ఐమాక్స్‌లో థ్రిల్లర్ చూడాలనుకుంటే జాన్వీ కనిపించింది..!
స్టీవెన్ స్పీల్‌బర్గ్ దర్శకత్వంలో వచ్చిన అమెరికన్ థ్రిల్లర్ మూవీ 'జాస్' ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.;
స్టీవెన్ స్పీల్‌బర్గ్ దర్శకత్వంలో వచ్చిన అమెరికన్ థ్రిల్లర్ మూవీ 'జాస్' ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1975లో విడుదలైన జాస్ సినిమా అప్పట్లోనే దాదాపుగా 470 మిలియన్‌ల వసూళ్లు రాబట్టింది. ఇప్పటి లెక్కన చూసుకుంటే కనీసం బిలియన్ కి మించి అన్నట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పీటర్ బెంచ్లీ రాసిన నవల ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో రాయ్ స్కైడర్, పోలీస్ చీఫ్ మార్టిన్ బ్రాడీగా నటించాడు. ఈ హాలీవుడ్ అద్భుతం విడుదల అయ్యి 50 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఐమాక్స్ ఫార్మట్‌లో సినిమాను విడుదల చేసేందుకు సిద్ధం అయ్యారు.
ఐమాక్స్‌లో పరమ్ సుందరి
ప్రపంచ వ్యాప్తంగా జాస్ ఐమాక్స్ ఫార్మట్ లో సినిమా ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తూ ఉంది. ఇండియాలో ఆగస్టు 29 అంటే నేడు ఐమాక్స్ లో ఈ సినిమా స్క్రీనింగ్ కావాల్సి ఉంది. ఐమాక్స్ అధికారికంగానే ఈ సినిమాను స్క్రీనింగ్ చేయబోతున్నట్లు పోస్టర్‌లను విడుదల చేయడంతో పాటు, ఆన్ లైన్ ద్వారా టికెట్లను సైతం విక్రయించే పని పెట్టుకుంది. కానీ అనూహ్యంగా ఐమాక్స్ లో జాస్ సినిమా కాకుండా జాన్వీ కపూర్ నటించిన పరమ్ సుందరి స్క్రీనింగ్ అవుతుంది. గత కొన్ని రోజులుగా జాస్ సినిమాను చూడాలని ఆశగా ఎదురు చూస్తున్న సినీ ప్రేమికులు షాక్ అవుతున్నారు. థ్రిల్లర్ చూడాలి అనుకుంటే ఇలా పరమ్ సుందరి సినిమాను చూపించారు ఏంటి అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఐమాక్స్ యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
జాస్ సినిమా రీ రిలీజ్
ఇండియాలో ఎందుకు జాస్ సినిమాను స్క్రీనింగ్ చేయడం లేదు అనే విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే జాస్ కు బదులుగా ఐమాక్స్ లో స్క్రీనింగ్ అవుతున్న పరమ్ సుందరి సినిమాకు మంచి స్పందన వస్తుందని యూనిట్ సభ్యులు అంటున్నారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ యొక్క అందాల ఆరబోత ఫోటోలు, వీడియోలను షేర్ చేయడం ద్వారా సినిమాకు మంచి పాపులారిటీ దక్కింది. అందుకే ఈ సినిమా విడుదలకు దాదాపు రెండు మూడు వారాల నుంచే సోషల్ మీడియాలో బజ్ పెరిగింది. అయితే అడ్వాన్స్ బుకింగ్ విషయంలో మాత్రం కాస్త నిరుత్సాహం తప్ప లేదు. అయినా కూడా సినిమా విడుదల తర్వాత వచ్చిన టాక్ తో మంచి వసూళ్లు నమోదు అవుతాయని అంటున్నారు.
ఐమాక్స్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్
ఇండియాలో ఐమాక్స్ ఫార్మట్ లో ఇప్పటికే చాలా హాలీవుడ్ సినిమాలు విడుదల అయ్యాయి. అందులో భాగంగా జాస్ సినిమాను భారీ ఎత్తున విడుదల చేస్తే చూడాలని అంతా ఆశ పడ్డారు. కానీ కారణం చెప్పకుండానే ఐమాక్స్ వారు జాస్ సినిమా స్క్రీనింగ్‌ను వేయలేదు. సోషల్ మీడియాలో ఈ విషయం గురించి ప్రేక్షకులు, ముఖ్యంగా జాస్ సినిమాను ఐమాక్స్‌లో చూడాలి అని ఆశ పడ్డవారు తీవ్రంగా విమర్శలు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. అసలు ఎందుకు ఐమాక్స్ ఫార్మట్ లో జాస్ సినిమాను విడుదల చేయలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఐమాక్స్ నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. ముందు ముందు అయినా ఈ సినిమాను ఐమాక్స్ ఫార్మట్ లో ఇండియాలో స్క్రీనింగ్ చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు.