :
ఇక రామారావుకు హిందీ పాటల మోజు బహు ఎక్కువే అని చెబుతారు. ఆయన ఎన్నో హిందీ పాటలను స్వయంగా ఆలపిస్తూ షూటింగ్ లో షాట్ గ్యాప్ లో తన తోటి నటీనటులను రంజింపచేసేవారు అని కూడా అలనాటి తారలు ఆ అనుభవాలను ముచ్చట్లు చెబుతారు. ఆయనకు హిందీలో సంగీత దర్శకుడు సి. రామచంద్ర అంటే ఇష్టం అని అంటారు. ఆయనతోనే తన సొంత చిత్రం అక్బర్ సలీం అనార్కలి మూవీకి సంగీతం చేయించారు. అలాగే లక్ష్మీ కాంత్ ప్యారేలాల్ జంట అన్నా ఇష్టమే. వారితోనే ఎన్టీఆర్ తన బ్రహ్మశ్రి విశ్వామిత్ర సినిమాకు సంగీతం చేయించారు.
ఆయన అంటే చాలా :
ఇక తెలుగులో ఘంటసాలను ఎక్కువగా ఇష్టపడే ఎన్టీఆర్ హిందీకి వచ్చేసరికి మహమ్మద్ రఫీ పాటలు అంటే ప్రాణం పెట్టేవారు. ఆ ఇష్టం ఎంతదాకా వెళ్ళింది అంటే మహమ్మద్ రఫీని తెలుగుకు రప్పించి తన చిత్రాలకు పాటలు పాడించారు. అలా ఎన్నో హిట్ సాంగ్స్ రఫీ పాడగా తెర మీద ఎన్టీఆర్ వాటికి అభినయించి చిరస్థాయిగా నిలిచేలా చేశారు.
హిందీ పాటలతోనే :
ఇదిలా ఉంటే సీనియర్ నటీమణి జయసుధ ఎన్టీఆర్ తో తన సినిమాలు ఆయనతో షూటింగ్ గ్యాప్ లో మాటలు ముచ్చట్లు గురించి ఒక యూట్యూబ్ చానల్ కి వివరిస్తూ జనాలకు తెలియని కొత్త విషయాలు చెప్పారు. ఎన్టీఆర్ కి హిందీ పాటలు ఇష్టమే కాదు ఆయన వాటిని ఎంతో బాగా పాడేవారు అని జయసుధ చెప్పారు. ఆ పాటలను తాము వింటూ ఎంతో ఎంజాయ్ చేసేవారమని చెప్పారు. ఎన్టీఆర్ గంభీరంగా సెట్స్ లో ఉంటారని అంటారని ఆయన ఒక్కోసారి పాటలు పాడుతూ అందరినీ ఆనందపరచేవారు అని అంటూ మరో కోణాన్ని జనాలకు చెప్పారు. ఆయనతో తాను ఏకంగా 20 కి పైగా సినిమాలలో హీరోయిన్ గా చేశాను అని సొంత బ్యానర్ లో కూడా నాలుగైదు సినిమాల్లో చేశాను అని జయసుధ గుర్తు చేసుకున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ లో గాయక ప్రతిభ కూడా ఉంది అన్నది పాత వారికి తెలిసినా ఈనాటి తరానికి ఇది కొత్త విషయమే మరి.