ఆ మూడో వ్యక్తి వల్లనే మా బంధం ముక్కలైంది: ఆర్తి రవి
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి- ఆర్తి దంపతుల మధ్య గొడవలు మీడియాలో రచ్చకెక్కుతున్న సంగతి తెలిసిందే.;
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి- ఆర్తి దంపతుల మధ్య గొడవలు మీడియాలో రచ్చకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విడాకుల కేసు విచారణలో ఉంది. ఇలాంటి సమయంలో ఒకరిపై ఒకరు ఆరోపణలతో దూషణలకు దిగడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే జయం రవి వర్సెస్ అత్తమ్మ ఎపిసోడ్స్ చర్చనీయాంశంగా మారాయి. అల్లుడు సినీహీరోగా నిలబడటం కోసం 100 కోట్లు పైగా అప్పు చేసానని ఆమె వ్యాఖ్యానించారు.
ఇప్పుడు జయం రవి భార్య ఆర్తి రవి సంచలన ఆరోపణలు చేసారు. తమ మధ్య మూడో వ్యక్తి ప్రవేశం వల్లనే ఇప్పుడు తమ బంధం బ్రేక్ అయిందని, తన జీవితం చీకటిమయం అయిందని ఆర్తి ఆరోపించారు. డబ్బు, అధికారం, జోక్యం లేదా నియంత్రణ వీటిలో ఏవీ మా వివాహం దెబ్బతినడానికి కారణం కాదు. మా మధ్యలో మూడవ వ్యక్తి ఉన్నారు. మా బంధాన్ని విచ్ఛిన్నం చేసింది బయటి వ్యక్తి! అని ఆర్తి ఆరోపించారు.
ఇటీవలే ఒక పెళ్లిలో జయం రవి తన స్నేహితురాలు కెనీషాతో కనిపించారు. ఆ తర్వాత ఆర్తి వరుసగా నోట్ లు రాస్తున్నారు. ఇప్పుడు రెండోసారి నోట్ లో తన ఆవేదనను వ్యక్తం చేసారు. అయితే కెనీషా తనకు స్నేహితురాలు మాత్రమేనని జయం రవి చెబుతున్నాడు. కెనీషా తన జీవితంలో వెలుగు నింపిందని కూడా ఇంతకుముందు జయం రవి అన్నాడు. దానికి ఆర్తి స్పందిస్తూ...`మీ జీవితపు వెలుగు మా జీవితంలోకి చీకటిని మాత్రమే తెచ్చింది`` అని వ్యాఖ్యానించారు. విడాకుల పత్రాలు దాఖలు చేయడానికి చాలా కాలం ముందు నుంచి ఈ వ్యక్తి మా మధ్యలో ప్రవేశించిందని కూడా ఆర్తి ఆరోపించారు. ఇది ఊహ కాదు.. నా దగ్గర రుజువు ఉందని అన్నారు.
నా భారిన పడకుండా తప్పించుకుని వెళ్లిపోతే, నేరుగా అతడు విడిపోయిన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి ఉంటే బాగుండేది. దాని బదులు అతడు ఆమె తలుపు తట్టాడు.. అది మరింత నష్టం కలిగించింది.. అని ఆర్తి వ్యాఖ్యానించారు. అయితే మానసిక వైద్య నిపుణురాలైన కెనీషా వద్దకు చికిత్స కోసం వెళ్లానని జయం రవి ఇంతకుముందు వెల్లడించిన సంగతి తెలిసిందే.